
తెలుగు యువత అధ్యక్షుడిని కొడుతున్న ఎమ్మెల్యే నిమ్మల
పాలకొల్లు సెంట్రల్: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడిపై దాడి చేశారు. సోమవారం ఉదయం సత్యాగ్రహ దీక్షలో భాగంగా పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్ వద్ద రోడ్డుకు అడ్డంగా దీక్షకు రంగం సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని పట్టణ సీఐ అఖిల్ కోరారు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎమ్మెల్యే వెనుక ఉన్న నాయకులను పక్కకు ఉండాలని సీఐ హెచ్చరించారు.
ఈ సమయంలో తీవ్ర అసహనానికి గురైన రామానాయుడు తన వెనుక ఉన్న తెలుగుయువత నియోజకవర్గ అధ్యక్షుడు కె.నరేష్‌పై విరుచుకుపడ్డారు. ఆయనపై చేయిచేసుకున్నారు. పార్టీకే చెందిన తెలుగుయువత నేతపై ఎమ్మెల్యే దాడిచేయడం అక్కడున్న వారందరినీ భయభ్రాంతుల్ని చేసింది. ఊహించని ఘటనతో పార్టీ నాయకులు, కార్యకర్తలు దూరంగా వెళ్లిపోయారు. పబ్లిసిటీకి తానే ముందుండాలనుకునే రామానాయుడు ఎవరు ముందున్నా ఒప్పుకోరు. కానీ తన వెనుక నిలబడిన యువ దళిత నాయకుడిని ఇష్టానుసారం కొట్టడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పబ్లిసిటీ యావ పరాకాష్టకు చేరుకుందని, అందుకే ఈ సంఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment