సాక్షి, తిరుమల: శ్రీవారి హుండీ ఆదాయం సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఈ ఏడాది వరుసగా తొమ్మిదో నెల హుండీ ఆదాయం రూ.100 కోట్లను దాటింది. ఈ వార్షిక సంవత్సరం (టీటీడీలో మార్చి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు)లో హుండీ ద్వారా రూ. 1,000 కోట్లు ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేసింది. అయితే, మార్చి నుంచి నవంబరు వరకు 9 నెలలు నెలకు రూ. 100 కోట్లు దాటి హుండీ ఆదాయం వచ్చింది. గత 8 నెలల్లోనే రూ.1,164 కోట్లను దాటేసింది. నవంబరు నెలలో రూ.127.30 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈ వార్షిక సంవత్సరంలో శ్రీవారికి రూ.1,600 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తుందని టీటీడీ భావిస్తోంది.
రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం
కోరిన కోర్కెలు తీర్చే తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు మొక్కుల చెల్లింపులో భాగంగా హుండీలో కానుకలు సమర్పిస్తారు. ఇలా హుండీ ద్వారా శ్రీవారికి ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. ఇప్పటికే టీటీడీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.15,938 కోట్లు దాటగా, బంగారం నిల్వ 10,258 కేజీలు దాటింది. 1950వ సంవత్సరం వరకు శ్రీవారికి నిత్యం లభించే హుండీ ఆదాయం లక్ష రూపాయల లోపు ఉండగా, 1958లో మొదటిసారి లక్ష రూపాయలు దాటింది.
1990కి నిత్యం కోటి రూపాయలు పైగా హుండీ ఆదాయం లభించడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఏటేటా పెరుగుతోంది. 2010 అక్టోబర్ 23న రూ.3.6 కోట్లు, 2011 నవంబర్ 1న రూ.3.8 కోట్లు, 2012 జనవరి 1న రూ.4.23 కోట్ల ఆదాయం వచ్చింది. 2012 ఏప్రిల్ ఒకటో తేదీన అత్యధికంగా రూ.5.73 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది జూలై 4వ తేదీకి రూ.6 కోట్లు దాటేసింది. 2015–16 సంవత్సరంలో హుండీ ఆదాయం రూ.1,000 కోట్లు దాటగా, 2019 – 20లో రికార్డు స్థాయిలో రూ.1,313 కోట్లు రావడం విశేషం. కోవిడ్ కారణంగా వరుసగా రెండు సంవత్సరాలు స్వామి వారి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గింది.
2020 –21లో రూ.731 కోట్లు, 2021–22లో రూ.933 కోట్లు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభిస్తోంది. వరుసగా 9వ నెల కూడా స్వామికి లభించిన హుండీ ఆదాయం రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. కోవిడ్ కారణంగా రెండేళ్లు శ్రీవారి దర్శనానికి దూరంగా ఉన్న భక్తులు ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తిరుమలకు విచ్చేసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీవారి ఆదాయం పెరుగుతున్నట్లు టీటీడీ చెబుతోంది.
చదవండి: (రాయలసీమ ప్రగతికి మరో ‘హైవే’.. రూ.1,500.11 కోట్లతో 4లేన్ల రహదారి)
Comments
Please login to add a commentAdd a comment