తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన టీఎస్ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు ఇక తమ సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్లబోతున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ బుధవారం జీవో ఇచ్చారు. ఏపీలో పనిచేస్తున్న క్లాస్–3, క్లాస్–4 తెలంగాణ ఉద్యోగులు బుధవారం ఉదయం ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రావిురెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. తమ సొంత రాష్ట్రమైన తెలంగాణలో సర్వీసులు కొనసాగించేందుకు గానూ.. తమను రిలీవ్ చేయాలని ముఖ్యమంత్రికి వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. వారిని రిలీవ్ చేసేందుకు అంగీకరించారు.
ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే స్వరాష్ట్రానికి వెళ్లబోతున్న ఉద్యోగులకు సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 711 మంది ఉద్యోగులు తెలంగాణకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందని.. సీఎం వైఎస్ జగన్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని చెప్పారు. ఆయన ఇదే విధంగా మున్ముందు కూడా ప్రజల అభిమానం పొందాలని ఆకాంక్షించారు. వారి వెంట పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.శ్రీనివాసులరెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment