
సాక్షి, చోడవరం: విశాఖ జిల్లా చోడవరం మండలం గంధవరంలో టీడీపీ వర్గీయులు గురువారం సర్పంచ్ ఇంటిపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సర్పంచ్ పల్లా ఇంద్రజతోపాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం మండలం నుంచి తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పల్లా అర్జున తన కుటుంబసభ్యులు, వర్గీయులు సుమారు 13 మందితో కలిసి ఇనుపరాడ్లతో వెళ్లి వైఎస్సార్‌సీపీ అభిమాని అయిన సర్పంచ్ ఇంద్రజ, ఆమె మేనమామ గోకివాడ రమణ ఇంటిపై దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్టు రాడ్లతో కొట్టడంతో సర్పంచ్‌తో పాటు ఆమె తల్లి సత్యవతి (46), అన్న బాలఅప్పలనాయుడు (27), చిన్నాన్న రమణబాబు (47), మేనమామ గోకివాడ రమణ (50), అతని కుమారుడు గోకివాడ మోహన్ (26), కుమార్తె గోకివాడ రామలక్ష్మి (18) తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులు కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్నవారంతా అక్కడికి చేరడంతో దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు పరారయ్యారు. ఇదే గ్రామంలో ఉన్న సర్పంచ్ ఇంద్రజ బంధువులు హుటాహుటిన అక్కడకు చేరుకొని దాడికి పాల్పడ్డవారిని నిలదీసేందుకు వెళ్లగా వారు అక్కడ కూడా ఎదురుతిరగడంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘర్షణలో టీడీపీకి చెందిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న చోడవరం సీఐ అక్కడికి చేరుకొని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తీవ్రంగా గాయపడిన సర్పంచ్, కుటుంబసభ్యులను చికిత్స నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా టీడీపీ వర్గీయులు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స కోసం చేరారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన టీడీపీ నాయకులు కక్షకట్టి దాడి చేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. ఘటనలో ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment