రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యకాండ
పలుచోట్ల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు గెలిచినా టీడీపీ మద్దతుదారులకే పట్టం
40,150 పాఠశాలల్లో ఎన్నికలు పూర్తయినట్లు ప్రభుత్వం ప్రకటన
సాక్షి అమరావతి/ సాక్షి, నెట్‌వర్క్: పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీ (స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ–ఎస్‌ఎంసీ) ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా జరిగేలా అధికార టీడీపీ నేతలు యథేచ్ఛగా దౌర్జన్యకాండ సాగించారు. తాము చెప్పిన వారినే చైర్మన్ చేయాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు.
వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించినప్పటికీ, ఆ మేరకు అధికారికంగా ప్రకటించకుండా అడ్డుపడ్డారు. పోలీసుల కనుసన్నల్లోనే ఎన్నికలు జరిగినప్పటికీ టీడీపీ నేతల రౌడీయిజాన్ని వారు ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. 24 జిల్లాల పరిధిలోని 40,781 పాఠశాలలకు గాను 40,150 (98.45%) పాఠశాలల్లో గురువారం టీడీపీ మూకల దౌర్జన్యం మధ్య ఎన్నికలు పూర్తయ్యాయి.
631 పాఠశాలల్లో వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. ఎన్నికలు నిర్వహించని పాఠశాలలకు రీ షెడ్యూల్ ప్రకటించినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఈ నెల 17న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
అడుగడుగునాదౌర్జన్యం
» వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం కమలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సభ్యులందరూ చిట్టిబోయిన కవితను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఇంతలో అదే గ్రామానికి చేందిన టీడీపీ నేత వడ్డమాను సుధర్శన్‌రావు, మరి కొంత మంది పాఠశాలకు వచ్చారు. మోపూరి పార్వతి అనే మహిళను చైర్మన్‌గా చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రహ్మంగారి మఠం మండలంలో పలు పాఠశాలల్లో తల్లిదండ్రులతో సంబంధం లేకుండా టీడీపీ నేతలే చైర్మన్‌లను నియమించారు.
» శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం మలుగూరు ప్రాథమిక పాఠశాలలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరురాలు లావణ్య పూర్తి మెజార్టీతో గెలిచారు. అయినా ఆమె గెలుపును అధికారికంగా ప్రకటించకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రెండవసారి ఎన్నిక జరపాలని పట్టుబట్టారు. దీంతో 30 మంది సభ్యుల్లో 22 మంది లావణ్యకు మద్దతు తెలిపారు. అయినా టీడీపీ నాయకులు హెచ్‌ఎంతో గొడవ పెట్టుకున్నారు. సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన రూరల్ సీఐ కూడా టీడీపీ నాయకులకే మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికను శుక్రవారం నాటికి వాయిదా వేశారు.
» ధర్మవరం రూరల్ మండలం రేగాటిపల్లి మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో టీడీపీ వర్గీయులు మాత్రమే పాఠశాలలోకి ప్రవేశించి, ఇతరులెవ్వరూ లోపలకు రాకుండా అడ్డుకున్నారు. పలువురు పాఠశాల బయట గొడవ చేయగా, ఎన్నికను వాయిదా వేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సొంతూరు తోపుదుర్తి గ్రామంలో డీఎస్పీ శివారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన తల్లిదండ్రులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి పంపకుండా అడ్డుకున్నారు. టీడీపీ మద్దతుదారులను సభ్యులుగా ఎన్నుకున్న తర్వాత వీరిని లోపలికి అనుమతించారు.
» డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పెద్ద దళితవాడ మండల పరిషత్ పాఠశాలలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గెలుపొందినా, టీడీపీ నేతల హెచ్చరికలతో టీడీపీ మద్దతుదారు గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటి కేశవరం ప్రాథమిక పాఠశాలలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గుడాల వసంతకుమార్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే ఎస్‌ఐ ఆనందకుమార్ జోక్యం వల్ల టీడీపీ మద్దతుదారు పి.అచ్చియ్యమ్మ ఒక్క ఓటు మెజార్టీతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.
» తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో.. కమిటీలో లేని వారిని ఎలా అభ్యర్థిగా నియమిస్తారని వైఎస్సార్‌సీపీ నేతలు నిలదీయడంతో టీడీపీ నేతలు గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
» సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ముందుగానే తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లను ఇచ్చి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారు. దీంతో పోటీలో నిలబడాలనే ఆశతో వచ్చిన పలువురు తల్లిదండ్రులు నిరాశతో వెనుదిరిగారు.
గంగాధరనెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలంలోని గంగమాంబపురం జెడ్పీ హైస్కూల్‌లో టీడీపీ మద్దతుదారును ఏకపక్షంగా ఎంపిక చేశారు.
» గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన బూసి ఏసుమరియమ్మ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీంతో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని, వారి మద్దతుదారులు ఎన్నికైనట్లు ప్రకటించారు.
» విశాఖ జిల్లా చంద్రంపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరులు ప్రధానోపాధ్యాయుడి చాంబర్‌లో తిష్టవేసి మొత్తం వ్యవహారం వారికి అనుకూలంగా నడిపించారు.
» శ్రీకాకుళం జిల్లా జలుమూరు బాలికల ఉన్నత పాఠశాలలో వైఎస్సార్‌సీపీకి చెందిన కింజరాపు పద్మ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీన్ని సహించలేని స్థానిక టీడీపీ నేత మునుకోటి దామోదరరావు.. పోలీసులు తమకు సహకరించలేదని పోలీసు స్టేషన్‌పై దాడికి యత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment