సాక్షి, అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఆరు స్థానాలను సాధించింది. టీడీపీ ఒక స్థానాన్ని దక్కించుకుంది. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా వైఎస్సార్‌సీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలముంది. టీడీపీ నుంచి 23 మంది గెలుపొందినా చంద్రబాబు పోకడలు నచ్చక నలుగురు సభ్యులు ఆదిలోనే ఆ పార్టీకి దూరమయ్యారు.
పవన్ కళ్యాణ్ వ్యవహార శైలితో ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక సభ్యుడూ జనసేనకు దూరమయ్యారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే టీడీపీకీ సాంకేతికంగా 19 మంది సభ్యులే ఉన్నట్లు స్పష్టమవుతోంది. టీడీపీకి దూరమైన నలుగురు ఎమ్మెల్యేలు, జనసేనకు దూరమైన ఒక ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని దక్కించుకోవాలంటే 22 మంది ఎమ్మెల్యేల మొదటి ప్రాధాన్యత ఓట్లు అవసరం.
వైఎస్సార్ సీపీకి శాసనసభలో స్పష్టమైన ఆధిక్యత ఉండటంతో ఏడు స్థానాలకూ అభ్యర్థులను పోటీకి పెట్టింది. తమకు సంఖ్యాబలం లేకపోయినప్పటికీ ప్రలోభాలకు తెర తీస్తూ ఒక స్థానం నుంచి అభ్యర్థిని చంద్రబాబు బరిలోకి దింపారు.
175 ఓట్లు చెల్లుబాటు
ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ శాసనసభ కమిటీ హాల్ నెంబర్–1లో పోలింగ్ నిర్వహించారు. 175 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సాయంత్రం 5 గంటలకు ఎన్నికల పరిశీలకుడు ఎంటీ కృష్ణబాబు పర్యవేక్షణలో రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. పోలైన 175 ఓట్లు నిబంధనల మేరకు ఉండటంతో అన్నీ చెల్లుతాయని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆరుగురు విజయం..
తొలుత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పెన్మత్స వీవీ సూర్యనారాయణరాజు, పోతుల సునీత, బొమ్మి ఇజ్రాయెల్, చంద్రగిరి ఏసురత్నం, మర్రి రాజశేఖర్‌లకు 22 ఓట్లు చొప్పున వచ్చాయి. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు లభించాయి. దీంతో వారు మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
మరో ఇద్దరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు జయమంగళ వెంకటరమణ, కోలా గురువులకు 21 చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. వారిద్దరికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు సమానంగా రావడంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఈ క్రమంలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు అత్యధికంగా వచ్చిన జయమంగళ వెంకటరమణ గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
ప్రలోభాల రాజకీయాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్
తెలంగాణ శాసనమండలికి 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దించిన చంద్రబాబు ఓటుకు కోట్లను వెదజల్లి సాక్ష్యాధారాలతో 2015 మే 31న తెలంగాణ ఏసీబీ విభాగానికి దొరికిపోయారు. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు తాకట్టు పెట్టి రాత్రికి రాత్రే హైదరాబాద్ నుంచి పరారై కృష్ణా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలోకి చేరుకున్నారు.
2014 నుంచి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉండగా వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారు. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడంలోనూ ప్రలోభాలనే చంద్రబాబు ఎంచుకున్నారు. చంద్రబాబు కేవలం ప్రలోభాల రాజకీయాలు మాత్రమే చేస్తారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రలోభాలకు చంద్రబాబును బ్రాండ్ అంబాసిడర్‌గా అభివర్ణిస్తున్నారు.
గడప గడపకూ విఫలమైన వారే లక్ష్యంగా..
నిర్విఘ్నంగా కొనసాగుతున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజాదరణ నానాటికీ పెరుగుతోంది. 2019 ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ రికార్డు మెజార్టీతో విజయం సాధించడమే అందుకు తార్కాణం.
మూడేళ్లుగా చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలు, అందిస్తున్న సుపరిపాలనను ప్రతి ఇంటికీ వివరిస్తూ ప్రజల ఆశీస్సులు కోరేందుకు 2022 మే 11న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మనం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో మమేకమై సమస్యలు పరిష్కరిస్తూ ఆశీస్సులు పొందాలని ఆదిలోనే ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
ఈ క్రమంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఎప్పటికప్పుడు వర్క్ షాప్‌లు నిర్వహిస్తూ మరింత ప్రభావవంతంగా నిర్వహించేలా ఎమ్మెల్యేలకు సూచనలు చేస్తున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించడంలో వెనుకబడ్డ ఎమ్మెల్యేలను పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచిస్తున్నారు.
ఆ మేరకు గడప గడపకూ సమర్థంగా నిర్వహించలేక.. ప్రజలతో మమేకమవ్వలేక వైఎస్సార్‌సీపీకి దూరమైన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డికి తోడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను రూ.కోట్లు వెదజల్లి సంతలో పశువుల్లా కొనుగోలు చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొడ్డిదారిన విజయం సాధించాలని చంద్రబాబు వ్యూహం రచించారు.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో విఫలమైన వారితోపాటు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ టికెట్ దక్కదనే సంకేతాలున్న ఎమ్మెల్యేలే లక్ష్యంగా ప్రలోభాలకు చంద్రబాబు తెరతీశారు. ఈ క్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ చేయించారు. దీంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు 23 ఓట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment