సాక్షి, అమరావతి : అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో అప్పటి అదనపు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని దర్యాప్తు అధికారి టీవీవీ ప్రతాప్ కుమార్ హైకోర్టుకు నివేదించారు. పోలీసులకు అందిన ఫిర్యాదులోని అంశాలు విచారణార్హమైన నేరానికి సంబంధించినవైతే, తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తీరాల్సిందేనని చెప్పారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పాటు, దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి గత ఏడాది మార్చి 23న రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి శ్రీనివాస్ గత ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అయితే దమ్మాలపాటి కోరిన ఉత్తర్వులే కాకుండా ఏకంగా దర్యాప్తుతో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి (మీడియాను కూడా నియంత్రిస్తూ గ్యాగ్ ఆదేశాలు) ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నాలుగు వారాల్లో కేసు తేల్చాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, ఈ నెల 5 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఏసీబీ, తదితరులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఏసీబీ తరఫున దర్యాప్తు అధికారి టీవీవీ ప్రతాప్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు.
దర్యాప్తు జరగాల్సిందే..
సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్ట నిబంధనలకు అనుగుణంగా సదుద్దేశంతోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని కౌంటర్‌లో వివరించారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన రోజునే దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించిందని, అధికరణ 226, సీఆర్‌పీసీ 482 కింద ఉన్న అధికారాలను, దర్యాప్తును హైకోర్టు అడ్డుకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు పలు తీర్పుల ద్వారా చెప్పిందన్నారు. 2014 జూలైలోనే ఎక్కడ రాజధాని రానుందో ప్రజలందరికీ తెలుసున్న వాదన వాస్తవం కాదని, 2014 డిసెంబర్ వరకు రాజధాని ఖరారు కాలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘అమరావతి భూముల అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయడం అన్నది ప్రభుత్వం పాలనాపరంగా తీసుకున్న నిర్ణయం. దానికీ ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఎలాంటి సంబంధం లేదు. ఆస్తి కొనుగోలు చేసే హక్కుకు, చట్ట వ్యతిరేకంగా ఆస్తిని సమీకరించడానికి చాలా తేడా ఉంది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అనేక అంశాలపై దర్యాప్తు జరగాల్సి ఉంది. అందువల్ల దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలి’ అని కోర్టును కోరారు.
ఎఫ్‌ఐఆర్ వెనుక దురుద్దేశాలు లేవు
Published Sun, Aug 8 2021 2:54 AM | Last Updated on Sun, Aug 8 2021 2:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment