ఏపీలో మొదలైన విధ్వంసపాలన
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఆఫీస్ కూల్చివేత
బుల్డోజర్లతో రెండే గంటల్లో జరిగిన విధ్వంసం
తెల్లవారకముందే సీఆర్డీఏ ఆదేశాల్ని అమలు చేసిన మున్సిపల్ అధికారులు
గేట్లు మూసేసి మరీ పోలీసుల మోహరింపు మధ్య కూల్చివేత
సీఆర్డీయే ఆదేశాలపై కోర్టును ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ
అయినా పట్టించుకోకుండా.. నోటీసులివ్వకుండా కూల్చేసిన సీఆర్డీఏ
చంద్రబాబు నివాసం నుంచి టీడీపీ ఆఫీస్ వెళ్లే దారిలో ఉన్న ఈ ఆఫీస్
కావాలనే కూల్చివేయించారంటున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
కోర్టు ధిక్కరణపై న్యాయస్థానానికి వెళ్లే యోచనలో వైఎస్సార్‌సీపీ
గుంటూరు, సాక్షి: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, టీడీపీ విధ్వంసపాలన మొదలైందని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. తాజాగా తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీయే(CRDA) అధికారులు కూల్చేశారు. శనివారం వేకువ జాము నుంచే పోలీసుల పహారాలో ఈ ప్రభుత్వ దమనకాండ కొనసాగింది.
తాడేపల్లి మండలం సీతానగరం వద్ద వైఎస్సార్‌సీపీ కార్యాలయం నిర్మాణం జరుగుతోంది. ఇది చంద్రబాబు నివాసం నుండి టీడీపీ పార్టీ ఆఫీసుకి వెళ్లేదారిలో ఉంది. అయితే ఈ ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్ పూర్తై.. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేశారు అధికారులు. రెండే రెండు గంటల్లో మొత్తం కూల్చివేత జరిగింది. అదే సమయంలో ఆ ప్రాంతానికి నేతలు, కార్యకర్తలు ఎవరినీ వెళ్లనివ్వకుండా గేట్లు వేసి మరీ భారీగా పోలీసులు మోహరించారు.
ఇదిలా ఉంటే.. నిర్మాణంలో ఉన్న ఈ భవనాన్ని కూల్చేయాలన్న సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ వైఎస్సార్‌సీపీ హైకోర్టును కోర్టును ఆశ్రయించింది. ఆ సమయంలో చట్టాన్ని మీరి వ్యవహరింవద్దని కోర్టు సీఆర్డీయేకు సూచించింది కూడా. ఇదే విషయాన్ని సీఆర్ఏ కమిషనర్ దృష్టికి వైఎస్సార్‌సీపీ న్యాయవాది తీసుకెళ్లారు.
అయినా కూడా మున్సిపల్ అధికారుల సాయంతో సీఆర్డీయే ఈ కూల్చివేతలు జరిపింది. మరోవైపు సీఆర్డీఏ, మున్సిపల్ అధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. టీడీపీ ప్రభుత్వ పెద్దలు రోజూ ఈ ఆఫీస్ ముందు నుంచి వెళ్లాల్సి వస్తుందనే ఈ కూల్చివేతకు పాల్పడ్డారని, ఏపీని మరో బీహార్ గా మారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని, పైగా ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, కచ్చితంగా హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని వైఎస్సార్సీపీ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment