సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బడ్జెట్‌ను ఇకపై కాగ్ ద్వారా ఆడిట్ చేయాలని పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. మరింత పారదర్శక పాలన అందించే దిశగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాలకమండలి ఆగస్ట్ 28న నిర్ణయం తీసుకోగా, తాజాగా ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపింది. టీటీడీలో ప్రతి సంవత్సరం అంతర్గత ఆడిటింగ్‌తో పాటు ప్రభుత్వం ద్వారా ఎక్స్‌టర్నల్ ఆడిటింగ్ నిర్వహించే విధానం కొనసాగుతోంది. టీటీడీ ఆదాయ, వ్యయాలపై తరచూ ఆరోపణలు వస్తుండటం, సామాజిక మాధ్యమాల్లో కొంతమంది దురుద్దేశంతో బురద జల్లే ప్రయత్నం చేస్తుండటంతో, ఇలాంటి దుష్ప్రచారాలకు చెక్ పెట్టే విధంగా టీటీడీ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది.
మరో వైపు ఇది వరకే టీటీడీలో కాగ్ ద్వారా ఆడిటింగ్ జరిపించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో పాలకమండలి కూడా ఈ అంశంపై తాజాగా జరిగిన సమావేశంలో చర్చించింది. శ్రీవారికి కానుకలు సమర్పించే భక్తులు, విరాళాలు అందించే దాతలకు భరోసా కల్పించేలా కాగ్ ద్వారా ఆడిటింగ్ జరిపించాలని తాజాగా ప్రభుత్వాన్ని కోరింది. 2020–21 సంవత్సరం నుంచే ఈ ప్రక్రియని ప్రారంభించాలని, సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో కోరిన మేరకు 2014–15 నుంచి 2019–20 వరకు కాగ్ ద్వారా ప్రత్యేకంగా ఆడిట్ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతూ పాలక మండలి తీర్మానం చేసింది. ఇదే అంశాన్ని హైకోర్టుకి తెలియపర్చాలని అధికారులనూ ఆదేశించింది. అయితే, ఇది వరకే ఈ అంశంపై న్యాయస్థానంలో కేసు నడుస్తున్న కారణంగా అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, సముచిత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీటీడీ అధికార వర్గాలు భావిస్తున్నాయి.
కాగ్ ద్వారా టీటీడీ ఆడిటింగ్..!
Published Fri, Sep 4 2020 8:16 AM | Last Updated on Fri, Sep 4 2020 8:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment