హైకోర్టు జడ్జీల బదిలీపై టీడీపీ యాగీ  | TDP Over Action On Transfer Of High Court Judges | Sakshi
Sakshi News home page

హైకోర్టు జడ్జీల బదిలీపై టీడీపీ యాగీ 

Published Sat, Nov 26 2022 9:42 AM | Last Updated on Sat, Nov 26 2022 2:26 PM

TDP Over Action On Transfer Of High Court Judges - Sakshi

హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలియజేస్తున్న టీడీపీ లీగల్‌ సెల్, ఇతర న్యాయవాదులు

సాక్షి, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ దొనడి రమేశ్‌లను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో కొందరు న్యాయవాదులు శుక్రవారం హైకోర్టు విధులను బహిష్కరించారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఉదయం కోర్టు విధులు ప్రారంభం కాగానే టీడీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొందరు న్యాయవాదులు పలు కోర్టు హాళ్లలోకి వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని న్యాయమూర్తులను కోరారు.

ఇదే సమయంలో నిరసనకారుల్లో కొందరు.. సహచర న్యాయవాదులను తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్న ధోరణిలో బహిష్కరణకు సహకరించాలని కోరారు. దీంతో నిరసనకారుల తీరు పట్ల కొందరు న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. అసలు హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు రాకుండా మీరెలా విధుల బహిష్కరణ చేపడుతారంటూ నిరసనకారులను ఆ న్యాయమూర్తులు ప్రశ్నించారు. కోర్టు హాళ్లలో అరవడం వంటివి చేయవద్దని, కోర్టు బయటకు వెళ్లి చూసుకోండని తేల్చి చెప్పారు.

దీంతో కొంత వెనక్కి తగ్గిన నిరసనకారులు ఆయా కోర్టులకు వెళ్లి న్యాయవాదులను విధుల బహిష్కరణకు సహకరించాలంటూ అభ్యర్థించారు. దీంతో కొందరు న్యాయవాదులు కోర్టు హాళ్ల నుంచి బయటకు రాగా, మరికొందరు కోర్టు హాళ్లలోనే ఉండిపోయారు. న్యాయమూర్తులు సైతం కేసుల విచారణను ప్రారంభించారు. నిరసనకారులు తిరిగి కోర్టు హాళ్లకు వచ్చి పదే పదే విజ్ఞప్తి చేయడంతో న్యాయవాదులు బయటకు వచ్చారు. దీంతో న్యాయమూర్తులు కొద్దిసేపటి తరువాత బెంచ్‌ దిగి తమ తమ ఛాంబర్లకు వెళ్లిపోయారు. బెంచ్‌లు దిగేసినప్పటికీ న్యాయమూర్తులు సాయంకాలం వరకు హైకోర్టులోనే ఉన్నారు. హైకోర్టు పాలనా కార్యకలాపాలు యథాతథంగా సాగాయి.

హైకోర్టు ప్రధాన ద్వారం నుంచి ర్యాలీ 
టీడీపీ లీగల్‌ సెల్‌కు చెందిన న్యాయవాదులు ఇతర పార్టీలకు చెందిన కొంత మంది న్యాయవాదులను పోగు చేసి, హైకోర్టు ప్రధాన ద్వారం వద్ద జస్టిస్‌ దేవానంద్, జస్టిస్‌ రమేశ్‌ల బదిలీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏకపక్ష బదిలీలను ఆపాలని నినదించారు. హైకోర్టు ప్రధాన ద్వారం నుంచి క్యాంటీన్‌ వరకు ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో రోజూ ఎల్లో మీడియా చర్చల్లో పాల్గొనే ఓ న్యాయవాది టీడీపీ న్యాయవాదుల ప్రోద్బలంతో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాక ఈ న్యాయమూర్తుల బదిలీలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించారు.

ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే ప్రజా జడ్జీలుగా ముద్రపడిన ఈ ఇద్దరు న్యాయమూర్తుల బదిలీ జరుగుతోందని ఆ న్యాయవాది ఆరోపించారు. ఈ బదిలీల్లోకి కులాన్ని సైతం లాగారు. ర్యాలీ అనంతరం నిరసనకారుల్లో పలువురు తమ దారిన తాము వెళ్లిపోయారు. కొందరు మాత్రం హైకోర్టు న్యాయవాదుల సంఘంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తుల బదిలీకి వ్యతిరేకంగా హైకోర్టు న్యాయవాదుల సంఘం పేరు మీద కొన్ని తీర్మానాలు చేశారు. బదిలీ సిఫారసులను ఆపేసి ఇద్దరు న్యాయమూర్తులను యథాతథంగా ఏపీ హైకోర్టులో కొనసాగేలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ తీర్మానం చేశారు. బదిలీలకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో నిరసనలు తెలియచేయాలని కూడా తీర్మానించారు. సోమవారం కూడా విధుల బహిష్కరణను కొనసాగించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

ఇది న్యాయవ్యవస్థపై దాడి చేయడమే.. 
న్యాయమూర్తుల బదిలీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించడం దారుణం. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన కొలీజియం స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. పరిపాలనా సౌలభ్యం కోసం న్యాయమూర్తులను బదిలీ చేస్తుందే తప్ప, అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఫిర్యాదుల ఆధారంగా బదిలీ చేయడం ఉండదు.

అంతర్గతంగా ఇంటెలిజెన్స్‌ ఇచ్చే సమాచారం ఆధారంగా కొలీజియం నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయాన్ని తప్పుపట్టే హక్కు ఎవరికీ లేదు. న్యాయమూర్తుల బదిలీలను ప్రశ్నించడమంటే సుప్రీంకోర్టు కొలీజియాన్ని అవమాన పరచడమే. ప్రభుత్వం చెబితేనే సుప్రీంకోర్టు కొలీజియం న్యాయమూర్తులను బదిలీ చేసిందని చెప్పడం న్యాయవ్యవస్థపై దాడి చేయడమే అవుతుంది.
– పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌

ఆ తీర్మానంతో సంబంధం లేదు  
హైకోర్టు న్యాయవాదుల సంఘం పేరున తీర్మానం చేయడాన్ని హైకోర్టు న్యాయవాదుల సంఘం  ఖండిస్తోంది. తీర్మానాలు చేసేందుకు ఆ న్యాయవాదులకు సంఘం ఎలాంటి ఆథరైజేషన్‌ ఇవ్వలేదు. న్యాయవాదులు ఎలాంటి సమ్మెకు పిలుపునివ్వడం గానీ, సమ్మెలో పాల్గొనరాదన్న సుప్రీం ఆదేశాలకు మా సంఘం కట్టుబడి ఉంది.  హైకోర్టు విధుల బహిష్కరణకు మేం పిలుపునివ్వలేదు. న్యాయవాదులు  కోర్టు విధులకు ఆటంకం కలిగించవద్దని వి జ్ఞప్తి చేస్తున్నాం.
–జానకిరామిరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు 

ప్యాకేజీ శ్రవణ్‌.. ఒళ్లు దగ్గరపెట్టుకో..
సీఎం జగన్‌పై న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ చేసిన ఆరోపణలు సబబు కాదు. తక్షణం సీఎంకు క్షమాపణ చెప్పాలి. స్వతంత్ర  న్యాయ వ్యవస్థకు కులాలను ఆపాదించడం దారుణం.  శ్రవణ్‌కుమార్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. శ్రవణ్‌ ఓ 420. జడ్జి కాకున్నా  ఆ పదవి తగిలించుకున్న ఇతనిపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలి.  ప్యాకేజీకి ఆశపడి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే సహించేది లేదు. 
– పెరికె వరప్రసాద్‌రావు, గవాస్కర్, బెజవాడ న్యాయవాదుల సంఘం
చదవండి:
AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. పోస్టుల వివరాలు ఇవే.. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement