‘సుజనా’ మూసివేతపై సత్వరం తేల్చండి | Bank of Mauritius to the High Court on the closure of the Universal sujana | Sakshi
Sakshi News home page

‘సుజనా’ మూసివేతపై సత్వరం తేల్చండి

Published Fri, Apr 17 2015 2:24 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM

‘సుజనా’ మూసివేతపై సత్వరం తేల్చండి - Sakshi

‘సుజనా’ మూసివేతపై సత్వరం తేల్చండి

సుజనా యూనివర్సల్  మూసివేతపై మళ్లీ హైకోర్టుకు మారిషస్ బ్యాంక్
తమ పిటిషన్ విచారణకు స్వీకరించాలంటూ మరో పిటిషన్
కేసు అడ్మిషన్‌పై వాదన లు ముగిసి 4 నెలలైనా ఉత్తర్వులు రాలేదని వెల్లడి

 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో  కేంద్ర మంత్రి, తెలుగుదేశం నేత సుజనా చౌదరి రూ. 102 కోట్లు రుణం ఎగ్గొట్టిన వివాదంపై మారిషస్ కమర్షియల్ బ్యాంకు (ఎంసీబీ) మరోసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్‌ను మూసివేయాలంటూ గతంలో వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడంపై సత్వరం తగిన తీర్పునివ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మరో పిటీషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి వాదనలు పూర్తయి, తీర్పును రిజర్వ్‌లో ఉంచి నాలుగు నెలలు అయినప్పటికీ ఇంతవరకూ ఉత్తర్వులు ఇవ్వలేదంటూ పేర్కొంది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్‌ను మూసివేయాలంటూ 18-7-2014న పిటిషన్ వేశామని ఎంసీబీ వివరించింది. 8-12-2014న దీన్ని లిస్ట్ చేయడం జరిగిందని పేర్కొంది. సెటిల్మెంట్ చర్చలు విఫలం కావడంతో, ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కేసును అడ్మిట్ చేసుకునే విషయంలో హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచినట్లు వివరించింది. ఇది జరిగి నాలుగు నెలలు గడిచినప్పటికీ ఇంతవరకూ ఏ ఉత్తర్వులూ రాలేదని వివరించింది. ఈ నేపథ్యంలోనే సత్వర తీర్పు కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొంది. రిజర్వ్‌లో ఉంచిన తేదీ నుంచి మూడు నెలల్లోగా తుది ఉత్తర్వులు ఇవ్వకపోతే, సత్వర తీర్పు కోరుతూ పార్టీలు హైకోర్టును ఆశ్రయించవచ్చంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈ సందర్భంగా మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) ఉటంకించింది. అలాగే, వాదనలు ముగిశాక ఒకవేళ తీర్పు రెండు నెలల్లోగా రాని పక్షంలో దానిపై దృష్టి పెట్టాలని సదరు బెంచ్‌ను ఆదేశించడం లేదా కొత్తగా వాదనలు వినేందుకు మరో బెంచీకైనా బదలాయించే అవకాశాలు ఉన్న సంగతిని ప్రస్తావించింది.

జరిగింది ఇదీ..: గృహోపకరణాల తయారీ రంగంలో ఉన్న సుజనా యూనివర్సల్‌కు పీఏసీ వెంచర్స్ (సింగపూర్), హెస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్(మారిషస్) పేరిట విదేశాల్లో పలు అనుబంధ సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఏటా వేల కోట్ల రూపాయల లావాదేవీలు చూపిస్తుంటాయి. అయితే, రుణాల కోసం లేని టర్నోవరు చూపిస్తుంటామని, వీటిలో చాలా వరకూ లావాదేవీలు బోగస్‌వేనని గతంలో స్వయంగా సుజనా చౌదరే అమ్మకం పన్ను అధికారులకు లిఖితపూర్వకంగా చెప్పారు కూడా. ఇక, తాజా కేసు విషయంలో సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్‌కి మారిషస్‌లో ఉన్న అనుబంధ సంస్థ  2010 నవంబర్ 9న ఎంసీబీ నుంచి  కోటి డాలర్లు (సుమారు రూ. 60 కోట్లు) రుణం తీసుకుంది. దీనికి సుజనా యూనివర్సల్ సంస్థ గ్యారంటీ ఇచ్చింది. కొన్నాళ్లు రుణ వాయిదాలు సవ్యంగానే చెల్లిం చిన సుజనా చౌదరి 2011లో మరింత రుణం కావాలని బ్యాంకును కోరారు. దీని ప్రకారం రుణ మొత్తాన్ని 2 కోట్ల డాలర్లకు (సుమారు రూ. 120 కోట్లకు) ఎంసీబీ పెంచగా 2012 జూన్ నాటికి ఆ మొత్తాన్ని సుజనా చౌదరి విత్‌డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి చెల్లిం పులు మానేశారు. ఎంసీబీ నోటీసులు ఇచ్చిన దరిమిలా హెస్టియా-సుజనా-మారిషస్ బ్యాం క్ కలిసి రుణ చెల్లింపు గడువు పొడిగిస్తూ మరో ఒప్పందం చేసుకున్నాయి. అయినా  సుజనా చెల్లించలేదు.

రుణ బకాయిలపై మారి షస్ కోర్టును ఎంసీబీ ఆశ్రయించగా సుజనా యూనివర్సల్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం ద్వారా సొమ్ము వసూలు చేసుకోవచ్చంటూ న్యాయస్థానం డిక్రీ ఇచ్చింది. దీని ప్రకారం అసలు రూ. 102 కోట్లు, వడ్డీ.. కోర్టు ఖర్చులు కలిపి సుజనా రూ.106 కోట్లు చెల్లించాల్సి ఉంది.  దీని ఆధారంగానే హైదరాబాద్ సివిల్ కోర్టులో ఎంసీబీ కేసు దాఖలు చేసింది. దీనికి సంబంధించి సుజనా యూనివర్సల్‌కు 7 బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను స్తంభింపచేయడంతో పాటు కంపెనీ కార్యాలయంలోని కంప్యూటర్లు మొదలైన వాటన్నింటినీ అటాచ్  చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement