
సాక్షి, అమరావతి: లుక్ అవుట్ నోటీసుల నేపథ్యంలో తాను అమెరికాకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి హైకోర్టును ఆశ్రయించారు. జులై రెండోవారంలో జరుగబోయే ఓ సదస్సుకు హాజరయ్యేందుకు తాను అక్కడికి వెళ్లాల్సి ఉందని, అందుకే తన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే సుజనా చేసిన అపీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. అమెరికా నుంచి అందిన ఆహ్వానం సమర్పించకుండా అత్యవసర విచారణ ఎలా చేపడతారని మందలించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను జులై 7కి వాయిదా వేసింది. మరోవైపు బెస్ట్ అండ్ క్రాంప్టన్ కేసులో సుజనాకు జారీ చేసిన సీబీఐ నోటీసులపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విషయమై అవసరమైతే మళ్లీ పిలుస్తామని న్యాయస్థానం పేర్కొంది.