సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు మరో భరోసా దక్కనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనాథ బాలలను ఆదుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్ స్కీం ద్వారా ఆదుకునేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. కోవిడ్ కారణంగా అనాథలుగా మారిన పిల్లల సమగ్ర సంరక్షణ, విద్య, ఉపాధి, వసతి వంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టగా కేంద్ర ప్రభుత్వం మరో రూ.10 లక్షలు డిపాజిట్ చేసి సంరక్షణ చర్యలు తీసుకోనుంది. పీఎం కేర్ స్కీమ్ పథకానికి కలెక్టర్ల ద్వారా నిర్వహించిన ఎంపికలో 237 మంది అర్హులని గుర్తించారు.
గతేడాది మార్చి 11 నుంచి కూడా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన 18 ఏళ్లలోపు బాలలు ఈ పథకానికి అర్హులు. ఈ ఏడాది మే 29 నుంచి లబ్ధిదారుల నమోదు ప్రక్రియ జరుగుతోంది. డిసెంబర్ 31 వరకు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులకు రూ.10 లక్షల వంతున పోస్టాఫీసులో డిపాజిట్ చేసి, వారికి 18 సంవత్సరాలు దాటిన తరువాత 23 ఏళ్ల వరకు ఆ డిపాజిట్‌పై ప్రతినెల స్టైఫండ్ ఇస్తారు. 23 ఏళ్లు నిండిన తర్వాత డిపాజిట్ మొత్తాన్ని వారికి అప్పగిస్తారు. అనాథ బాలల సమగ్ర సంరక్షణతోపాటు విద్య, ఆరోగ్యం, ఉపాధికి ప్రాధాన్యం ఇస్తారు. వారికి ఆరోగ్య బీమాతోపాటు ప్రమాద బీమా రూ.5 లక్షలు వర్తించేలా చేస్తారు.
అనాథ బాలలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన బాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 లక్షలు చొప్పున బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. వారికి పిల్లల సంరక్షణ కేంద్రాల్లో (ఛైల్డ్ కేర్ సెంటర్‌లలో) వసతి, విద్య, వైద్యం వంటి ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.10 లక్షల డిపాజిట్ వారికి 18 ఏళ్లు నిండగానే తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మరో రూ.10 లక్షల డిపాజిట్ 23 ఏళ్ల వయసు నిండాకే తీసుకునేలా మార్గదర్శకాలు ఇచ్చారు. అనాథ బాలలకు అవసరమైన తోడ్పాటు అందించేలా సంబంధిత ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తాం.
– కృతికాశుక్లా, మహిళా శిశుసంక్షేమశాఖ సంచాలకులు
Comments
Please login to add a commentAdd a comment