మాపై దయ చూ‘పింఛనే’ లేరా!
రేపటి నుంచి పింఛన్ ఇంటికి తెచ్చి ఇవ్వరంట నిజమేనా!
వలంటీర్లను తీసేశారంట ఎందుకు బాబూ..!
సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవడం మా వల్ల కాదయ్యా..
ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు వద్ద ఓ అవ్వ ఆవేదన
నక్కపల్లి(అనకాపల్లి జిల్లా): రేపటి నుంచి పింఛన్ ఇంటికి తెచ్చి ఇవ్వరన్న వార్తలు అవ్వాతాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. టీడీపీ హయాంలో పడిన అవస్థలు జ్ఞప్తికి తెచ్చుకుని వారు ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందేమోనని మదనపడుతున్నారు. ఇదే విషయంపై తన గోడు వెలిబుచ్చారు ఓ అవ్వ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చినదొడ్డిగల్లుకు వచ్చిన వైఎస్సార్ సీపీ అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు కురందాసు వృద్ధురాలు ఎరకమ్మ ఇంటికి వెళ్లారు.
పింఛను వస్తుందా అంటూ ఆరా తీశారు. ఎరకమ్మ బదులిస్తూ ‘‘ఇప్పటివరకు ప్రతినెలా ఒకటో తేదీ పొద్దుపొద్దునే వలంటీరు వచ్చి డబ్బులిస్తున్నాడు. రేపు ఒకటోతేదీ కదా పింఛను ఇంటికి తెచ్చి ఇవ్వరంట. మేమే సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవాలంట. వలంటీర్లను తీసేశారంట నిజమేనా బాబూ! ఈ వయసులో సచివాలయం వరకు వెళ్లి తెచ్చుకోలేమయ్యా.. ఇంటికొచ్చి ఇచ్చేటట్టు చూడయ్యా’’ అంటూ వేడుకుంది.
ముత్యాలనాయుడు స్పందిస్తూ చంద్రబాబు వల్లే ఎన్నికల అధికారులు వలంటీర్లను రెండునెలలపాటు ఆపారు. జగనన్నకు ఓట్లు వేసి గెలిపిస్తే మళ్లీ వలంటీర్లు ఇంటికొచ్చి పింఛన్ ఇస్తారు. మీరంతా జగన్‌కే ఓట్లు వేయాలని’’ అని వివరించారు. అవ్వ మాట్లాడుతూ ‘‘నా ఓటు జగన్‌బాబుకే కొడుకా’’ అని వెల్లడించింది. అదే గ్రామంలో అప్పారావు అనే వృద్ధుడూ పింఛన్ ఇంటికే తెచ్చివ్వాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment