సాక్షి, అమరావతి: వర్జీనియా పొగాకు సాగుదార్ల ఆశలపై టుబాకో బోర్డు నీళ్లు చల్లింది. ఒక్కో బ్యారన్ పరిధిలో విక్రయ పరిమాణానికి నామమాత్రపు పెంపు మాత్రమే ఇచ్చింది. ఈ నిర్ణయం పట ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము పది క్వింటాళ్ల పెంపును ఊహిస్తే మూడో వంతు కూడా బోర్డు ప్రకటించలేదని పెదవి విరుస్తున్నారు. ఒక్కో బ్యారన్ కింద 2.5 నుంచి 3.5 క్వింటాళ్ల విక్రయ పెంపును మాత్రమే టుబాకో బోర్డు అనుమతించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. దక్షిణప్రాంత తేలికపాటి భూములు (ఎస్‌ఎల్‌ఎస్), దక్షిణాది నల్లరేగడి భూముల్లో (ఎస్‌బీఎస్) వర్జీనియా పొగాకు రైతులు 2021–22 సంవత్సరానికి ఒక్కో బ్యారన్ కింద కనీసం 40 క్వింటాళ్ల వరకైనా పొగాకును విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తారని ఆశించారు. అయితే ఇటీవల సమావేశమైన టుబాకో బోర్డు అధికారులు ఒక్కో బ్యారన్ కింద ఎస్‌ఎల్‌ఎస్ రైతులకైతే 33.5 క్వింటాళ్లు, ఎస్‌బీఎస్ రైతులకైతే 32.5 క్వింటాళ్ల విక్రయానికి మాత్రమే అనుమతించాలని తీర్మానించారు.
ఉత్పత్తి లక్ష్యం 130 మిలియన్ కిలోలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 130 మిలియన్ కిలోల పొ గాకు ఉత్పత్తి లక్ష్యం కాగా అందులో ఎస్‌ఎల్‌ఎస్ ప్రాంత రైతుల కోటా 43.68 మిలియన్ కిలోలు. ఎస్‌బీఎస్ ప్రాంత రై తుల కోటా 37.44 మిలియన్ కిలోలుగా అధికారులు నిర్ణయించారు. సాగు వ్యయం నానాటికీ పెరుగుతున్న పరిస్థితుల్లో మరింత పొగాకు విక్రయానికి బోర్డు అనుమతివ్వకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి పొగాకు పరిశోధనా సంస్థ (సీటీఆర్‌ఐ) ఒక్కో పొగాకు బ్యారన్ కింద కనీసం 55 క్వింటాళ్ల ఉత్పత్తికి అనుమతించాలని టుబాకో బోర్డుకు ప్రతిపాదించింది.
వర్షాధారిత ప్రాంతాల్లో రైతులు ఒక్కో పొగాకు బ్యారన్ కింద ఏడు ఎకరాలు సాగు చేస్తుంటారు. పరిస్థితులు బాగుండి దిగుబడి బాగా వస్తే రైతులు మరో బ్యారన్‌ను తీసుకోవడమో లేక అదనపు ఉత్పత్తికి జరిమానా కట్టడమో చేయాలి. ప్రతి ఏటా కనీసం పది శాతం సాగు వ్యయం పెరుగుతున్నది. ఆ స్థాయిలో రేటు పెరగడం లేదు. పంట విక్రయ విషయంలో బోర్డు నిర్ణయం రైతులకు శరాఘాతమని టుబాకో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు భద్రారెడ్డి వ్యాఖ్యానించారు.
‘వర్జీనియా’ రైతుకు ‘పొగ’
Published Sun, Aug 22 2021 5:06 AM | Last Updated on Sun, Aug 22 2021 5:06 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment