‘రింగ్‌’ అంతా లోకేశ్‌దే | TDP Leader Nara Lokesh Conspiracy In Amaravati Inner Ring Road Alignment - Sakshi
Sakshi News home page

Amaravati IRR Case: ‘రింగ్‌’ అంతా లోకేశ్‌దే

Published Thu, Sep 28 2023 2:06 AM | Last Updated on Thu, Sep 28 2023 2:53 PM

TDP Leader Nara Lokesh conspiracy in Amaravati inner ring road alignment - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ ఖరారు పేరిట జరిగిన భూ దోపిడీలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్‌ కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వెల్లడించింది. ఈమేరకు ఈ కేసులో లోకేశ్‌ను ఏ–14గా చేర్చినట్లు న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో పేర్కొంది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ పేరిట చంద్రబాబు, లోకేశ్‌ క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారని, తద్వారా తమ కుటుంబానికే చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌కు, లింగమనేని కుటుంబానికి చెందిన భూముల విలువ అమాంతం పెరి­గేలా అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. 

129 ఆధారాలతో దొరికిన లోకేశ్‌ 
ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా భారీ అక్రమాలకు పాల్పడిన కేసులో సిట్‌ అధికారులు లోకేశ్‌ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను గుర్తించి, జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాటిలో సీఆర్‌డీఏ, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన కీలక పత్రాలు, ఈమెయిల్‌ సందేశాలు, మ్యాపులతోపాటు మరికొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు.. టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులు, ప్రైవేటు ఏజెన్సీల ప్రతినిధుల వాంగ్మూలాలను కూడా సిట్‌ అధికారులు నమోదు చేశారు.

వారిలో కొందరు కీలక అధికారులు సంబంధిత నోట్‌ ఫైళ్లలో తాము లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారని పేర్కొనడం గమనార్హం. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించిన ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఇదే విషయాన్ని తెలిపాయి. నిబంధనలకు విరద్ధంగానే ఐఆర్‌ఆర్‌ ఎలైన్‌మెంట్‌ను నిర్ధారించారని సిట్‌ అధికారులకు ఈమెయిళ్లు పంపాయి. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ కోసం నిర్వహించిన సర్వే నివేదికను కూడా సిట్‌ అధికారులు జప్తు చేశారు. వీటన్నింటిలో లోకేశ్‌దే కీలక పాత్ర అని సిట్‌ సేకరించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.  


లింగమనేనితో క్విడ్‌ ప్రోకో.. హెరిటేజ్‌కు భూములు 
టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబు అధికారిక నివాసంలోనే లోకేశ్‌ కూడా నివసించారు. రాజధాని ఎక్కడ నిరి్మస్తారన్నది ముందుగానే తెలియడంతో తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ముందుగానే భూముల కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఇక లింగమనేని రమేశ్‌ కుటుంబంతో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారు. అందులో భాగంగా అమరావతిలో భూములు పొందారు. 2014 జులై 1న 7.21 ఎకరాలను కొనుగోలు చేస్తూ హెరిటేజ్‌ ఫుడ్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు.

అనంతరం 2014 జులై 7న ఆ భూములు రిజి్రస్టేషన్‌ చేయించారు. అనంతరం లింగమనేని రమేశ్‌ కుటుంబ సభ్యుల నుంచి 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఆ విషయం బయటకు పొక్కడంతో ఆ 4.55 ఎకరాలకు సేల్‌ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నారు. అనంతరం అధికారులపై ఒత్తిడి తెచ్చి లింగమనేని, హెరిటేజ్‌ ఫుడ్స్‌ భూములకు దూరంగా వెళుతున్న ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను మార్పించారు. లింగమనేని రమేశ్‌ కుటుంబానికి చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్‌ ఫుడ్స్‌ భూములను ఆనుకొని ఐఆర్‌ఆర్‌ వెళ్లేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు.

దాంతోపాటు చంద్రబాబు బినామీల పేరిట భారీగా కొల్లగొట్టిన భూములు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణ కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొల్లగొట్టిన 148 ఎకరాల విలువ అమాంతంగా పెరిగేలా కుట్రకు పాల్పడ్డారు. క్విడ్‌ప్రోకో కింద లింగమనేని రమేశ్‌ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. ఈ వివరాలన్నింటినీ పేర్కొంటూ సిట్‌ అధికారులు సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. దాంతో ఈ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  

హెరిటేజ్‌ అంటేనే నారా కుటుంబం
హెరిటేజ్‌ ఫుడ్స్‌ అంటే నారా చంద్రబాబు కుటుంబం.. చంద్రబాబు కుటుంబం అంటే హెరిటేజ్‌ ఫుడ్స్‌ అనేది బహిరంగ రహస్యం. అందుకే చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అనేక ప్రయోజనాలు కలిగించారు. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చడం ద్వారా హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అడ్డగోలుగా కల్పించిన ప్రయోజనం పెద్ద కుంభకోణమే. అందుకే ఈ కేసులో హెరిటేజ్‌ ఫుడ్స్‌ను ఏ–6గా సీఐడీ పేర్కొంది.

ఈ కేసులో ఏ–1 చంద్రబాబు సతీమణి అయిన నారా భువనేశ్వరి హెరిటేజ్‌ ఫుడ్స్‌కు వైస్‌ చైర్‌పర్సన్, ఎండీగా ఉండగా, ఏ–14గా ఉన్న లోకేశ్‌ భార్య బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా ఉన్నారు. వారి ద్వారా హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీ వ్యవహారాలను పూర్తిగా చంద్రబాబు, లోకేశే నిర్వహిస్తున్నారు. 56 శాతానికిపైగా షేర్లు ఉండటంతో ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు అంతా ఆ కుటుంబం ఆధిపత్యంలోనే ఉంది. 23,66,400 షేర్లతో 10.20 శాతం వాటా లోకేశ్‌ పేరునే ఉంది.

ఇక హెరిటేజ్‌ ఫుడ్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ నారా భువనేశ్వరి  53,30,826 షేర్లతో 22.98 శాతం వాటా కలిగి ఉన్నారు. లోకేశ్‌ భార్య బ్రాహ్మణి పేరిట 1,01,00 షేర్లు, నందమూరి బాలకృష్ణ పేరిట 6,820 షేర్లు ఉన్నాయి. వారి సమీప బంధువులు వి.గంగరాజు నాయుడుకు 0.25 శాతం, ఆయన భార్య వి.సుధా శారదకు 5.28 శాతం, మెగాడిడ్‌ కంపెనీకి 5.28 శాతం, నిర్వాణ హోల్డింగ్స్‌కు 11.09 శాతం వాటా ఉన్నా­యి. సంస్థ డైరెక్టర్ల బోర్డులో సభ్యులుగా ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, తుమ్మ­ల వెంకటేశ్వరరావు మెగాడిడ్, నిర్వాణ హోల్డింగ్స్‌లోనూ డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం. ఇలా హెరిటేజ్‌ ఫుడ్స్‌ మొత్తం చంద్రబాబు కుటుంబం చేతిలోనే ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement