సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తుల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రెండు నెలల కాలంలో 5 చిరుతలను పట్టుకున్నామని తెలిపారు. నడక దారిలో ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. విమర్శలకు భయపడమని, చిత్తశుద్ధితో భక్తులకు సేవ చేస్తున్నామని పేర్కొన్నారు. చిరుత చిక్కుకున్న ప్రదేశానికి టీటీడీ చైర్మన్ భూమన చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ చిరుత కొనసాతుందని పేర్కొన్నారు. రాత్రి పన్నెండు.. ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందని, తెలిపారు.
ప్రయాణికుల భద్రత విషయంలో భక్తుల క్షేమం విషయంలో, వారి సౌలభ్యం కోసం టీటీడీ ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని భూమన అన్నారు. అటవీశాఖ అధికారుల సహకారంతో వారి నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని, ఈ కారణంగానే నేడు అయిదో చిరుతను పట్టుకున్నట్లు చెప్పారుజ నడక దారిలో వస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించాలని, వారితో పాటు తోడుగా సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు.
చదవండి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో చుక్కెదురు
భక్తులలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం వారికి చేతి కర్రలు కూడా ఇవ్వడం జరుగుతోందన్నారు. కర్రలు ఇస్తామని ప్రకటించగానే దానిమీద ఇష్టం వచ్చినట్టుగా తమ ఎన్నో అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని విమర్శించారు. కర్రలు ఇస్తామని చెప్పిన తర్వాత నాలుగు చిరుతలు దొరికాయని, అంతకు ముందు ఒక చిరుత బోనులో చిక్కిందని గుర్తు చేశారు.
భక్తుల భద్రత విషయంలో టీటీడీ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో తెలియజేసేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే అని చైర్మన్ పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారి అధికారుల పర్యవేక్షణలో రెండు మూడు వందల మంది సిబ్బంది అధునాతన బోనులతో ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారని తెలిపారు. విమర్శలకు, జడిసి.. ఆపరేషన్ చిరుతను ఆపేసే ప్రసక్తి లేదని విమర్శకులను హెచ్చరించారు.
కాగా తిరుమలలో కాలిబాటన వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ, అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా మరో చిరుతపులిని బంధించారు అధికారులు. తిరుమల ఘాట్ రోడ్డు నరసింహ స్వామి ఆలయం ఏడవ మైలు మధ్య అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. వేకువజామున 12 నుంచి 1 గంట మధ్యలో బోన్‌లో చిక్కుకున్నట్లు అటవీశాఖ అధికారుల చెప్పారు. గత వారం రోజులుగా ఈ చిరుత సంచారం గుర్తించిన అధికారులు పట్టుకోవడానికి బోన్ పెట్టగా.. నేడు చిక్కుకుంది. దానిని ఎస్వీ జూపార్క్ తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment