ఆ మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నపుడు నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఐదేళ్ళలో ఒక కాలువపై చిన్న వంతెన కూడా పూర్తి చేయించలేకపోయాడు. అన్ని రకాలుగా జనాన్ని దోచుకుతిన్నాడు. ఇప్పుడు మాజీగా మిగిలాక కూడా జనంపై కక్ష తీర్చుకుంటున్నాడు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో, ఆయన గొడవేంటో.. మీరే చదవండి
సైకిల్ పని వివాదం సృష్టించడం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులతో పచ్చ పార్టీ నాయకులు గంగవెర్రులెత్తుతున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికి నానాపాట్లు పడుతున్నారు. తాజాగా వివాదాలకు కేరాఫ్ గా నిలిచే విజయవాడ నగర శివార్లలోని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చీప్ పాలిటిక్స్ చూసి జనం అసహ్యించుకుంటున్నారు.
యనమలకుదురులో అసంపూర్తిగా ఆగిపోయిన వంతెన వద్ద బోడే ప్రసాద్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. అక్కడి కాల్వపై వంతెన నిర్మాణానికి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో శంకుస్థాపన జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న ప్రస్తుత పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి చొరవతో ఈ వంతెన మంజూరైంది. శంకుస్థాపన జరిగిన వెంటనే పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పెనమలూరు నుంచి పోటీ చేసిన బోడే ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హాయాంలో ఐదేళ్ళలో వంతెన పనులు పూర్తిచేయలేకపోయారు. బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో చిన్న వంతెన నిర్మాణాన్ని కాంట్రాక్టర్ ఐదేళ్ల పాటు సాగదీశాడు.
వంతెనపై పచ్చ రాజకీయం
2019 ఎన్నికల్లో బోడే ప్రసాద్ ఓడిపోయి పార్థసారథి విజయం సాధించారు. కాంగ్రెస్ హయాంలో తాను శంకుస్థాపన చేసిన వంతెన ఇంకా పూర్తికాకపోవడంతో వంతెన నిర్మాణంపై పార్ధసారధి ప్రత్యేక దృష్టి సారించారు. ఇరిగేషన్ శాఖ అడ్డంకులన్నీ తొలగించి వంతెన నిర్మాణం పూర్తిచేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఇదే అదనుగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కాంట్రాక్టర్ తో కోర్టులో కేసు వేయించాడు. అప్పటి వరకూ జరిగిన పనులకు బిల్లులు చెల్లించలేదని.. అవి చెల్లించాలంటూ కాంట్రాక్టర్ కోర్టుకెళ్లాడు. గత రెండేళ్లుగా కోర్టులో పోరాడి, కాంట్రాక్టర్ కు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడంతో పాటు అసంపూర్తిగా మిగిలిపోయిన వంతెనను పూర్తిచేసేందుకు అన్ని అనుమతులు తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో పనులు తిరిగి మొదలు కానున్నాయి. విషయం తెలిసిన టీడీపీ నేత బోడే ప్రసాద్ తన వల్లే పనులు మొదలవుతున్నాయని చెప్పుకునేందుకు ఇప్పుడు కొత్తగా చిల్లర రాజకీయాలకు తెరతీసాడు.
ఇదేం ఖర్మరా బాబూ..!
తన ఐదేళ్ళ పదవీ కాలంలో పూర్తి చేయకపోగా.. ఇప్పుడు వంతెన పూర్తి చేసిన క్రెడిట్ అధికార పార్టీ ఎమ్మెల్యే పార్ధసారధికి వెళ్తుందనే అక్కసుతో బోడే ప్రసాద్ ఇదేం ఖర్మరా బాబూ అంటూ వంతెన వద్ద ఆందోళన చేపట్టాడు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు శాంతియుత నిరసన తెలిపారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం ఏర్పడటంతో పోలీసులు మోహరించారు. ఇదే అదనుగా భావించిన బోడే ప్రసాద్.. మహిళలను అడ్డం పెట్టకుని వైసీపీ శ్రేణులపై భౌతికదాడులకు పాల్పడ్డారు. ఫలితంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వంతెన వద్ద నిరసన పేరుతో బోడే ప్రసాద్ చాలా సేపు డ్రామా నడిపించాడు. బోడే చేపట్టిన నిరసన డ్రామాపై వైసీపీ శ్రేణులతో పాటు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన వంతెనను ఐదేళ్లలో పూర్తిచేయకుండా ఇప్పుడు క్రెడిట్ కొట్టేయడానికి ఇలా చీప్ పాలిటిక్స్ ప్లే చేయడాన్ని తప్పుబడుతున్నారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో కాంట్రాక్టర్ల దగ్గర్నుంచి డబ్బు దండుకుని.. అభివృద్ధి పనులను గాలికి వదిలేసిన బోడే ప్రసాద్ ఇప్పుడు ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడాన్ని సహించబోమని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.
- హితైషి, పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment