సాక్షి, ఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 2 లక్షల 46 వేల 519 కోట్ల రూపాయలు వసూలైనట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2020-21లో ఇదే కాలంలో ప్రత్యక్ష పన్నుల రూపంలో వసూలైన మొత్తం 1 లక్ష 17 వేల 783 కోట్లు అని తెలిపారు.
ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, పన్ను చెల్లింపుదారుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ముందస్తు పన్ను చెల్లింపులు అత్యధికంగా ఉండటంతో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు గణనీయంగా పెరగడానికి కారణాలుగా మంత్రి విశ్లేషించారు. రెండో త్రైమాసికం ఇప్పుడే మొదలైనందున ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఏమేరకు వసూలు కాగలవో అంచనా వేయలేమని మంత్రి అన్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరోక్ష పన్నుల (జీఎస్టీ-నాన్ జీఎస్టీ కలిపి) ద్వారా 3 లక్షల 11 వేల 398 కోట్ల రూపాయలు వసూలైనట్లు మంత్రి చెప్పారు.
వివాద్-సే-విశ్వాస్ పథకం కింద ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వివాదాలను గణనీయమైన సంఖ్యలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి చెప్పారు. ఈ పథకం కింద స్వీకరించిన డిక్లరేషన్లు 28.73 శాతం పెండింగ్ టాక్స్ వివాదాలున్నట్లు తెలిపారు. ఈ విధంగా పరిష్కారానికి నోచుకునే వివాదాల ద్వారా ప్రభుత్వానికి కూడా అదనంగా పన్ను ఆదాయం సమకూరుతుందని అన్నారు. ఈ ఏడాది త్రైమాసికంలో గణనీయమైన మొత్తాల్లో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్ళు ఆర్థిక రంగం తిరిగి దారిన పడుతోందని చెప్పడానికి నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. పన్నుల వసూళ్ళు పెరిగితే దానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలపై పెట్టే ఖర్చు కూడా పెరుగుతుంది తద్వారా జాతీయ స్థూల ఉత్పత్తిని అది ప్రభావితం చేస్తుందని మంత్రి తెలిపారు.
ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జవాబు..
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్)లో భాగంగా కంపెనీలు స్థానికంగానే సామాజిక కార్యకలాపాలను నిర్వహించే విధంగా నిబంధనలను మారుస్తూ కంపెనీల చట్టాన్ని సవరించినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ మంగళవారం రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. సీఎస్‌ఆర్ ప్రాజెక్ట్‌ల అమలులో స్థానిక ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నది కేవలం మార్గదర్శకం మాత్రమే అని చెప్పారు.
సవరించిన కంపెనీల చట్టంలో పొందుపరచిన నియమ నిబంధనల ప్రకారం కంపెనీలు సీఎస్ఐర్ కార్యకలాపాల కింద చేపట్టే ప్రాజెక్ట్‌ల విషయంలో జాతీయ ప్రాధాన్యతలు, స్థానిక ప్రాంత ప్రాధాన్యతల మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఈ చట్టం కింద సీఎస్‌ఐర్ కార్యకలాపాల్లో కంపెనీ బోర్డుదే తుది నిర్ణయం అవుతుంది. సీఎస్‌ఆర్ కార్యకలాపాల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ వంటివి సీఎస్‌ఐర్ కమిటీ సిఫార్సుల మేరకు ఉంటుందని అన్నారు. ఫలానా కార్యకలాపాలకు ఇంత మొత్తం ఖర్చు చేయాలని ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment