అప్పట్లో వైఎస్సార్ సీపీ ఎంపీపీకి చెందిన భవనం కూల్చివేస్తానని హంగామా
ఇప్పుడేమో అక్రమ కట్టడానికి వత్తాసు పలుకుతున్న వైనం
వివాదాస్పదం అవుతున్న తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారశైలి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/తిరువూరు: తిరువూరు ఎమ్మెల్యే నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచీ వివాదాలే.. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గాన్ని వివాదాల మయం చేస్తున్నారు. ఏదోక దుందుడుకు చర్యతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో సైతం వివాదాస్పద వ్యాఖ్యలతో సొంత క్యాడర్‌లోనే అసంతృప్తి రేగింది. ఆది నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నవారిని లెక్క చేయపోవడంతో ఆయన తీరుపైన పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసిన ఆయన ప్రవర్తనలో మాత్రం మార్పురాలేదు. తీరా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదం అవుతూనే ఉన్నాయి.
వైఎస్సార్‌సీపీ ఎంపీపీ కాలసాని నాగలక్ష్మి భర్త, చెన్నారావు నిర్మించిన భవనాన్ని అక్రమ కట్టడం పేరుతో కూల్చివేసే ప్రయత్నం చేశారు. తానే స్వయంగా బుల్డోజర్‌ని తీసుకెళ్లి కూల్చివేస్తానని హంగామా చేశారు. పోలీసులు, అక్కడ అధికారులు వారిస్తున్నా వినకుండా డాబా దిగువన ఉన్న గదిని కూల్చేశారు. రోడ్లపైన ఉన్న గోతులను పూడ్చాల్సింది అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఆయనదే బాధ్యత. అయితే బాధ్యత మరిచి రోడ్డుపై ఉన్న నీటి గుంత ముందు కూర్చొని నిరసన తెలిపారు. సొంత పార్టీనేతలను లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో విస్సన్నపేటలో గ్రామ కమిటీ నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పారు.
తాజాగా మరొక వివాదంతో..
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదానికి తెరతీశారు. ఎమ్మెల్యే ప్రధానవీధిలో నడిబొడ్డున ఉన్న ఒక భారీ అక్రమ కట్టడంపై నగరపంచాయతీ తీసుకున్న చట్టపరమైన చర్యలను వ్యతిరేకిస్తున్నారు. ఆ కట్టడం ఒక వార్డు కౌన్సిలర్‌కు చెందినది కావడంతో ఆ సామాజికవర్గానికి తాను అండగా ఉంటానంటూ సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే చేస్తున్న హడావుడి చర్చనీయాంశమైంది. దీనికి తోడు అక్రమ కట్టడంపై చర్యలు తీసుకోవాలని మరో వార్డు కౌన్సిలర్ చేస్తున్న ఆందోళనకు ఎమ్మెల్యే రాజకీయ రంగు పులిమారు.
మంగళవారం అక్రమ కట్టడాలపై నగర పంచాయతీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. నగర పంచాయతీ పాలకవర్గం వైఎస్సార్ సీపీ ఆధీనంలో ఉండగా, వ్యాపారులకు నష్టం కలిగించే చర్యలకు ఆ పార్టీ పాల్పడుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే పోస్టు చేస్తున్నారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ, అక్రమ కట్టడాలపై చర్య తీసుకోవాలంటూ 9వ వార్డు కౌన్సిలర్ దుర్గారావు నగరపంచాయతీ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే..
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికే తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఏనాడూ తిరువూరులో వ్యాపారులతో కక్షసాధింపు ధోరణికి పాల్పడలేదని, సామరస్య పూర్వకంగానే వ్యవహరించిందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
పార్టీకి సంబంధం లేదు..
అక్రమ కట్టడాల విషయంలో అధికారులే తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు సైతం తనకు సంబంధం లేని అంశాల్లో తలదూరుస్తూ నియోజకవర్గంలో అభద్రతా వాతావరణాన్ని సృష్టించడం సరికాదు. ఆయన వివాదాస్పద వైఖరి ఇకనైనా మార్చుకోవాలి.
– నల్లగట్ల స్వామిదాసు, తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి
Comments
Please login to add a commentAdd a comment