![TTD EO Dharma Reddy On Harinama Sankeerthana at Tirumala - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/10/eo-dharmareddy.jpg.webp?itok=Xq13AZlM)
ఈవో ధర్మారెడ్డి
తిరుమల: కరోనా నేపథ్యంలో తిరుమలలో కొంతకాలం పాటు నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం ఆగస్ట్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో ఏపీ ధర్మారెడ్డి చెప్పారు. శనివారం తిరుమల అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతేడాది అక్టోబర్‌లో తిరుపతిలో ప్రారంభమైన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఇప్పటివరకు 490 ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగినట్లు చెప్పారు.
అక్కడ ఇటీవల 7 రోజుల పసికందుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు. రెండేళ్లలో శ్రీ పద్మావతి పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తోన్న రైతులు తిరుపతిలోని గోశాలను సంప్రదిస్తే వారికి గోవులు, ఎద్దులను ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జూన్‌లో శ్రీవారిని 23.23 లక్షల మంది దర్శించుకుని, రూ.123.74 కోట్లను హుండీలో వేసినట్లు ఈవో చెప్పారు.
12న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ఈ నెల 17న ఆణివార అస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 12న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 11న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment