పాల్గొన్న ఇరు రాష్ట్రాల అధికారుల బృందం
రాయదుర్గం: ఆంధ్రప్రదేశ్–కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లోని కర్ణాటక భూభాగంలో ఉండే ఏడు గనుల మైనింగ్ లీజుల విభజన ప్రక్రియపై గురువారం సీఈసీ కమిటీ సభ్యులు సర్వే నిర్వహించారు. 2009లోనే ఈ ఏడు గనుల్లో కంపెనీల కార్యకలాపాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. సీపీ గోయల్, ఎన్‌హెచ్ సునీల్ నేతృత్వంలో ఇరు రాష్ట్రాలకు చెందిన మైనింగ్, రెవెన్యూ, అటవీ, ల్యాండ్ రికార్డు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సర్వే కొనసాగింది.
కర్ణాటకలోని సండూరు తాలుకా తుమిటి, విఠలాపురం నుంచి ఏపీ సరిహద్దులోని అనంతపురం జిల్లా డి హీరేహాళ్ మండలం మలపనగుడి గ్రామ సరిహద్దులోని మోహబుల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ (ఎంబీటీ) గని వరకు సర్వే చేపట్టారు. హింద్ ట్రేడర్స్ (హెచ్‌టీ), టి.నారాయణరెడ్డి (టీఎన్‌ఆర్) తదితర గనుల లీజ్‌దారులు సర్వేలో పాల్గొని లీజు అగ్రిమెంట్లు అధికారులకు సమర్పించారు. వాటి ఆధారంగా పునఃపరిశీలన జరిపారు. సరిహద్దు ప్రాంతాలను జీపీఎస్ రీడింగ్‌తో సర్వేచేశారు.
గుర్తించిన రీడింగ్, పాయింట్లను రెవెన్యూ శాఖ హద్దులతో పోల్చి చూశారు. ఆ వివరాలను కేంద్ర ఉన్నతాధికారి సమితి (సీఈసీ)కి పంపనున్నట్లు అధికారులు తెలిపారు. వీటి ఆధారంగా ఈనెల 5న శుక్రవారం డోనమలై (ఎన్‌ఎండీసీ) ప్రాంతంలో ఇరు రాష్ట్రాల అధికారుల ఆధ్వర్యంలో లీజుదారులతో సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి మైనింగ్ ఏడీ నాగయ్య, డీఎఫ్‌ఓ వినీత్‌కుమార్, ల్యాండ్ సర్వే ఏడీ రూప్లానాయక్, కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణిసుస్మిత, ఫారెస్ట్ రేంజర్ పి.మధుబాబు, డీ.హీరేహాళ్ తహసీల్దార్ ఈశ్వరరెడ్డి, కర్ణాటక రాష్ట్ర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment