ఇది ఫెవికాల్‌ బంధం | Janasena Support TDP In Local Elections | Sakshi
Sakshi News home page

ఇది ఫెవికాల్‌ బంధం

Published Fri, Mar 13 2020 5:06 AM | Last Updated on Fri, Mar 13 2020 11:15 AM

Janasena Support TDP In Local Elections - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మధ్య అనుబంధం ఫెవికాల్‌ కన్నా దృఢమైనదని మరోసారి నిరూపితమైంది. స్థానిక సంస్థల్లో మిత్రపక్షం బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు కనపడుతున్నా, చాలా స్థానాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గెలుపు కోసమే జనసేన సహకారం అందిస్తోంది. మొన్నటి అసెంబ్లీ – లోకసభ ఎన్నికల సమయంలో లోపాయికారీగా జనసేన పార్టీ కొన్ని చోట్ల తన సొంత గెలుపును పక్కనపెట్టి టీడీపీ గెలుపునకు సహకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడూ అదే రీతిలో ‘స్థానిక’ ఎన్నికల్లో టీడీపీకి కనీస గౌరవం దక్కించడానికి వీలుగా జనసేన అధినేత పావులు కదుపుతున్నారు.

ఇదీ అంతర్గత ఒప్పందం
►కొన్ని మండలాల్లో జెడ్పీటీసీ స్థానంలో జనసేన, ఎంపీపీ పదవిని టీడీపీ పంచుకొని పోటీ చేస్తున్నాయి. 
►మరికొన్ని మండలాల్లో కొన్ని ఎంపీటీసీ పదవులకు మాత్రమే పోటీ చేసిన జనసేన.. ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు రెండింటిలోనూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పని చేస్తోంది. 
►తెలుగుదేశం పార్టీ గెలుపునకు కొద్దో గొప్పో అవకాశాలున్న చోట జనసేన అభ్యర్థి పోటీకి సిద్ధమైతే.. వారు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పవన్‌ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వారు సూచిస్తున్నారు.
►టీడీపీకి వ్యతిరేకంగా పని చేయకుండా ఆయా జిల్లాల నాయకులకు సూచనలు చేసినట్లు సమాచారం. 
►టీడీపీ ప్రయోజనాల కోసం బీజేపీని జనసేన వాడుకుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

భీమవరంలోనే పదవుల పంపకం
►పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన విషయం విదితమే. ఆ నియోజకవర్గంలో భీమవరం రూరల్, వీరవాసరం మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను టీడీపీ, జనసేన నేతలు పంచేసుకుంటూ లోపాయికారీ ఒప్పందంతో పోటీకి దిగారు. 
►భీమవరం జెడ్పీటీసీ బరిలో జనసేన పోటీలో లేదు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి బరిలోకి దిగారు. 
►ఈ మండలంలో కాపు సామాజిక వర్గంతోపాటు మత్స్యకారులు జనసేనకు అండగా ఉంటున్నారు. దీంతో అధికంగా ఓట్లు ఉన్న మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెట్టారు. ఇక్కడి ఎంపీపీ పదవిని జనసేన పార్టీకి కేటాయించే విధంగా ఒప్పందం చేసుకున్నారు.
►వీరవాసరం మండలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పటిష్టంగా ఉండడంతో జెడ్పీటీసీ స్థానంలో జనసేన, ఎంపీపీ పదవికి టీడీపీ పోటీ చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు. 
►భీమవరం రూరల్‌ మండలంలో జనసేన పార్టీ పోటీ చేస్తున్న వెంప, శ్రీరామపురం, పెదగరవు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ కనీసం నామినేషన్లు కూడా దాఖలు చేయలేదు. కొన్ని చోట్ల జనసేన నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, వారి నామినేషన్ల ఉపసంహరణకు ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. 
►నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం నుంచి అభిశెట్టి పద్మకుమారి నామినేషన్‌ వేశారు. గతంలో పెరవలి జెడ్పీటీసీగా ఉన్న అరిటికాయల రమ్యశ్రీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 24 వేల ఓట్లు సాధించింది. ఇప్పుడు తాజాగా తమకు బలం ఉన్న పెరవలి మండలంలో జనసేన జెడ్పీటీసీ రేసు నుంచి తప్పుకుని తెలుగుదేశం పార్టీకి లోపాయికారీగా మద్దతు ప్రకటించింది. దీనికి ప్రతిఫలంగా ఎంపీపీ పదవి లక్ష్యంగా రమ్యశ్రీ భర్త మురళీకృష్ణ బరిలోకి దిగనున్నారు.

గుంటూరు జిల్లా తెనాలిలోనూ అదే వైఖరి
►జనసేన పార్టీలో పవన్‌ కల్యాణ్‌ తర్వాత నాదెండ్ల మనోహర్‌ నిర్ణయాలే కీలకం. మనోహర్‌ సొంత నియోజకవర్గం గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీకి మేలు జరిగేలా జనసేన నుంచి కేవలం 12 స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ స్థానాల్లో జనసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ సైతం పోటీలో లేదు.
►ఇదే నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 5 స్థానాల్లోనే జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 
►జనసేన పోటీ చేయని 11 స్థానాలకు గాను 3 గ్రామాల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు.

‘తూర్పు’న లోపాయికారీ ఒప్పందం
►తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి–1 ఎంపీటీసీ స్థానంలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ సతీమణి దేశంశెట్టి రత్నకుమారికి  మేలు జరిగేలా జనసేన వదులుకుంది. 
►ఈ ఎంపీటీసీ స్థానం పరిధిలో గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి మెజార్టీ వచ్చింది. రెండో స్థానంలో జనసేన నిలిచింది. అతి తక్కువ ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచిన టీడీపీకి ఇక్కడ జనసేన మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇందుకు బదులుగా భీమనపల్లి–2 ఎంపీటీసీ స్థానాన్ని జనసేన కోసం టీడీపీ వదులుకుంది.  
►అమలాపురం మండలంలో గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తొలి స్థానంలో నిలబడగా జనసేన రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ జెడ్పీటీసీ స్థానానికి పెద్దగా పేరు లేని చీకురమిల్లి కిరణ్‌కుమార్‌ను జనసేన ఎంపిక చేసింది. ఇక్కడ టీడీపీ నుంచి పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కోసమే జనసేన బలహీన అభ్యర్థిని బరిలోకి దించింది.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గడియారం స్తంభం సెంటర్‌లో జనసేన, టీడీపీ జెండాలతో ర్యాలీ   

పావుగా మారిన బీజేపీ 
జెడ్పీటీసీ స్థానాల్లో జనసేన కాకుండా బీజేపీ పోటీలో ఉంటేనే టీడీపీకి గౌరవప్రదమైన సంఖ్యలో ఓట్లు వస్తాయని జనసేన పెద్దలు వ్యూహం పన్నారు. ఇందులో భాగంగానే జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికం బీజేపీ.. ఎంపీటీసీ స్థానాల్లో అత్యధికం జనసేన పార్టీలు పోటీ చేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రకారం మొత్తం 652 జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికంగా 433 మంది బీజేపీ అభ్యర్థులు, 270 మంది జనసేన అభ్యర్థులు (కొన్ని చోట్ల ఇద్దరు అభ్యర్థులు) నామినేషన్లు దాఖలు చేశారు. 
►ఒప్పందం మేరకు ఎంపీటీసీ స్థానాల విషయంలో జనసేన పార్టీ దాదాపు మూడింట రెండు వంతుల ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. 
►కానీ 9,696 ఎంపీటీసీ స్థానాలకు గాను జనసేన అభ్యర్థులను బరిలోకి దించింది కేవలం 2,027 స్థానాల్లో మాత్రమే. బీజేపీ తరఫున కేవలం 1,816 మంది అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేశారు. అంటే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నది 3,843 చోట్ల మాత్రమే.  
►మిగిలిన చోట్ల లోపాయికారీ ఒప్పందం ప్రకారం జనసేన టీడీపీ అభ్యర్ధులకే మద్దతు ఇవ్వనుంది. 
►అనంతపురం జిల్లాలో 13 జెడ్పీటీసీ స్థానాల్లో బీజేపీ–జనసేన అభ్యర్థులను బరిలో నిలుపలేదు.
►841 ఎంపీటీసీ స్థానాలకు గాను బీజేపీ 200, జనసేన 83 స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశాయి. టీడీపీకి మేలు జరిగేలా మిగిలిన స్థానాలకు నామినేషన్లు వేయలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement