శంకుస్థాపన చేసే స్థలం వద్ద కుర్చీలు విసురుతున్న టీడీపీ కార్యకర్తలు, గాయపడిన గ్రామ సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు
‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం భారీ స్థాయిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కడుపుమంటతో అడ్డుతగులుతున్నారు. పేదల ఇంటి శంకుస్థాపన చేయడానికి వచ్చిన నేతలను, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనను అడ్డుకుంటూ దాడులకు దిగుతున్నారు. ప్రభుత్వానికి మంచి పేరొస్తోందన్న అక్కసుతో జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని లబ్ధిదారులు మండిపడుతున్నారు.
రామభద్రపురం/పెదకూరపాడు: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొండకెంగువలో భూమిపూజకు వెళ్తున్న బొబ్బిలి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు వాహనాన్ని గ్రామ పొలిమేరల్లో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదంటూ ఘెరావ్ చేశారు. సమస్య ఏదైనా ఉంటే గ్రామ రామమందిరంలో కూర్చొని మాట్లాడుకుందామని, అర్హులకు న్యాయం చేద్దామని ఆయన నచ్చజెప్పినా వినలేదు. స్థలం రాని వారు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో మంజూరవుతుందని ఎమ్మెల్యే వివరించినా చెవికెక్కించుకోలేదు.
టీడీపీ నేతలు గంటసేపు పెద్దగా కేకలు వేస్తూ రణరంగం సృష్టించారు. సీఐ స్పందించి ఎమ్మెల్యేను పోలీస్ వాహనంలో ఎక్కించి శంకుస్థాపన స్థలానికి తీసుకెళ్లే క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఎమ్మెల్యే వాహనంపై రాళ్లు రువ్వడంతోపాటు పోలీసులపైనా రాళ్ల దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో అల్లరిమూకలను పోలీసులు చెదరగొట్టారు. అప్పటికీ ఆగని కొంతమంది టీడీపీ కార్యకర్తలు శంకుస్థాపన కార్యక్రమం వద్ద టెంట్లు పీకేసి.. కుర్చీలు విసిరేశారు. మైక్‌సెట్లు, సౌండ్ బాక్సులను తన్నేశారు. టీడీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎమ్మెల్యే మాత్రం శంకుస్థాపన పూర్తిచేసి వెనుదిరిగారు. కాగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినవారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
సర్పంచ్ నాగేశ్వరరావుపై దాడి
గుంటూరు జిల్లా కంభంపాడులో వైఎస్సార్ జగనన్న కాలనీకి మౌలిక వసతులు కల్పించేందుకు శనివారం విద్యుత్, వాటర్ పైపులైన్ పనులు చేపట్టారు. టీడీపీ కార్యకర్త దుప్పటి లక్ష్మణ్ పొలం నుంచి విద్యుత్, వాటర్ పైపులైన్లు వేస్తుండగా అడ్డగించారు. పేదలకు ఇళ్లు నిర్మిస్తుంటే అడ్డుకోవడం తగదని సర్పంచ్ ఆర్తిమళ్ల నాగేశ్వరరావు హితవు పలికారు. దీంతో నాగేశ్వరరావుతో వాగ్వాదానికి దిగిన టీడీపీ కార్యకర్తలు దుప్పటి లక్ష్మణ్, శ్రీనివాసరావు, తిరుపతిరావు, నరసింహరావు, బాలకృష్ణ, వెంకటకృష్ణ, హరిబాబు, వెంకట్రావు దాడి చేశారు. నాగేశ్వరరావుకు రక్తగాయాలు కావడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 8 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో ఆరుగురిని కోర్టులో హాజర్చగా, ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీఐ గుంజి తిరుమలరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment