ఉమ్మడి ప్రకాశం నుంచి యశ్వంతపూర్‌ రైలు ఎక్కిన 30 మంది.. | TrainAccidentInOdisha | Sakshi
Sakshi News home page

ఉమ్మడి ప్రకాశం నుంచి యశ్వంతపూర్‌ రైలు ఎక్కిన 30 మంది..

Published Sun, Jun 4 2023 12:00 PM | Last Updated on Sun, Jun 4 2023 12:37 PM

 TrainAccidentInOdisha - Sakshi

‘చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు.. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు.. రక్తపు మడుగులా తయారై భయానకంగా మారిన ప్రమాద స్థలిని చూస్తే గుండె బరువెక్కుతోంది. ఈ ఘోర ప్రమాదం సంభవించిన రైల్లో తామూ ప్రయాణించామన్న విషయం తలుచుకుంటేనే భయమేస్తోంది. అప్పటి వరకూ తమతో కలిసి ప్రయాణం చేసిన వారు మృత్యువాత పడటం తీవ్రంగా కలచివేస్తోంది.’ అంటూ యశ్వంతపూర్‌– హౌరా ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించిన ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఈ రైలులో సుమారు 30 మంది ప్రయాణికులు ఎక్కగా.. అందులో ఆరుగురు మాత్రమే ప్రమాదం సంభవించినప్పుడు రైలులో ఉన్నారు. వారు కూడా క్షేమంగా ఉన్నారని తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలు రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్‌్కలు ఏర్పాటు చేశారు.  

ఒంగోలు టౌన్‌: ఒడిషాలోని బాలేశ్వర్‌ సమీపంలోని బహనాగ్‌బజార్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం వార్త విన్న ఒంగోలు వాసులు ఉలిక్కిపడ్డారు. గురువారం ఒంగోలు మీదుగా హౌరా వెళ్లిన యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి సుమారు 30 మంది ప్రయాణికులు ఎక్కారు. ఒంగోలులో 12 మంది, చీరాలలో మరో 18 మంది ఎక్కారు. జనరల్‌ బోగిలో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించారన్నది తెలియదు. వీరిలో ఏడుగురు ప్రయాణికులు వైజాగ్‌లో, 12 మంది విజయనగరంలో, ముగ్గురు పలాసలో దిగిపోయారు. అలాగే ఒకరు విజయవాడ, మరొకరు మచిలీపట్నంలో దిగినట్లు సమాచారం. వీరు కాకుండా చీరాల పట్టణానికి చెందిన ఆరుగురు వస్త్ర వ్యాపారులు రైలులోనే ప్రయాణించారు.

ఈ రైలులో ప్రయాణించిన వారితో సాక్షి మాట్లాడింది. యశ్వంత్‌పూర్‌ రైలు ప్రమాదానికి గురైనట్లు తెలిసి ఆందోళనకు గురయ్యామని తెలిపారు. విశాఖపట్నం నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తమ్ముడు గంటా చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి ఈ రైలులో ప్రయాణం చేసిన వారిలో ఉన్నారు. ఆయన జరుగుమల్లి మండలం కామేపల్లిలో వ్యవసాయం చేస్తుంటారు. కూతురు వినితకు ఏపీఎస్సీ మెయిన్‌ పరీక్షలు జరుగుతుండడంతో భార్య విజయలక్షి్మతో కలిసి వైజాగ్‌ వెళ్లారు. తాను ప్రయాణం చేసిన యశ్వంత్‌పూర్‌ రైలు ప్రమాదానికి గురి కావడం కలిచివేసిందని ఆయన అన్నారు. కామేపల్లికి చెందిన తక్కెళ్లపాటి పద్మ అనే మహిళ వైజాగ్‌లో నివాసముంటున్న కూతురు, అల్లుడు వద్ద ఉంటున్నారు.

ఇటీవల ఆమె జరుగుమల్లి మండలం కాÐమేపల్లి వచ్చారు. నాలుగు రోజులు ఉండి ఆమె కూతురు వద్దకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఒంగోలు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆమెకు రైలు రావడం ఆలస్యమవుతుందని తెలిసింది. సాయంత్రం 7.46 గంటలకు రావాల్సిన రైలు 4 గంటలు ఆలస్యంగా రాత్రి 11.30కి వచ్చింది. దీంతో అలసిపోయిన ఆమె రైలు ఎక్కగానే నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు శుక్రవారం సాయంత్రం యశ్వంత్‌పూర్‌ రైలు పట్టాలు తప్పిందని, వందల మంది అశువులుబాశారని తెలిసి గుండెల్లో రాయి పడ్డట్టయిందన్నారు పద్మ. టీవీలో యాక్సిడెంట్‌ దృశ్యాలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోతోందని వాపోయారు.

అప్పటి వరకు తమతో కలసి ప్రయాణించిన వారిలో చాలా మంది మృత్యువాత పడడం జీరి్ణంచుకోలేకపోతున్నామన్నారు. నాగులప్పలపాడు మండలం టి.అగ్రహారానికి చెందిన జాగర్లమూడి వెంకటేశ్వర్లు వైజాగ్‌లో ఓ వివాహానికి హాజరయ్యేందుకు భార్య అమ్మనితో కలిసి యశ్వంతపూర్‌ రైలులో బయలుదేరి వెళ్లారు. ఒడిషాలో రైలు ప్రమాదం జరిగినట్లు తెలిసి ఖిన్నుడయ్యారు. స్వగ్రామం నుంచి బంధువులు, స్నేహితులు ఫోన్లు చేస్తున్నారని, అయితే తాము సురక్షితంగా ఉన్నామని తెలియజేశామని చెప్పారు.  

నిర్మానుష్యంగా ఒంగోలు రైల్వేస్టేషన్‌... 
ఒడిషా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో ఒంగోలు మీద నుంచి హౌరా వైపు వెళ్లే రైళ్లన్నీ రద్దయ్యాయి. ప్రయాణికులు వారి ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రతిరోజు ఒంగోలు నుంచి సుమారు వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఢిల్లీ, ఒడిషా, పశి్చమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, జమ్ము కశీ్మర్‌తో పాటుగా మొత్తం పది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రైలు సౌకర్యం ఉంది. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.

ఎప్పుడు చూసినా ప్రయాణికులతో రద్దీగా కనిపించే ఒంగోలు రైల్వేస్టేషన్‌ నిర్మానుష్యంగా కనిపించింది. ఇదిలా ఉండగా షాలీమార్‌ నుంచి చెన్నై బయలుదేరిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఒంగోలుకు చెందిన ఇద్దరు ప్రయాణికులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటి దాకా రైల్వే పోలీసులకుగానీ, రైల్వే అధికారులకుగానీ ఎలాంటి సమాచారం లేదు. ఒంగోలులో కోరమాండల్‌ రైలుకు స్టాపింగ్‌ లేదని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఒంగోలు రైల్వేస్టేషన్‌తో పాటు గిద్దలూరు, యర్రగొండపాలెం, ఇంకా పలు రైల్వేస్టేషన్లలో అధికారులు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement