సాక్షి, అమరావతి: రాజస్థాన్‌లోని జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో సాగు, తాగునీటి సమస్య పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ, బత్తలపల్లి, ధర్మవరం, తాడిమర్రి మండలాల్లో 23 వేల ఎకరాలకు నీళ్లందించడమే లక్ష్యంగా 2.41 టీఎంసీల సామర్థ్యంతో జిల్లేడుబండ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ రిజర్వాయర్ పనులకు రూ.609.14 కోట్ల అంచనా వ్యయంతో ఎల్‌ఎస్(లంప్సమ్–ఓపెన్) విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది.
షెడ్యూళ్లు దాఖలుకు అక్టోబర్ 7ను తుది గడువుగా నిర్ణయించింది. అదే రోజున నిర్వహించే ప్రీ–బిడ్ సమావేశంలో షెడ్యూళ్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థలు ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) రూపంలో రూ.6.09 కోట్ల చొప్పున తీసిన డీడీలను హంద్రీ–నీవా సుజల స్రవంతి ఎస్‌ఈ–2కు అందించాలి. అక్టోబర్ 11న ఆర్థిక బిడ్‌ను తెరుస్తారు. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టు సంస్థ కోట్‌చేసిన ధరనే కాంట్రాక్టు విలువగా పరిగణించి.. అదేరోజు ఈ–ఆక్షన్ (రివర్స్ టెండరింగ్) నిర్వహిస్తారు. ఇందులో అతి తక్కువ ధరకు కోట్‌చేసిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించడానికి అనుమతివ్వాలని స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి ప్రతిపాదనలు పంపుతారు.
హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగంగా..
హంద్రీ–నీవా రెండో దశలో అంతర్భాగంగా జిల్లేడుబండ రిజర్వాయర్‌ను ప్రభుత్వం చేపట్టింది. హంద్రీ– నీవా ప్రధాన కాలువ 377.1 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ నిర్మించి.. అక్కడి నుంచి తవ్వే కాలువ ద్వారా కొత్తగా నిర్మించే జిల్లేడుబండ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. ఈ రిజర్వాయర్ కింద తవ్వే పిల్ల కాలువల ద్వారా బత్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం, తాడిమర్రి మండలాల్లో 23 వేల ఎకరాలకు నీళ్లందిస్తారు.