పొత్తు పొడిస్తే.. సీటు సితారే.. | TDP Alliance With Janasena Party | Sakshi
Sakshi News home page

పొత్తు పొడిస్తే.. సీటు సితారే..

Published Tue, Jan 10 2023 8:08 AM | Last Updated on Tue, Jan 10 2023 9:48 AM

TDP Alliance With Janasena Party  - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీలో ఇప్పటికే వర్గ విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలుగా విడిపోయి మరీ ఆ పార్టీ నాయకులు కయ్యాలకు కాలు దువ్వుతున్నారు. సరిగ్గా ఇదే తరుణంలో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీ కావడం వారికి ‘పుండు మీద కారం చల్లిన’ చందంగా మారింది. దీనికి తోడు ఉమ్మడిగానే పోరు కొనసాగిస్తామని, పొత్తులపై తర్వాత చర్చిస్తామని ప్రకటించడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చకు తెర లేపింది.ఈ పరిణామం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు అనివార్యమన్న సంకేతాలనివ్వడంతో.. ఇప్పటికే టీడీపీ టిక్కెట్లు ఆశిస్తున్న వారిలో అంతర్మధనం మొదలైంది. పొత్తు పొడిస్తే తమ కుర్చీకి ఎక్కడ ఎసరు వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ పొత్తుకు అడుగులు పడితే ఎలాగని టీడీపీ నేతలు, కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. 

బుచ్చయ్యకు పొత్తు సెగ 
టీడీపీతో పొత్తు కుదిరితే రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాలను జనసేన కోరే అవకాశం ఉందని చెబుతున్నారు. జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. తనకు పవన్‌ కల్యాణ్‌ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, ఆరు నూరైనా రూరల్‌ స్థానం తనకే దక్కుతుందని ఆయన ధీమాగా ఉన్నారు. టీడీపీ, జనసేన పొత్తులు ఎన్నికల సమయంలో వచ్చే అంశమని, ఈలోగా ప్రభుత్వ విధానాలపై ఉమ్మడిగా పోరాటం చేస్తామని సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన చెప్పారు. ఇది అంతర్గతంగా పొత్తు ఖాయమన్న భావనను వ్యక్తపరుస్తోందని పలువురు చెబుతున్నారు. 

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన అభ్యర్థనకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వక తప్పని స్థితి టీడీపీది. ఒకవేళ రూరల్‌ సీటును జనసేనకు కేటాయిస్తే టీడీపీ సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి భంగపాటు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే జరిగితే రూరల్‌లో బుచ్చయ్య వర్గం కందుల దుర్గే‹Ùకు మద్దతు ఇస్తుందా? టీడీపీ జెండాలు మోసి, జనసేనతో కయ్యానికి కాలు దువి్వన నేతలు ఒకే వేదికపై పని చేసేందుకు అంగీకరిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

రాజానగరంలో టీడీపీ దుకాణం బంద్‌ 
మరోపక్క తమకు తప్పనిసరిగా దక్కుతుందని జనసేన భావిస్తున్న రాజానగరం స్థానంలో కూడా రాజకీయం వేడెక్కింది. ఇక్కడ టీడీపీకి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ పెద్ద దిక్కుగా ఉన్నారు. చంద్రబాబు వ్యవహార శైలితో విసుగు చెందిన ఆయన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి ఇటీవల గుడ్‌బై చెప్పారు. బలమైన అభ్యర్థి లేకపోవడంతో రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ దుకాణం బందైంది. జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి పోటీగా లేకపోవడంతో ఇక్కడ తనకు లైన్‌ క్లియరైనట్టేనని ఆయన నమ్ముతున్నారు. ఒకవేళ రాజానగరాన్ని జనసేనకు కేటాయిస్తే మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వర్గం మద్దతిచ్చే సూచనలు కనిపించడం లేదు. వర్గ విభేదాలు భగ్గుమనే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే జనసేన ఆశలు గోదారిలో కలిసినట్టేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

సిటీ ఇచ్చినా తలనొప్పే..
ఒకవేళ సీనియర్‌ను పక్కన పెట్టడం తగదని టీడీపీ అధిష్టానం భావించి, రాజమహేంద్రవరం సిటీ నుంచి బరిలో దింపాలని నిర్ణయిస్తే బుచ్చయ్యకు మరో తలనొప్పి ఎదురవుతుంది. ఇక్కడ ఇప్పటికే ఆదిరెడ్డి భవాని టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బుచ్చయ్యకు ఇక్కడ ఇస్తే ఆమె స్థానం గల్లంతవడం ఖాయం. అప్పుడు ఆయన మామ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వర్గానికి భంగపాటు తప్పని పరిస్థితి. సిటీ స్థానం తమకే దక్కుతుందని, దీనిపై ఇదివరకే చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని ఆదిరెడ్డి వర్గం ఇప్పటికే ప్రచారం చేస్తోంది. ఒకవేళ సిటీ సీటు గోరంట్లకు కేటాయిస్తే ఆదిరెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకించే సూచనలు కనిపిస్తున్నాయి. సిటీ గోరంట్లకు కేటాయిస్తే ఆదిరెడ్డి వర్గానికి ఎంపీ టికెట్‌ ఇచ్చే చాన్స్‌ ఉందని విశ్లేషకులు అంటున్నారు. అందుకు వాళ్లు సుముఖత వ్యక్తం చేస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏది ఏమైనా చంద్రబాబు నిర్ణయం పార్టీ శ్రేణుల్లో గందరగోళానికి దారి తీస్తోంది. పవన్, బాబు భేటీని జాగ్రత్తగా పరిశీలిస్తున్న నేతలు అవసరమైనప్పుడు స్పందించేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement