గ్యాగ్‌ ఉత్తర్వుల సవరణకు హైకోర్టు నో | AP High Court says no to amend gag orders | Sakshi
Sakshi News home page

గ్యాగ్‌ ఉత్తర్వుల సవరణకు హైకోర్టు నో

Published Sat, Oct 17 2020 4:48 AM | Last Updated on Sat, Oct 17 2020 4:48 AM

AP High Court says no to amend gag orders - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం కేసులో నిందితుడు, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ దాఖలు చేసిన వ్యాజ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ భూబాగోతానికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను ప్రచురణ, ప్రసారం చేయవద్దని మీడియాను నియంత్రిస్తూ జారీచేసిన గ్యాగ్‌ ఉత్తర్వులను సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. దమ్మాలపాటి వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలన్న న్యాయవాది మమతారాణి అభ్యర్థననూ తోసిపుచ్చింది. ఇంప్లీడ్, గ్యాగ్‌ ఆర్డర్‌ సవరణకు మమతారాణి దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై సానుకూల ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా నిరాకరించింది.

ఈ సందర్భంగా.. ఇటీవల సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ఫిర్యాదును, అమరావతి భూకుంభకోణంలో తామిచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌ను పోలుస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి పలు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం పెట్టిన మీడియా సమావేశంవల్ల తామిచ్చిన గ్యాగ్‌ ఉత్తర్వులు నిష్ప్రయోజనమయ్యాయని వ్యాఖ్యానించారు. ఆ సమావేశంలో అమరావతి భూకుంభకోణం ఎఫ్‌ఐఆర్, ఇతర డాక్యుమెంట్లు, సీఎం రాసిన లేఖను ప్రతీ ఒక్కరికీ ఇచ్చారని సీజే తెలిపారు. దీంతో తామిచ్చిన గ్యాగ్‌ ఆర్డర్‌ను సవరించాల్సిన అవసరంలేదని సీజే తేల్చిచెప్పారు. 

దమ్మాలపాటి పిటిషన్‌ అత్యవసర విచారణకు ‘నో’
మరోవైపు.. గ్యాగ్‌ ఆర్డర్‌ ఇచ్చినా కూడా ఫేస్‌బుక్‌లో అమరావతి కుంభకోణానికి సంబంధించి ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలు వ్యాప్తి అవుతూనే ఉన్నాయని, వాటిని తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ దమ్మాలపాటి శ్రీనివాస్‌ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై అత్యవసర విచారణకు సీజే నిరాకరించారు. అత్యవసరమైతే రిజిస్ట్రార్‌ ముందు ప్రస్తావించాలని దమ్మాలపాటి న్యాయవాది ప్రణతికి సీజే సూచించారు. ఇకపై ఈ వ్యాజ్యం రోస్టర్‌ ప్రకారం సంబంధిత బెంచ్‌ ముందుకు వస్తుందని ఆయన తెలిపారు. 

అజేయ కల్లం వివరాలకు, గ్యాగ్‌ ఉత్తర్వులకు సంబంధంలేదు
న్యాయవాది మమతారాణి వ్యాజ్యాలకు దమ్మాలపాటి కౌంటర్లు దాఖలు చేయగా మమతారాణి వాటికి రీజాయిండర్‌ ఇవ్వాల్సి ఉంది. ఈ దశలో వీటిపై విచారణ జరిపిన సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి.. అజేయ కల్లం మీడియా సమావేశానికి, ఈ కేసుకు ముడిపెడుతూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్‌ స్పందిస్తూ.. అజేయ కల్లం చెప్పిన వివరాలకు, మీడియా గ్యాగ్‌ ఉత్తర్వులకు సంబంధంలేదన్నారు. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను ఆయన బహిర్గతం చేయలేదని వివరించారు. అయితే, సీజే మాత్రం ఈ వాదనలతో ఏకీభవించలేదు. మమతారాణి ఇంప్లీడ్‌కు, గ్యాగ్‌ ఆర్డర్‌ సవరణకు సీజే విముఖత వ్యక్తంచేస్తూ ఆ మేర ఉత్తర్వులిచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement