ఆ కేసు న్యాయస్థానం ముందు విచారణలో ఉంది
ఏకంగా ట్రయల్ కూడా నిర్వహించేస్తున్నారు
తీర్పులు కూడా ఇచ్చేస్తూ ప్రజలను ప్రభావితం చేస్తున్నారు
ఘటన వెనుక ఎవరున్నారో తేల్చాల్సింది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలే
ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని నిలదీసిన హైకోర్టు
రాధాకృష్ణ, శ్రీనివాస్‌పై విచారణ ప్రొసీడింగ్స్ నిలుపుదల
తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉండగా, ఆ కేసు గురించిన కథనాలు ఎలా ప్రచురిస్తారని ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని హైకోర్టు నిలదీసింది. కథనాలే కాకుండా ఏకంగా ట్రయల్ నిర్వహించి, తీర్పులు కూడా ఇచ్చేస్తూ ప్రజలను, కేసును ప్రభావితం చేస్తున్నారని తీవ్రంగా మండిపడింది.
ఘటన జరిగినట్లు రాస్తే సరిపోతుందని, దానికి కారకులు, ఎవరిది తప్పు వంటి వివరాలేవీ ప్రచురించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఇవన్నీ చేయాల్సింది దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలేనని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్రిమినల్ కేసు చెల్లదని, దీనిపై తాము ఓ నిర్ణయం తీసుకుని కోర్టుకు తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అప్పటివరకు క్రిమినల్ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేయవచ్చని తెలిపింది.
దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై గుంటూరు కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ ఆరు వారాల పాటు నిలిపివేసింది. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె. శ్రీనివాస్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనం
వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్న ఓ వ్యక్తిని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్‌రెడ్డి తన కారులో కడప నుంచి తాడేపల్లి తీసుకొచ్చారంటూ ఆంధ్రజ్యోతి గత ఏడాది ఓ తప్పుడు కథనం ప్రచురించింది. ఈ కథనం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు కోర్టులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఎడిటర్ కె. శ్రీనివాస్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. గుంటూరు కోర్టు వారిద్దరినీ వ్యక్తిగత హాజరుకు ఆదేశించింది.
ఈ కేసును కొట్టేయాలని, తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ రాధాకృష్ణ, శ్రీనివాస్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ చక్రవర్తి మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రజ్యోతి కథనం గురించి, ఏ సెక్షన్ల కింద కేసు దాఖలు చేశారో వివరించారు.
ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. కోర్టు ముందు విచారణలో ఉన్న కేసు గురించి ఎలా కథనాలు ప్రచురిస్తారని, ట్రయల్ కూడా నిర్వహించి తీర్పులిచ్చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఘటన గురించి మాత్రమే రాశామని సుబ్బారావు చెప్పగా.. ‘ఘటన అంటే ఏమిటి? ఓ వ్యక్తి గాయపడితే గాయపడ్డాడు అని రాయాలి. అంతే తప్ప ఆ వ్యక్తిని ఎవరు గాయపరిచారు, దాని వెనుక ఎవరున్నారు, అంతిమంగా తప్పు ఎవరిది వంటి విషయాల గురించి చెప్పాల్సింది మీరు కాదు. దర్యాప్తు అధికారులు, న్యాయస్థానాలే’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇవన సాంబశివ ప్రతాప్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తనను తాను బాధితునిగా పేర్కొంటూ దాఖలు చేసిన ఈ క్రిమినల్ కేసు చెల్లదన్నారు. ఇది కేకే మిశ్రా కేసులో సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment