Andhra Pradesh: కోతలు.. ఉత్త కూతలే! | TDP And Yellow Media False Propaganda On Pensions | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: కోతలు.. ఉత్త కూతలే!

Published Sat, Oct 2 2021 3:56 AM | Last Updated on Sat, Oct 2 2021 3:56 AM

TDP And Yellow Media False Propaganda On Pensions - Sakshi

విజయవాడ ఊర్మిళనగర్‌లో శుక్రవారం వలంటీర్‌ ద్వారా ఇంటి వద్దే పింఛన్‌ అందుకున్న ఆనందంలో వృద్ధురాలు ఆదిమూలం ఆదెమ్మ

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పింఛన్లలో ఎడాపెడా కోతలు విధిస్తోందంటూ టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా సాగిస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేటతెల్లమవుతోంది. ఒకవేళ పెన్షన్లు నిజంగానే తగ్గిస్తే గత సర్కారు ఇచ్చిన వాటి కంటే ఇప్పుడు అదనంగా పది లక్షల పింఛన్లు ఇవ్వడం ఎలా సాధ్యం? కోతలే కనుక వాస్తవమైతే టీడీపీ హయాం కంటే ఇప్పుడు మూడు రెట్లకు పైగా అధికంగా పింఛన్ల డబ్బులు పంపిణీ ఎలా జరుగుతోంది? గత నెలలో 59.19 లక్షల మందికి పింఛన్లు ఇవ్వగా అక్టోబర్‌లో 60.81 లక్షల మంది పెన్షన్లు అందుకోవడం గమనార్హం.

అంటే ఒక్క నెలలోనే 1.62 లక్షల పింఛన్లు ఎక్కువగా పెరిగాయి. దీన్నిబట్టి విపక్షం ఆరోపణల్లో ఏమాత్రం నిజం ఉందో ఎవరికైనా తెలుస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో ప్రభుత్వ పథకాలు అందాలి.. అదే సమయంలో అనర్హులకు అందకూడదనే విధానపరమైన నిర్ణయానికి అనుగుణంగానే వివక్షకు తావులేకుండా అధికారులే పలు దశల్లో నిర్థారించుకుని పింఛన్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.



ఇంటికి ఒక్కరికే పింఛన్‌ ఇవ్వాలంటూ 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు 

ఇబ్బంది లేకుండా ఇంటివద్దే...
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 60.81 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లను ప్రతి నెలా ఇంటివద్దే పంపిణీ చేస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కంటే దాదాపు 10 లక్షల మందికి అదనంగా పింఛన్లను అందిస్తోంది. గత సర్కారు సరాసరిన ఏడాదికి రూ.5,508 కోట్ల చొప్పున పింఛన్ల పంపిణీ కోసం ఖర్చు చేయగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూడు రెట్లకుపైగా అధికంగా రూ.17,000 కోట్లకుపైగా వెచ్చిస్తోంది. మరి విపక్షం ఆరోపిస్తున్నట్లుగా ప్రభుత్వం పింఛన్లకు కోతలు పెడితే వాటి సంఖ్యైనా తగ్గాలి లేదా ఖర్చైనా తగ్గిపోవాలి. ఇప్పుడు ప్రతి నెలా లబ్ధిదారులు పెరుగుతున్నారే కానీ తగ్గడం లేదు. సహజంగా పింఛను లబ్ధిదారులలో పెద్ద వయసు వారే ఎక్కువగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్‌దారులలో చనిపోతున్న వారి సంఖ్య ప్రతి నెలా 20– 25 వేల దాకా ఉంటుందని ఒక అంచనా. ఈ పరిస్థితులలో పింఛన్ల సంఖ్య, పంపిణీ చేసే డబ్బులు పెరిగినట్లు స్పష్టంగా కళ్లకు కనిపిస్తున్నా తప్పుడు ప్రచారం చేస్తుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.

అప్పుడు జన్మభూమి కమిటీలు.. ఇప్పుడు అంతా అధికారులే
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఓ పింఛను మంజూరు చేయాలన్నా.. అనర్హులను తొలగించాలన్నా పూర్తి పారదర్శక విధానాన్ని పాటిస్తోంది. ప్రతి గ్రామం, వార్డులో స్థానిక ప్రజల సమక్షంలోనే గ్రామసభలు నిర్వహించి చర్చించాకే అధికారులు తుది నిర్ణయం తీసుకుంటున్నారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో కొత్త పింఛన్ల మంజూరు, తొలగింపు ప్రక్రియ చేపట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తెలిసిందే. జన్మభూమి కమిటీలలో సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ నాయకులే సభ్యులుగా ఉండేవారు. టీడీపీ నేతల కనుసన్నల్లో జరిగిన పింఛన్ల పంపిణీని ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులైన గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు మండల అధికారులకే అప్పగించారు.

సొంత కార్లున్నా.. ఎంచక్కా పింఛన్‌
సంక్షేమ కార్యక్రమాలను సజావుగా అమలు చేసే క్రమంలో అనర్హులుగా గుర్తించిన వారికి  అధికారులు పింఛను తొలగించడం సాధారణంగా జరిగే ప్రక్రియ. గత సర్కారు హయాంలో మంజూరై ఇప్పుడు ఆరు దశల పరిశీలన తరువాత పింఛన్లు తొలగించిన అనర్హుల్లో 14 వేల మంది దాకా కార్ల యజమానులు ఉన్నట్లు తేలింది. సొంత కారు కలిగి ఉండి దర్జాగా పింఛన్లు పొందుతున్నారంటే వారి ఆర్థిక పరిస్థితి ఏమిటో ఎవరైనా ఊహించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జన్మభూమి కమిటీల అక్రమాల కారణంగా నిబంధనలకు విరుద్ధంగా పింఛన్లు పొందుతున్న వారికి జారీ అయిన నోటీసులపై టీడీపీ, దాని అనుకూల మీడియా దుష్ప్రచారం సాగిస్తున్నాయి.

ఇంటికొకరిపై తప్పుడు ప్రచారమే..
ఒక ఇంటిలో ఒకరికి మాత్రమే పింఛన్‌ మంజూరు చేయాలంటూ 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గత సర్కారు కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు అప్పటి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో 2014 సెప్టెంబర్‌ 18వ తేదీన ఆర్‌సీ నంబరు 1053 సర్క్యులర్‌ జారీ చేశారు. దివ్యాంగుల పింఛను లబ్ధిదారుల్లో 80%కి మించి వైకల్యం ఉన్న వారి కుటుంబాల్లో మాత్రమే రెండో పింఛన్‌కు గత సర్కారు అనుమతించింది.

అయితే జగన్‌ సీఎం అయ్యాక 40%కి పైబడి అంగవైకల్యం కలిగి ఉండి పింఛను పొందుతున్న ప్రతి కుటుంబంలో అర్హత ఉంటే రెండో పింఛన్‌ మంజూరుకు కూడా అనుమతిచ్చారు. అదే సమయంలో కిడ్నీ జబ్బులతోపాటు దీర్ఘకాలిక వ్యాధుల బాధితుల కుటుంబాల్లో ఏ రకమైన పింఛన్‌ పొందేందుకు అర్హత ఉన్నా రెండోది కూడా మంజూరు చేసేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అనుమతి తెలిపింది. గతంలో జన్మభూమి కమిటీలు అక్రమాలకు పాల్పడి అనర్హులకు మంజూరు చేసిన వాటిని మాత్రమే ఇప్పుడు క్షుణ్నంగా పరిశీలించి తొలగిస్తున్నారు.

మానవత్వం, ఉదారతకు ఇవీ సాక్ష్యాలు..
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లు పొందేందుకు అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. 
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేయడంతో పాటు వారికి ప్రతి నెలా రూ.10 వేల దాకా డబ్బులు అందజేస్తోంది. తలసేమియా, సికిల్‌సెల్, తీవ్ర హిమోఫీలియా వ్యాధిగ్రస్తులకు, ద్వైపాక్షిక బోధ వ్యాధి, పక్షవాతంతో చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమైన వారు, డయాలసిస్‌ చేయించుకుంటున్న దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు, లివర్, కిడ్నీ, గుండె మార్పిడి చేయించుకున్న వారు, కుష్టు వ్యాధి లాంటి 11 రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేసి ప్రతి నెలా ఏకంగా రూ.5,000 నుంచి రూ.10,000 వరకు పెన్షన్‌ రూపంలో చెల్లిస్తున్నారు.

పడిగాపులు కాసే పనిలేకుండా వలంటీర్లే ప్రతి నెలా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేయాలనే విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు.
అధికారంలోకి వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే అప్పటిదాకా అవ్వాతాతలు, వితంతువులకిస్తున్న పెన్షన్‌ మొత్తాన్ని రూ.2,250లకు పెంచేశారు. ఆ మొత్తాన్ని క్రమంగా రూ.3,000 దాకా పెంచుకుంటూ వెళ్లనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement