హైకోర్టుకు విశాఖ ఉక్కు యాజమాన్యం నివేదన.. ఇప్పటికే బిడ్డర్లు కొంత మొత్తం చెల్లించారు
స్టేటస్ కో వల్ల విక్రయాల ప్రక్రియ ఆగిపోయింది.. ఉత్తర్వులు సవరించాలని అభ్యర్థన
కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లు, కేంద్రానికి కోర్టు ఆదేశం
విచారణ వచ్చే వారానికి వాయిదా
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మడం లేదు
మా పెట్టుబడులను మాత్రమే ఉపసంహరిస్తున్నామన్న కేంద్రం
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన భూములు, ఇతర ఆస్తుల విక్రయాల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవరించాలని విశాఖ ఉక్కు యాజమాన్యం (ఆర్‌ఐఎన్‌ఎల్) మంగళవారం హైకోర్టును కోరింది. స్టీల్ ప్లాంట్ ఆర్థిక అవసరాల నిమిత్తం సొంత ఆస్తులను విక్రయించుకునే హక్కు తమకు ఉందని, స్టేటస్ కో ఉత్తర్వుల వల్ల విక్రయాల ప్రక్రియ నిలిచిపోయిందని ఆర్‌ఐఎన్‌ఎల్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ నివేదించారు.
విశాఖ ఉక్కు కర్మాగారం కోసం తాము సొంతంగా ఏపీఐఐసీ, హౌసింగ్ బోర్డు నుంచి భూములు కొన్నామని, కేంద్ర ప్రభుత్వం కూడా భూ సేకరణ ద్వారా పెద్ద మొత్తంలో భూములు సేకరించిందని తెలిపారు. కేంద్రం సేకరించిన భూముల జోలికి తాము వెళ్లడం లేదని, తాము కొనుగోలు చేసిన 24.99 ఎకరాల భూమినే అమ్ముకుంటున్నామని పేర్కొన్నారు.
భూముల విక్రయానికి వేలం ప్రక్రియ కూడా మొదలైందని, 170 మంది బిడ్డర్లు పాల్గొనగా 72 మందిని హెచ్–1 బిడ్డర్లుగా ప్రకటించినట్లు చెప్పారు. హెచ్–1 బిడ్డర్ల నుంచి రూ.243 కోట్లు రావాల్సి ఉండగా, రూ.45 కోట్లు ఇప్పటికే జమ చేశారన్నారు. స్టేటస్ కో ఉత్తర్వుల వల్ల మిగిలిన మొత్తాన్ని జమ చేయకుండా నిలిపివేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు.
స్టేటస్ కో ఉత్తర్వుల విషయంలో స్పష్టత కోసం హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు. అనుబంధ పిటిషన్‌లో కోరిన విధంగా స్టేటస్ కో ఉత్తర్వులను సవరించడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదన్నారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వుల సవరణ కోసం ఆర్‌ఐఎన్‌ఎల్ అనుబంధ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాలని పిటిషనర్లందరినీ ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాదరావు, జస్టిస్ జగడం సుమతి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రైవేటీకరణపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు..
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాజీ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు సువర్ణరాజు అనే వ్యక్తి కూడా వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
అమ్మకం కాదు.. పెట్టుబడుల ఉపసంహరణ
కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) బి.నరసింహశర్మ వాదనలు వినిపించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం భూ సేకరణ ద్వారా 21 వేల ఎకరాలు సేకరించామన్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయన్నారు. మిగిలిన భూములు ఆర్ఐఎన్ఎల్కే చెందుతాయన్నారు.
అసలు తాము విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మడం లేదని, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 100 శాతం పెట్టుబడులను ఉపసంహరిస్తున్నామని తెలిపారు. ఇదే రీతిలో దేశవ్యాప్తంగా 8 యూనిట్లల్లో పెట్టుబడులను ఉపసంహరిస్తున్నామన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్ ఆస్తులతో తమకు సంబంధం లేదన్నారు. వాళ్ల ఆస్తులను వాళ్లు అమ్ముకోవచ్చునన్నారు.
Comments
Please login to add a commentAdd a comment