
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు గాలేరు–నగరి సుజల స్రవంతి నష్టపరిహారం విషయంలో సింగిల్, డివిజన్ బెంచ్‌ల తీర్పుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం న్యాయమూర్తులు.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎస్.రవీంద్రభట్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితుల నుంచి భూసేకరణ 1991లోనే పూర్తయిందని, 2007లో నష్టపరిహారం ఇచ్చామని ప్రభుత్వ న్యాయవాది మెహ్‌ఫూజ్కీ తెలిపారు.
2013 భూసేకరణ చట్టం ప్రకారం.. నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలంటూ ఏప్రిల్ 19, 2018న హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పు ఇచ్చిందన్నారు. అనంతరం రిట్ పిటిషన్లు ఆలస్యంగా దాఖలు చేశామంటూ తమ పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇదే అంశానికి సంబంధించి వేరే కేసులో సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో స్టే ఇచ్చిన విషయాన్ని మెహ్‌పూజ్కీ గుర్తు చేశారు. 4 వారాల్లో నిర్వాసితులు కౌంటర్ దాఖలు చేయాలని, 3 వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం తగిన సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment