తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కళాశాల
సాక్షి, తిరుపతి: నెల్లూరు ఆనందయ్య మందు తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిశోధనను ముమ్మరం చేసింది. అందులో భాగంగా శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల హెచ్‌వోడీలు, పీజీ విద్యార్థులతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ శాస్త్రీయ అధ్యయనం చేసిన అనంతరం కరోనా నివారణకు మందును తయారు చేసేందుకు టీటీడీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనాకు ఇచ్చిన ఆయుర్వేద మందును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్, ఆయుష్ అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఆ మందు ఎటువంటి హానికర పదార్థం కాదని స్పష్టత వచ్చింది. కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్, ఆయుష్‌శాఖల పరిశీలన తర్వాత ఆనందయ్య మందుకు అనుమతి వస్తే టీటీడీ ఆధ్వర్యంలోని ఆయుర్వేద ఫార్మసీలోనే ఈ ఔషధం తయారు చేయిస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయుర్వేద నిపుణులతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి కృష్ణపట్నం వెళ్లి ఈ ఔషధాన్ని పరిశీలించారు. ఈ మందు ద్వారా కరోనా నివారణ అయితే ప్రజలందరికీ ప్రభుత్వ సహకారంతో టీటీడీతో ఉత్పత్తి చేయించి పంచే ఏర్పాట్లు చేస్తామని చెవిరెడ్డి పేర్కొన్నారు. ఇందుకోసం టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలో రంగం సిద్దం చేస్తున్నారు.
శాస్త్రీయ అధ్యయనంలో టీటీడీ కమిటీ
ఆనందయ్య తయారు చేసిన మందును అనేకమంది కరోనా బాధితులకు పంపిణీ చేశారు. వారి నుంచి వివరాలు సేకరించి, ఆ మందులో కరోనాను నివారించే గుణాలు ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు టీటీడీ చైర్మన్, ఈవోల ఆదేశాల మేరకు టీటీడీ ఆయుర్వేద వైద్యకళాశాల హెచ్‌వోడీలతో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ రేణుదీక్షిత్ పర్యవేక్షణలో ఆయుర్వేద వైద్యులు శ్రీదుర్గ, లక్ష్మణప్రసాద్, శ్రీనివాస్‌కుమార్, ఇన్‌చార్జ్ హెచ్‌వోడీలు రాగమాల, గోపాలకృష్ణలను కమిటీలో నియమించారు. వీరితోపాటు పీజీ విద్యార్థులు సుమారు 50 మంది ఈ అధ్యయనంలో పాల్గొంటున్నారు. విజయవాడకు చెందిన కొందరు ఆయుర్వేద వైద్యులు కూడా ఈ పరిశోధనలో భాగస్వాములయ్యారు. ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారికి ఈ మందు పనిచేసిందా? లేదా? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఈ మందు తీసుకున్నాక రానున్న రోజుల్లో ఎలా పనిచేయనుంది? అనే వివరాలు సేకరిస్తున్నారు. వివరాలన్నీ సేకరించాక.. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్‌ఏఎస్)కు నివేదిక పంపనున్నారు.
కంట్లో డ్రాప్స్ వేయడం ఆయుర్వేదంలో ఓ ప్రక్రియ
ఆయుష్ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాం. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకున్న వారి రిపోర్ట్ తయారు చేస్తున్నాం. కంట్లో డ్రాప్స్ వేయడం ఆయుర్వేదంలో ఓ ప్రక్రియ. కంటి ద్వారా వేసిన మందు త్వరగా శరీరంలోకి చేరుతుంది. ఐసీఎంఆర్‌కు, ఆయుర్వేదానికి సంబంధం లేదు. కేంద్రంలో సీసీఆర్‌ఏఎస్ ఉంది. వారి అనుమతి తీసుకోవాలి.
– డాక్టర్ రేణుదీక్షిత్, టీటీడీ కమిటీ పర్యవేక్షకురాలు
Comments
Please login to add a commentAdd a comment