తీరమంతా తియ్యనంట.. | Sugarcane Farmers Making Jaggery In Srikakulam | Sakshi
Sakshi News home page

తీరమంతా తియ్యనంట..

Published Wed, Jan 6 2021 9:34 AM | Last Updated on Wed, Jan 6 2021 9:34 AM

Sugarcane Farmers Making Jaggery In Srikakulam - Sakshi

సంక్రాంతి సీజన్‌ వచ్చిందంటే చాలు పిండి వంటకాలు సిద్ధమైపోతుంటాయి. ప్రధానంగా అరిసెలు, బెల్లం ఉండలు వంటివి చేయాలంటే బెల్లం తప్పనిసరి. అందుకే ఈ సీజన్‌లో  మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువ. మరోవైపు శుభకార్యాల సమయంలోనూ బెల్లం అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో నాగావళి తీరంలో చెరకు సాగుచేస్తున్న రైతులు బెల్లం తయారీలో నిమగ్నమయ్యారు. వేడి వేడి బెల్లాన్ని చెక్కీల రూపంలో మార్కెట్‌కు అందిస్తున్నారు. 

సాక్షి. రాజాం(శ్రీకాకుళం): జిల్లాలో ఏకైక షుగర్‌ ఫ్యాక్టరీ ఫ్యారిస్‌ చక్కెర కర్మాగారం సంకిలి వద్ద ఉంది. దీంతో పరిసర ప్రాంత రైతులు ఎక్కువగా చెరకును సాగు చేస్తుంటారు.  నాగావళి నదీతీర మండలాలైన వంగర, రేగిడి, సంతకవిటి, బూర్జ తదితర మండలాల్లో భూములు అనుకూలంగా ఉండటంతో ఎక్కువ మంది వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు సాగు చేస్తుంటారు.  సారవంతమైన భూములు కావడంతో రసాయనాలు వినియోగించకుండానే మంచి రంగు, తియ్యదనంతో కూడిన బెల్లం తయారవుతుంది. కొత్తూరు, జావాం, హొంజరాం, చిత్తారిపురం, బూరాడపేట, రేగిడి మండలంలోని ఖండ్యాం, కొమెర, బూర్జ మండలంలోని గుత్తావల్లి, నారాయణపురం, బూర్జ ప్రాంతాల్లోని బెల్లానికి మంచి డిమాండ్‌ ఉంటుంది. ఇక్కడ బెల్లం గానుగల వద్దే విక్రయాలు జరిగిపోతుంటాయి.

కుండలు నుంచి చెక్కీలు వైపు.. 
ఎకరా చెరకు పంటను బెల్లం తయారు చేసేందుకు సాధారణంగా 15 నుంచి 20 రోజుల కాలం పడుతుంది. పొలంలో చెరకును నరికి ఎండ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా గానుగల వద్దకు తీసుకొస్తారు. అక్కడ చెరకు గడలను నునుపుగా చేసి గానుగ యంత్రం ద్వారా రసం తీస్తారు. ఈ రసాన్ని ఇనుప పెనంలో వేసి పాకం తీస్తారు. బాగా పాకం వచ్చిన తర్వాత పక్కనే ఉన్న ఇనుప పల్లెంలో బెల్లం పాకం వేసి చెక్కీలు తయారుచేస్తారు. గతంలో బెల్లాన్ని కుండలకు ఎక్కించేవారు. ఇప్పుడు టెక్నాలజీ రావడంతో చెక్కీలకు ఎక్కించి అనంతరం కవర్లులో పెట్టి మార్కెట్‌కు తరలిస్తున్నారు. చిన్న చెక్కీ 6 నుంచి 7 కిలోలు ఉండగా, పెద్ద చెక్కీలు 14 కిలోలు ఉంటాయి.

వాతావరణం అనుకూలించింది..
మాకున్న కొద్దిపాటి పొలంలో ఈ ఏడాది చెరకు సాగుచేశాం. ప్రస్తుతం పంట కోతదశకు వచ్చింది. బెల్లం తయారు చేస్తున్నాం. మార్కెట్లో డిమాండ్‌ పెరిగింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో పంట దిగుబడి బాగుంది.  
– లావేటి లక్షున్నాయుడు, చెరకు రైతు, బూరాడపేట

డిమాండ్‌ ఉంది.. 
ప్రస్తుతం చెరకు పంట అన్ని ప్రాంతాల్లో కోతదశలో ఉంది. మేం చెరకును గానుగ ఆడించి బెల్లం తయారుచేస్తున్నాం. మార్కెట్‌లో డిమాండ్‌ ఉండటంతో పెట్టుబడులు పోనూ మంచి లాభం కనిపిస్తోంది.  
– మునకలసవలస దాలయ్య, చెరకు రైతు, హంజరాం

సాగు బాగుంది... 
బెల్లం తయారీచేసే రైతులకు చెరకు సాగు అనుకూలిస్తోంది. జిల్లాలో తయారయ్యే బెల్లం నాణ్యతతో ఉంటుంది. ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంది. ఆరోగ్యపరంగా  బెల్లం మనిషికి ఎంతో మంచిది. 
– డాక్టర్‌ జి.చిట్టిబాబు, కృషివిజ్ఞానకేంద్రం, ఆమదాలవలస

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement