రాతి గనులు.. మేటి ఘనత | Thousands Of People Employed In The Stone Mines | Sakshi
Sakshi News home page

రాతి గనులు.. మేటి ఘనత

Published Sun, May 1 2022 2:06 PM | Last Updated on Sun, May 1 2022 2:10 PM

Thousands Of People Employed In The Stone Mines - Sakshi

కొలిమిగుండ్ల: బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె మండలాల్లో  విస్తరించి ఉన్న నాపరాతి ఖనిజ సంపద వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ ప్రాంత ప్రజలు కొన్ని దశాబ్దాల నుంచి ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వందల కుటుంబాలకు గనులు జీవనోపాధి కల్పిస్తున్నాయి. గనుల్లో పని చేయడం కార్మికులకు ప్రతి రోజు సవాల్‌గా మారుతుంటుంది. పని చేసే సమయంలో చాలా మంది కార్మికులు మృత్యువాత పడటం లేదా తీవ్రగాయాల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయి. 

నియోజకవర్గ వ్యాప్తంగా 950 హెక్టార్లలో నాపరాతి గనులు విస్తరించి ఉన్నాయి. రోజుకు 400 టన్నులకు పైగానే ఉత్పత్తి జరుగుతుంటుంది. రాయల్టీ, మైనింగ్‌ లీజు, తదితర వాటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.30 కోట్ల మేర ఆదాయం వస్తోంది. కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లె క్రాస్‌ రోడ్డు సమీపంలో భూగర్బ గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్‌పోస్ట్‌ ద్వారా ఏడాదికి రూ.6 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. నాపరాతి గనులపై ఆధారపడి నియోజకవర్గంలో 500కు పైగా, అనంతపురం జిల్లా తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో వెయ్యికి పైగా పాలీష్‌  ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. గనుల్లో వెలికితీసిన నాపరాళ్లు ప్రతి రోజు ట్రాక్టర్ల ద్వారా ఫ్యాక్టరీలకు చేరవేస్తుంటారు. గనులు, ఫ్యాక్టరీలు. లోడిండ్, అన్‌లోడింగ్‌ కార్మికులతో పాటు ట్రాక్టర్‌ డ్రైవర్లు 40 వేల మంది పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.  

నాపరాయి ఖరీదు తక్కువ 
వివిధ రకాల ఖనిజాల కంటే నాపరాతి రేటు చాలా తక్కువ. అడుగు ఆరు రూపాయలు మాత్రమే. బేతంచెర్లలోని వైట్‌షీల్, వైట్‌క్లే తదితర రంగురాయి అడుగు రూ.14 నుంచి 25 ధర పలుకుతుంది. గ్రానైట్‌ తీసుకుంటే సాధారణంగా అడుగు రూ.45 వరకు ఉంటుంది. వాటితో పోలిస్తే నాపరాయి చాలా తక్కువ ధరకు వస్తుంది. ఇటీవల మైనింగ్‌ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31 రకాల ఖనిజాలను దృష్టిలో పెట్టుకొని నాపరాళ్లపై సెక్యూరిటీ డిపాజిట్, డెడ్‌రెంట్‌ పెంచడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.  

ఇతర రాష్ట్రాలకు ఎగుమతి 
బనగానపల్లె నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వెలికి తీసిన నాపరాళ్లు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు పదుల సంఖ్యలో  లారీల్లో ఎగుమతి జరుగుతుంటుంది. ఆ ప్రాంతాల్లో నాపరాళ్లను ఇళ్ల నిర్మాణాలు, కాల్వలు తదితర వాటికి ఉపయోగించే వాళ్లు. ప్రధానంగా ఫ్లోరింగ్‌ సమయంలో నాపరాయి ఉపయోగించి వాటిపై గ్రానైట్‌ రాళ్లు వాడుతుంటారు. కాలక్రమేణా నాపరాతి ఎగుమతి సన్నగిల్లుతోంది. ఛత్తీస్‌గడ్‌లో ఇదే తరహాలో బ్లాక్‌ స్టోన్‌ మైనింగ్‌ వెలికి తీయడంతో పాటు ఎక్కువ భాగం గ్రానైట్, టైల్స్, రాజస్థాన్‌ మార్బుల్స్‌ వాడకం పెరగడంతో నాపరాయికి డిమాండ్‌ తగ్గింది. గతంలో కూలీలతో పనులు చేయించేవాళ్లు, కాలక్రమేణా యంత్రాలు రావడంతో పెట్టుబడి పెరిగింది. ఉత్పత్తికి తగ్గట్టుగా ధర, డిమాండ్‌ లేక పోవడంతో యజమానులకు ఆశించిన లాభాలు రావడం లేదు.  

నాపరాయిపై అదనపు చార్జీలు తగ్గించాలి 
ఇతర ఖనిజాలతో పాటు నాపరాళ్లపై విధించిన అదనపు ఛార్జీలు తగ్గించాలి. చాలా తక్కువ ధరతో లభించేది నాపరాయి. అన్ని రకాల మినరల్స్‌తో సమానంగా బ్లాక్‌ స్టోన్‌పై అడ్వాన్స్‌ సెక్యూరిటీ డిపాజిట్, డెడ్‌రెంట్‌ పెంచడంతో పరిశ్రమ మరింత ఇబ్బందుల్లో పడుతుంది. నాపరాయి పరిశ్రమకి వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలి. 
– చంద్రశేఖరరెడ్డి, మైనింగ్‌ యజమాని, అంకిరెడ్డిపల్లె

30 ఏళ్లుగా గనులపైనే ఆధారం 
30 ఏళ్ల నుంచి నాపరాళ్ల గనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. కాలక్రమేణా నాపరాయికి మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గింది. పైగా పెట్టుబడులతో పాటు ఖర్చులు భారీగా పెరిగాయి. నష్టాలు చవి చూస్తే యజమానులు కోలుకోలేని పరిస్థితి ఉంటుంది.
– శివరామిరెడ్డి, గని యజమాని, అంకిరెడ్డిపల్లె  

వందల కుటుంబాలకు ఇదే జీవనం 
నాపరాతి గనులపై వందల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ప్రధాన వనరులు గనులే కావడంతో ఏరోజు పనికి వెళితే ఆరోజు కుటుంబం గడిచే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. గనుల్లో కూలీలు, లోడింగ్, అన్‌లోడింగ్‌ కార్మికులు, ట్రాక్టర్‌ డ్రైవర్లంతా ఈ పరిశ్రమపై ఆధారపడ్డారు. ప్రమాదకరమైన పనులు చేసే కార్మికుల కోసం ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి.                     
– సుబ్బరాయుడు, గని కార్మిక సంఘం నాయకుడు, బెలుం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement