Supreme Court Key Comments On YS Avinash Reddy Bail Petition - Sakshi
Sakshi News home page

అవినాశ్‌ ముందస్తు బెయిలుపై నిర్ణయానికి ఇన్ని రోజులా! 

Published Tue, May 23 2023 12:51 PM | Last Updated on Wed, May 24 2023 8:11 AM

Supreme Court Key Comments On YS Avinash Reddy Bail Petition - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిలుపై నిర్ణయం తీసుకోవడానికి ఇన్ని రోజులా అని తెలంగాణ హైకోర్టుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తంచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఉత్తర్వులు జారీ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసింది. అవినాశ్‌ పిటిషన్‌పై ఈ నెల 25న హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపి తగిన ఆదేశాలివ్వాలని ఆదేశించింది. గతంలో మరో బెంచ్‌ విచారించినప్పటికీ వెకేషన్‌ బెంచ్‌ విచారణకు అడ్డంకి కాదని తెలిపింది. ఈ మేరకు  జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్‌ విచారణకు  (జూన్‌ 5) వచ్చే వరకు సీబీఐ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని లేదా తన పిటిషన్‌ను వెకేషన్‌ బెంచ్‌ విచారించేలా ఆదేశాలివ్వాలంటూ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన అప్లికేషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత హైకోర్టు విచారించలేదా అని జస్టిస్‌ నరసింహ ప్రశ్నించారు. హైకోర్టు రెండుసార్లు విచారించిందని, ఉత్తర్వులు ఇవ్వలేదని, జూన్‌ 5కు వాయిదా వేసిందని,  మే 15న సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయని అవినాశ్‌ తరపున సీనియర్‌ న్యాయవాది వి.గిరి తెలిపారు.

ఆ తర్వాత ఏం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించగా.. సీబీఐ నోటీసులు ఇచ్చిందన్నారు. ‘హైకోర్టులో విచారణ ఉండగా సీబీఐ నోటీసులు ఇవ్వడం గమనార్హం’ అని అభిప్రాయపడిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు హాజరు కాలేదు కదా అని అనగా.. ఏడుసార్లు పిటిషనర్‌ హాజరయ్యారని గిరి తెలిపారు. ఒక్క రోజు వ్యవధిలో రావాలని నోటీసులు ఇవ్వడంతో మూడు రోజులు సమయం కోరామన్నారు. సీబీఐ తరపున ఎవరైనా హాజరయ్యారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఎవరూ హాజరు కాలేదని వైఎస్‌ వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది లూత్రా తెలిపారు. హైకోర్టులో ఏప్రిల్‌ 27న ఇద్దరి పిటిషన్లూ విచారణకు వచ్చాయని, సీజే వద్దకు వెళ్లినా ఎలాంటి ఆర్డర్‌ రాలేదని, జూన్‌ 5న మేటర్‌ జాబితా అయిందని లూత్రా వివరించారు. జస్టిస్‌ నరసింహ జోక్యం చేసుకొని.. ఏమైనా అరెస్టు భయం ఉందా అని ప్రశ్నించారు.

తాను మొదటి నుంచి అదే చెబుతున్నానని, ఇప్పటికే అవినాశ్‌ తండ్రి అరెస్టయ్యారని, తల్లి ఆసుపత్రిలో ఉన్నారని గిరి చెప్పారు. ఈ సమయంలో లూత్రా జోక్యం చేసుకోవడంతో గిరి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. గిరిని ధర్మాసనం మందలించడంతో ఆయన ధర్మాసనానికి క్షమాపణలు తెలిపారు. బెయిలు కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని ధర్మాసనం లూత్రానుద్దేశించి వ్యాఖ్యానించింది. హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ గురించి ఆరా తీసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు వెకేషన్‌ బెంచ్‌ వినాలని సూచిస్తామని తెలిపింది. హైకోర్టుకు వెళ్లాలని ఇరువర్గాలకు తెలిపింది. అవినాశ్‌ వద్దకు వెళ్లాలని సీబీఐ ప్రయత్నించగా వందలాది మంది అనుచరులు అడ్డుకున్నారని లూత్రా అనగా.. అవన్నీ సీబీఐ న్యాయవాది చెబుతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం జస్టిస్‌ నరసింహ ఉత్తర్వులు వెలువరించారు.  

ఇది కూడా చదవండి: టీడీపీ మీడియాకే స్వేచ్ఛ ఉంటుందా.. విలువలు లేకుండా ఇంతలా దిగజారాలా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement