యాంత్రీకరణకు పొగాకు రైతుల మొగ్గు | Tobacco farmers for mechanization in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

యాంత్రీకరణకు పొగాకు రైతుల మొగ్గు

Published Wed, Feb 9 2022 5:28 AM | Last Updated on Wed, Feb 9 2022 5:28 AM

Tobacco farmers for mechanization in Andhra Pradesh - Sakshi

మల్టీపర్పస్‌ డ్రయర్‌లో క్యూరింగ్‌కు ట్రేలలో లోడ్‌ చేస్తున్న పొగాకు

దేవరపల్లి: కూలీల కొరత తీవ్రం కావడంతో రైతులు వ్యవసాయంలో యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. యాంత్రీకరణను ప్రభుత్వం ప్రోత్సహించి రాయితీలు కల్పించడంతో ఎక్కువ మంది రైతులు సాగులో మెషీన్ల సాయంతో లబ్ధిపొందుతున్నారు. పొగాకు సాగుకు కూలీల సమస్య ఏర్పడడంతో పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతం రైతులు యంత్రాల సాయం తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా పొగాకు క్యూరింగ్‌ విధానంలో మార్పులు తీసుకొస్తున్నారు. సాధారణంగా తోటలోని పొగాకు రెలిసి బ్యారన్‌ వద్దకు తీసుకువచ్చి కర్రలకు అల్లి బ్యారన్‌లో ఉంచి క్యూరింగ్‌ చేస్తారు.

ఈ విధానం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు కూలీల సంఖ్య ఎక్కువ అవసరం. ఈ విధానానికి స్వస్తి పలకడానికి విదేశాల్లో అవలంభిస్తున్న నూతన టెక్నాలజీని తీసుకువచ్చారు. జర్మనీలో రైతులు ఏర్పాటు చేసిన లూజ్‌లీఫ్‌ బ్యారన్లను పరిశీలించిన అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా బ్రెజిల్‌ నుంచి పరికరాలను దిగుమతి చేసుకుని జిల్లాలోని గోపాలపురం, యర్నగూడెంలో బ్యారన్లు నిర్మించారు. సుమారు రూ.9 లక్షల వ్యయంతో బ్యారన్‌ నిర్మించి ప్రయోగాత్మకంగా క్యూరింగ్‌ చేశారు. దీనివల్ల మంచి ఫలితాలు రావడంతో ఐటీసీ భాగస్వామ్యంతో ఈ ఏడాది గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో 14 యూనిట్ల నిర్మాణం చేపట్టారు. వీటిని పొగాకు క్యూరింగ్‌కు మాత్రమే కాకుండా మల్టీపర్పస్‌ యూనిట్లుగా వినియోగిస్తున్నారు.  

చిట్యాలలో 4 యూనిట్ల నిర్మాణం 
మల్టీపర్పస్‌ యూనిట్‌ ఖరీదు రూ.9 లక్షలుగా ఉంది. ఐటీసీ రూ.3 లక్షలు, పొగాకు బోర్డు రూ.3 లక్షలు ఇస్తుండగా, రైతు వాటాగా రూ.3 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. గోపాలపురం మండలంలోని చిట్యాలలో ఈ ఏడాది 4 యూనిట్లు నిర్మిస్తున్నారు. పొగాకు క్యూరింగ్‌తో పాటు కొబ్బరి, మొక్కజొన్న, అల్లం, పసుపు వంటి పంటలు డ్రై చేస్తున్నారు. 2,500 కొబ్బరి కాయలు ఒకేసారి డ్రై చేస్తున్నారు. దీనికి 30 గంటల సమయం పడుతుంది. 25 క్వింటాళ్ల మొక్కజొన్న గింజలను 12 గంటల్లో డ్రై చేస్తున్నారు. శీతాకాలం, వర్షాకాలంలో యూనిట్‌ బాగా ఉపయోగపడుతుంది.

డ్రై చేసిన పంటను గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకోవచ్చని రైతులు అంటున్నారు. మల్టీపర్పస్‌ యూనిట్ల వల్ల రైతుకు 50 శాతం ఖర్చు తగ్గుతుంది. కూలీల అవసరం ఉండదు. పొగాకు రైతులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ పద్థతిలో రెండు బ్యారన్లు క్యూరింగ్‌ చేసే పొగాకును లూజ్‌లీఫ్‌ బ్యారన్‌లో ఒకేసారి చేయవచ్చు. సాధారణ పద్ధతికి, లూజ్‌లీఫ్‌ బ్యారన్‌లో క్యూరింగ్‌ చేసే విధానానికి బ్యారన్‌కు సుమారు రూ.1.50 లక్షల తేడా వస్తుందని రైతులు తెలిపారు. బ్యారన్‌కు రెండు క్వింటాళ్లు పొగాకు ఆదా అవుతుంది.
  
ఆటో ప్యానల్‌ బోర్డు ఏర్పాటు 
లూజ్‌లీఫ్‌ బ్యారన్‌కు ఆటో ప్యానల్‌ బోర్డు ఏర్పాటు చేశారు. క్యూరింగ్‌లో టెంపరేచర్‌ హెచ్చు తగ్గులను బోర్డులోని సెన్సార్‌ పరికరం సరి చేసుకుంటుంది. ఒకేసారి 1200 నుంచి 1300 కిలోల పొగాకు క్యూరింగ్‌ అవుతుంది.

రైతులకు అన్ని విధాలుగా ఉపయోగం 
పొగాకు క్యూరింగ్‌ కోసం ఏర్పాటు చేసిన లూజ్‌ లీఫ్‌ బ్యారన్లు మల్టీపర్పస్‌ యూనిట్లుగా ఉపయోగపడుతున్నాయి. పొగాకు క్యూరింగ్‌తో పాటు డ్రయర్‌గా ఉపయోగిస్తున్నాం. కొబ్బరి, మొక్కజొన్న, పసుపు, అల్లం వంటి పంటల్ని డ్రై చేసి నిల్వ ఉంచుతున్నాం. కూలీల సమస్యను అధిగమించమించడంతోపాటు పంట నాణ్యత బాగుంటుంది. బ్యారన్‌కు ఏడాదికి రెండు క్వింటాళ్లు పొగాకు ఆదా అవుతుంది. 
– గద్దే శ్రీనివాస్, యర్నగూడెం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement