TDP Chandrababu Criminal Politics Exposed MLAs Quota MLC Elections - Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు 2.0: కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం.. చంద్రబాబు

Published Mon, Mar 27 2023 4:07 AM | Last Updated on Mon, Mar 27 2023 9:45 AM

TDP Chandrababu Criminal Politics Exposed MLAs Quota MLC Elections - Sakshi

చెప్పులు రుచి మరిగిన కుక్కకు చెరకు తీపి రుచిస్తుందా?.. పుట్టుకతో వచ్చిన గుణం పుడమిలో కలిసేదాకా పోదు కదా! బేరసారాలే ఊపిరిగా బతికే నేతల నైజం కూడా అంతే!.. కుమ్మక్కు రాజకీయాలు, కొనుగోళ్లే వారి లక్షణం.. లక్ష్యం! 
 
సాక్షి, అమరావతి: ఎనిమిదేళ్ల క్రితం.. తెలంగాణ శాసన మండలికి 2015లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నించి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏపీ శాసన మండలి ఎన్నికల్లోనూ అదే విధానాన్ని నమ్ముకుంది. ఓటుకు కోట్లను ఎర వేసింది. గెలిచే బలం లేకపోయినా బేరసారాలకు దిగి నిస్సిగ్గుగా క్రాస్‌ ఓటింగ్‌ను ప్రోత్సహించింది.

ఆది నుంచి తాను నమ్ముకున్న కొనుగోళ్లు, కుమ్మక్కు రాజకీయాలనే మరోసారి అనుసరించింది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడంలో విఫలమైన వారితోపాటు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టికెట్‌ దక్కదనే సంకేతాలున్న వారిని ప్రలోభాలకు గురి చేసి అనైతిక చర్యలకు పాల్పడింది. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ వాస్తవాలను వెల్లడించడంతో చంద్రబాబు స్క్రిప్టు ప్రకారం అమలైన ‘ఓటుకు కోట్లు స్కాం 2.0’ బహిర్గతమైంది.  
 
బలం లేదని స్పష్టంగా తెలిసినా.. 
ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ ద్వారా టీడీపీ తన అభ్యర్థి పంచుమర్తి అనూరాధను గట్టెక్కించుకోగలిగింది. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా వైఎస్సార్‌సీపీకి 151 మంది సభ్యులున్నారు. టీడీపీ తరపున గెలిచిన 23 మందిలో నలుగురు ఆదిలోనే ఆ పార్టీకి దూరంగా జరగడంతో సాంకేతికంగా ఉన్న సభ్యులు 19 మంది మాత్రమే.

జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాపాక కూడా ఆ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. టీడీపీ, జనసేన విధానాలతో విబేధించిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేలూ వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తున్నారు. అంటే అధికార పార్టీకి సాంకేతికంగా ఉన్న సభ్యులు 156 అని స్పష్టమవుతోంది. ఒక్కో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుపొందాలంటే 22 మంది ఎమ్మెల్యేల ప్రథమ ప్రాధాన్యత ఓట్లు అవసరం.

వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్నందున ఖాళీ అయిన ఏడు స్థానాలకు తన అభ్యర్థులను బరిలోకి దించింది. తగిన సంఖ్యా బలం లేకపోయినప్పటికీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టారు.

సంఖ్యా బలం లేకుండా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించడాన్ని బట్టి చూస్తుంటే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే రూ.కోట్లు ఎర వేసి బేరసారాలకు చంద్రబాబు వ్యూహం రచించినట్లు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితోపాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఆదిలోనే చెప్పారు.

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.పది కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ వెదజల్లి కొనుగోలు చేసి టీడీపీ అభ్యర్థిని చంద్రబాబు గెలిపించుకున్నారని సజ్జలతోపాటు పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రాపాక వాస్తవాలను వెల్లడించడటంతో ఓటుకు కోట్లు స్కాం 2.0 బట్టబయలైంది. 
 
అసెంబ్లీ లాబీ వేదికగా పదేపదే ప్రలోభాలు.. 
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ జనసేన నుంచి గెలుపొందినా పవన్‌ కళ్యాణ్‌ పోకడలను నిరసిస్తూ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌ వెంట ప్రజాభీష్టం ప్రకారం నడుస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాపాకను ప్రలోభాలకు గురి చేసి తమ వైపునకు తిప్పుకునేందుకు ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే మంతెన రామరాజును చంద్రబాబు బరిలోకి దించారు.

తన మిత్రుడు కేఎస్‌ఎన్‌ రాజు ద్వారా టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినట్లు ఎమ్మెల్యే రాపాక తాజాగా మీడియాకు బహిర్గతం చేశారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే పెద్ద ఎత్తున డబ్బులతో పాటు పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని రామరాజు తనకు ప్రతిపాదన పంపారని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ రోజు కూడా లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు తనను పక్కకు పిలిచి మరోసారి ప్రలోభపెట్టారని రాపాక చెప్పారు.

తనను పదేపదే ప్రలోభాలకు గురి చేసినా డబ్బులకు అమ్ముడుపోయి వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోలేనని మరోసారి తేల్చి చెప్పినట్లు రాపాక పేర్కొన్నారు. అనంతరం మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా టీడీపీ ప్రలోభాలకు గురిచేసిన విషయం తెలిసిందన్నారు.

కాగా ఈ అంశంపై ఉండి ఎమ్మెల్యే రామరాజు మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యే రాపాకను కలసి మాట్లాడిన విషయం వాస్తవమేనని అంగీకరించడం గమనార్హం. అయితే రాపాకను ప్రలోభపెట్టలేదంటూ దాటవేసే యత్నం చేశారు. 
 
ప్రలోభాలకు ఆదిగురువు
రాజకీయాల్లో ప్రలోభాల పర్వం చంద్రబాబుతోనే మొదలైందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ శాసన మండలికి 2015లో ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ అభ్యర్థి వేం నరేంద్రరెడ్డిని చంద్రబాబు బరిలోకి దించారు.

రూ.కోట్లు ఎర వేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తన శిష్యుడు రేవంత్‌రెడ్డిని పురమాయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బుల కట్టలతో కూడిన బ్యాగ్‌ను అందచేస్తుండగా తెలంగాణ ఏసీసీ సాక్ష్యాధారాలతో  రెడ్‌ హ్యాండెడ్‌గా 2015 మే 31న పట్టుకుంది.

ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు తాకట్టుపెట్టి మరీ రాత్రికి రాత్రే చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి పరారై కృష్ణా కరకట్టపై ఉండవల్లి వద్ద ఉన్న అక్రమ నివాసానికి చేరుకున్నారు.

తాజాగా శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే రీతిలో ఓటుకు నోట్లు కుంభకోణానికి చంద్రబాబు పాల్పడటం గమనార్హం. అందుకే పుట్టుకతో వచ్చిన గుణం చచ్చే దాకా పోదనే నానుడి ఆయనకు అతికినట్లు సరిపోతుందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement