సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులందరినీ క్షేమంగా వెనక్కి తీసుకు వస్తామని.. విద్యార్థులు, తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను తీసుకువచ్చే అంశంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపింది. ఈ అంశంపై ప్రతి రోజూ అధికారులతో సమీక్షిస్తూ పలు సూచనలు చేస్తున్నారని ఈ అంశంపై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణ బాబు తెలిపారు. తాజా పరిస్థితి సమాచారాన్ని శనివారం ఆయన సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు.
ఉక్రెయిన్‌లో ఉన్న చివరి విద్యార్థిని సైతం తీసుకు వచ్చే వరకు రాష్ట్ర ప్రతినిధులు అక్కడే ఉంటారన్నారు. గ్రామ స్థాయి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 770 మంది విద్యార్థులు వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్లినట్లు తేలిందన్నారు. వీరిలో ఇప్పటి వరకు 429 మందిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చామని తెలిపారు. మార్చి 9లోగా విద్యార్థులందరినీ వెనక్కి తీసుకువచ్చే విధంగా భారత విదేశాంగ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుందని చెప్పారు. దానికి అనుగుణంగా రాష్ట్ర విద్యార్థులను త్వరితగతిన ఇక్కడికి తీసుకువచ్చేలా రాష్ట్ర ప్రతినిధులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గుర్తించిన 770 మందికి తోడు మరో 100–150 మంది రాష్ట్రానికి చెందిన వారు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని, వీరందరినీ కూడా వెనక్కి తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని స్పష్టం చేశారు.
పరిస్థితులను బట్టి తరలింపు
సరిహద్దు దేశాలకు ముందు వచ్చిన వారి కంటే వెనక వచ్చిన వారిని తొలుత పంపించేస్తున్నారంటూ కొంత మంది తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వస్తున్న వార్తలు అపోహలంటూ కృష్టబాబు కొట్టిపారేశారు. స్థానిక పరిస్థితులను బట్టి.. సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారి కంటే బయట ఉన్న వారు తొలుత వెళ్లడానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ రోజు (శనివారం) బుడాపెస్ట్‌లో 2,000 మందికి వసతి ఏర్పాటు చేయగా, బయట మరో 2,000 మంది నిరీక్షిస్తున్నారని చెప్పారు. ఇలా వసతికి నోచుకోని వారిని ముందుగా పంపుతున్నారన్నారు. సరిహద్దు దేశాలకు చేరుకున్న వారి వసతి, రవాణా సదుపాయాలను చూడటానికి నాలుగు దేశాలకు నలుగురు ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని గుర్తు చేశారు.
హంగేరికి ఏపీఎన్‌ఆర్టీ ప్రెసిడెంట్ మేడపాటి వెంకట్, పోలాండ్‌కు యూరోప్ ప్రత్యేక ప్రతినిధి రవీంద్ర రెడ్డి, రుమేనియాకు రాష్ట్ర ప్రభుత్వ ప్రవాసాంద్ర డిప్యూటీ సలహాదారు చంద్రహాస రెడ్డి, స్లోవేకియాకు నాటా ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ను నియమించిందని తెలిపారు. ఇందులో ఇప్పటికే మేడపాటి వెంకట్, రవీంద్రరెడ్డి, చంద్రహాస రెడ్డిలు ఆయా దేశాలకు చేరుకొని విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. దేశంలోకి వచ్చిన విద్యార్థులను ప్రభుత్వ ఖర్చులతో సొంత ఊరికి పంపడానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖ, విజయవాడల్లో రాష్ట్ర ప్రతినిధులను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రవాసాంధ్ర వ్యవహారాల ప్రత్యేక అధికారి గితేష్ శర్మ మాట్లాడుతూ.. యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో రాష్ట్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని విదేశీయులను తరలించడానికి రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిందని, తద్వారా వారిని క్షేమంగా సరిహద్దులకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఢిల్లీ చేరుకున్న 161 మంది తెలుగు విద్యార్థులు
సాక్షి, న్యూఢిల్లీ, ముంబై: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మరో 161 మంది తెలుగు విద్యార్థులు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి చేరుకున్నారు. ఇందులో ఏపీకి చెందిన 96 మంది, తెలంగాణకు చెందిన 65 మంది ఉన్నారు. వీరికి ఏపీ భవన్, తెలంగాణ భవన్‌కు చెందిన ఉద్యోగులు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించారు. ఇక్కడి నుంచి వారి స్వస్థలాలకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
మరో 39 మంది రాక
ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తీసుకొస్తున్న మరో విమానం శనివారం ముంబైకి చేరుకుంది. ఈ విమానంలో ఏపీ విద్యార్థులు 39 మంది ఉన్నారు. వీరికి ఏపీ ప్రభుత్వ నోడల్ అధికారి వి.రామకృష్ణ స్వాగతం పలికారు. అనంతరం వారికి ఉచితంగా భోజనం, వసతి ఏర్పాటు చేసి.. తర్వాత వారి స్వస్థలాలకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment