సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం కొత్తగా అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ లైన్లు ఏర్పాటు కానున్నాయి. కర్ణాటకతో పాటు ఏపీలోని మూడు సోలార్ ఎనర్జీ జోన్లలో ఈ లైన్లు ఏర్పాటు చేసేందుకు త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలుకానుంది. బీదర్‌లోని సోలార్ ఎనర్జీ జోన్ 2.5 గిగావాట్లు, అనంతపురంలో 2.5 గిగావాట్లు, కర్నూలులోని సోలార్ ఎనర్జీ జోన్‌లో 1 గిగావాట్ సామర్థ్యంతో.. మొత్తం 6 గిగావాట్ల సామర్థ్యం గల లైన్ల నిర్మాణం చేపట్టాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన నేషనల్ కమిటీ ఆన్ ట్రాన్స్‌మిషన్ (ఎన్‌సీటీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
రాష్ట్రంలో విండ్, సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టుల స్థాపన ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 29 ప్రాంతాల్లో 33,240 వేల మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్ట్‌లను నెలకొల్పడానికి ప్రణాళిక సిద్ధమైంది. మరో 10 వేల మినీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఇటీవల గుర్తించింది. మొత్తంగా 44,240 మెగావాట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది.
వీటి కోసం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని 1.45 లక్షల ఎకరాల భూమితో టెక్నో కమర్షియల్ ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించింది. పెట్టుబడులు, పరికరాల తయారీ సౌకర్యాల ప్రాజెక్ట్ డెవలపర్ల కోసం సుమారు 5 లక్షల ఎకరాలను లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం భూమిని సమకూరుస్తోంది.
తొలి దశలో వైఎస్సార్ జిల్లా గండికోట, అనంతపురం జిల్లా చిత్రావతి, నెల్లూరు జిల్లా సోమశిల, కర్నూలు జిల్లా ఓక్ రిజర్వాయర్, విజయనగరం జిల్లా కురుకూటి, కర్రివలస విశాఖపట్నం జిల్లా ఎర్రవరంలో 6,600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ఏడు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు.
వీటి నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ పంపిణీకి ఏపీ ట్రాన్స్‌కోకు సంబంధించిన 400 కేవీ సబ్ స్టేషన్లతో లైన్లను అనుసంధానం చేయనున్నారు. ఆరు జిల్లాల్లో 361.86 కిలోమీటర్ల విద్యుత్ లైన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఎగుమతి
సోలార్ పవర్ పాలసీలో భాగంగా రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో కనీసం 5 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. సోలార్ పార్కులను అభివృద్ధి చేయడం, ఉత్పత్తిని ప్రోత్సహించడం, సౌరశక్తితో నడిచే వ్యవసాయ పంపుసెట్‌లను తీసుకురావడం, స్థానిక తయారీ సౌకర్యాలను ప్రోత్సహించడం వంటివి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడం ద్వారా రాష్ట్రంలో ఇంధన రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా ఆదాయాన్ని సృష్టించడం, స్థానిక ఉపాధిని కల్పించడం, రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధిని పెంచడం వంటి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ట్రాన్స్‌మిషన్ లైన్ల ఏర్పాటుతో పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వీలు కలుగుతుంది. అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపునివ్వడంతో ఆ మేరకు కూడా రాష్ట్రానికి ప్రయోజనం చేకూరనుంది.
సౌర విద్యుత్‌కు ట్రాన్స్‌మిషన్ లైన్లు
Published Tue, Dec 27 2022 6:30 AM | Last Updated on Tue, Dec 27 2022 7:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment