కొండపల్లిలో 293/1 సర్వే నెంబర్‌లోని 18సెంట్ల వక్ఫ్ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణం
వితరణ శీలురైన కొందరు ముస్లిం సంపన్నులు తమ స్థిరాస్థిలో కొంత భాగాన్ని, లేదా మొత్తం ఆస్తిని ‘అల్లా’ పేరున రాశారు. ఈ ప్రక్రియను ఇస్లాం సంప్రదాయంలో వక్ఫ్ చేయడం అంటారు. ఒకసారి వక్ఫ్ చేసిన ఆస్తిని తిరిగి తీసుకోవడం కుదరదు. అమ్మడమూ కుదరదు. దాత సంతతికి చెందిన వారికి కూడా దాని మీద ఎలాంటి హక్కులు వుండవు. ఇలాంటి భూముల్ని గత సర్కారు పెద్దలు అయిన వారికి యథేచ్ఛగా కట్టబెట్టేశారు.
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలో ఆసూర్ ఖానాకు చెందిన రెవెన్యూ సర్వే నంబరు 287–1లో 11.34 ఎకరాలు, సర్వే నంబరు 287–5లో 2.6 ఎకరాలు.. మొత్తం 13.94 ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. ఈ భూమి విలువ రూ.130 కోట్ల పైమాటే. ఈ అక్రమాన్ని అధికారికంగా సక్రమం చేయాలని గత టీడీపీ పెద్దలు ప్రయత్నించారు. కృష్ణా జిల్లా నిడమానూరులో సర్వే నంబర్ 201, 202, 203లో ఖాజీ (ముస్లింల వివాహాలు చేసే గురువు) సర్వీసు కోసం కేటాయించిన మాన్యం భూమి 39.16 ఎకరాలు టీడీపీ దన్నుతో ఏడుగురు బినామీలు చేజిక్కించుకున్నారు.
విజయవాడ భవానీపురంలో కోట్లాది రూపాయల విలువైన దర్గా మాన్యం 40 ఎకరాల భూమిని మార్బుల్ స్టోన్ వ్యాపారులకు నామమాత్రపు లీజుకు ఇచ్చేశారు. కొండపల్లి శాంతినగర్ సర్వే నంబర్ 212ఎ, 212బిలో 18.30 ఎకరాలు, 293/1లో 18 సెంట్లు, ఇబ్రహీంపట్నంలో సర్వే నంబర్ 240లో 26 ఎకరాల ఖాజీ మాన్యం ఆక్రమణల పాలైంది. ఆ భూముల్లో భారీ భవంతులు నిర్మించారు. ఇలా వెయ్యి కాదు.. పది వేలు కాదు.. ఏకంగా 31,584 ఎకరాల వక్ఫ్ (ధార్మిక దానం ఇచ్చినవి) భూములు అక్రమార్కుల వశమయ్యాయి. దీంతో దాతల లక్ష్యం, ఔదార్యం నీరుగారిపోతోంది. అనంతపురం, కర్నూలు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయి.
బాబు జమానాలో అక్రమాలకు ఊతం
► చంద్రబాబు పాలించిన రోజుల్లో వక్ఫ్ భూముల్లో అక్రమాలకు ఊతమిచ్చారని ముస్లిం సమాజం ఆవేదన చెందుతోంది. విశాఖపట్నంలో హజ్రత్ ఇషాక్ రహనతుల్లాలై దర్గాకు చెందిన 3,500 ఎకరాల భూమి కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టింది చంద్రబాబే.
► వక్ఫ్ భూముల అన్యాక్రాంతానికి గత ప్రభుత్వం అధికారిక ముద్ర వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేయడంతో న్యాయపరమైన వివాదాలు రేగాయి. నిరర్థక ఆస్తుల పేరుతో టీడీపీ అనుయాయులకు, బడాబాబులకు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేశారు.
► కాజా భూముల వ్యవహారం ఈ కోవలోకే వస్తుంది. 2018 నవంబర్ 13న అప్పటి వక్ఫ్ బోర్డు చైర్మన్, ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశంలో వారికి అనుకూల నిర్ణయం తీసుకున్నారు. ఆ భూమిని నిరర్థక ఆస్తిగా చూపిస్తూ తీర్మానం చేశారు.
► రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల వక్ఫ్ భూములను ఆక్రమణల చెర నుంచి విడిపించడం మానేసి, అన్యాక్రాంతం పేరుతో అయినకాడికి తెగనమ్మి సొంత మనుషులకు ప్రయోజనం చేకూర్చే ప్రయత్నాలు జరిగాయి. గత ప్రభుత్వ పెద్దలు ఆడిన ఆటలో పావులుగా మారిన ముగ్గురు సీఈవోలు కేవలం మూడు నెలల వ్యవధిలోనే బదిలీ వేటుకు గురయ్యారు.
► కాజా భూముల వ్యవహారంలో ఫైల్ నంబర్ ఎస్ /19/జిఎన్‌టీ/2018 లేఖ ద్వారా 2017 డిసెంబర్ 3న సచివాలయానికి అనుకూల తీర్మానం చేసి పంపగానే సీఈవో ఎండీ సుభానీని 2018 జనవరిలో అక్కడి నుండి బదిలీ చేశారు. మరో సీఈవోను నియమించుకుని అనుకూల పనులు చేయించుకున్న గత ప్రభుత్వం మళ్లీ ఆయన్ను కూడా బదిలీ చేసింది. 2018 ఫిబ్రవరిలో షేక్ అహ్మద్‌ను కొత్త సీఈవోగా నియమించారు.
వాటికే వక్ఫ్ ఆస్తుల వినియోగం
► స్థిరాస్తుల్ని పరిరక్షిస్తూ ఇస్లామిక్ ధార్మిక కార్యక్రమాలకు, ముస్లిం సమాజంలోని నిరుపేదల సంక్షేమానికి ఆ భూములను వినియోగించాలనేది వక్ఫ్ లక్ష్యం. మసీదు, ఆషూర్ ఖానా, దర్గా, ముషాఫిర్ ఖానా, ఖాజీ, అంజుమన్, మొహర్రం నిర్వహణ వ్యయం కోసం ఈ భూములు ఉపయోగపడాలన్నది దాతల మహోన్నత ఆశయం.
► ఈ రకంగా మన దేశంలో దాదాపు 3 లక్షల ముస్లిం ధార్మిక సంస్థలు తమ ఆస్తులను వక్ఫ్ బోర్డు కింద రిజిస్టర్ చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక సంస్థలు వక్ప్ బోర్డు కింద రిజిష్టర్ చేయడం విశేషం.
చట్టాన్ని ఆసరా చేసుకుని అక్రమాలు
► వాస్తవానికి వక్ఫ్ చట్టం–1995 (సెంట్రల్ యాక్ట్) ప్రకారం వక్ఫ్ ఆస్తుల క్రయ విక్రయాలు, అన్యాక్రాంతం, అసలు లక్ష్యానికి తూట్లు పొడిచేలా వినియోగం కుదరదు. కానీ అదే చట్టంలోని సెక్షన్–97ను ఆసరాగా తీసుకుని గత ప్రభుత్వం అనేక ప్రాంతాల్లోని వాటిని నిరర్థక ఆస్తులుగా చూపి చేతులు మారేలా వెసులుబాటు కల్పించడంతో న్యాయ వివాదాలు రేగాయి.
► వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం తగదని సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టు సైతం అనేక తీర్పులు చెప్పినప్పటికీ ఆ ఆస్తులను కాపాడేందుకు గత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోలేదు. రానురాను ముస్లిం సమాజపు నిస్సహాయత, గతంలో వక్ఫ్ బోర్డు బాధ్యుల అవినీతి తదితర కారణాలతో వేలాది ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి.
కాజా వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై 2018లో రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ సెక్రటరీకి అప్పటి వక్ఫ్ సీఈవో ఇచ్చిన నివేదిక
ముందు లీజు.. ఆపై కైంకర్యం..
► దాతలు ఇచ్చిన విలువైన భూములను ధర్మకర్తల(ముతవల్లీ)కు, ఖాజాలు తదితర ముస్లిం సమాజానికి చెందిన వారి బతుకుదెరువు కోసం కేవలం 11 నెలల లీజుకు ఇస్తారు. అయితే అక్రమార్కులు వక్ఫ్ బోర్డులో ఉన్న వెసులుబాటును సాకుగా తీసుకుని మూడేళ్లపాటు లీజు ఒప్పందాన్ని పొడిగించుకుంటున్నారు.
► తొలుత ముస్లింలతోనే ఆక్రమణ చేయించి, ఆపై బయటి వ్యక్తుల చేతిలోకి ఆ ఆస్తి వెళ్లేలా చక్రం తిప్పారు. ఇంకో విధంగా.. లీజు పేరుతో ముందుగా విలువైన భూములను ఆక్రమించి ఆపై కైంకర్యం చేసేసుకున్నారు.
► ఎవరైనా ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తే చట్టంలో ఉన్న అవకాశాలను అనుకూలంగా మలుచుకుని న్యాయ పరమైన వివాదాలు సృష్టిస్తూ ఏళ్ల తరబడి ఆస్తులను అనుభవిస్తున్నారు.
కృష్ణా జిల్లా నిడమానూరులో వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై 2019లో అప్పటి కలెక్టర్ ఇంతియాజ్ వక్ఫ్ సీఈవోకు ఇచ్చిన నివేదిక
వక్ఫ్ ఆస్తుల రక్షణకు చర్యలు
ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం మైనార్టీలకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో 502 వక్ఫ్ సంస్థలకు చెందిన 65,783 ఎకరాల్లో గతంలో 31,584 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఈ భూములను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాం. వక్ఫ్ బోర్డుల పరి«ధిలోని ఆస్తుల రక్షణకు, ముస్లింలకు కొత్త శ్మశానాల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. వక్ఫ్ ఆస్తుల వివాదాలపై తక్షణ చర్యలు తీసుకునేలా ఏపీలో త్వరలో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు.
– అంజాద్ బాషా, ఉప ముఖ్యమంత్రి
ముస్లిం దాతల స్ఫూర్తి నిలపాలి
ముస్లిం సమాజం కోసం విలువైన భూములను త్యాగం చేసిన దాతల స్ఫూర్తిని నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. వక్ఫ్ ఆస్తుల పరరిక్షణ కోసం లీజు ప్రక్రియను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. వీటిపై క్షేత్ర స్థాయిలో సర్వే చేసి, అన్యాక్రాంతమైన వాటిని పరక్షించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలి. అక్రమార్కుల చెర నుంచి వాటిని కాపాడాలి. ముస్లిం సమాజానికి ఆ ఆస్తులు ఉపయోగపడేలా చట్టపరమైన చర్యలు త్వరగా తీసుకోవాలి.
– మునీర్ అహ్మద్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment