సాక్షి ప్రతినిధి, కాకినాడ: సగటు మనిషి ఆయుర్దాయం నూరేళ్లుగా లెక్క కడుతూంటారు. ఇందులో సగం అంటే 50 ఏళ్లు వచ్చేసరికి సాధారణంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూంటాయి. అలా వచ్చే కొన్ని సమస్యలను కంటికి రెప్పలా చూసుకునే కన్న పిల్లలకు కూడా చెప్పుకోలేక కొంతమంది లోలోపలే కుమిలిపోతున్నారు.
ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన 60 నుంచి 70 శాతం మందిలో హఠాత్తుగా చుక్కలు చుక్కలుగా యూరిన్ (మూత్రం) రావడం సమస్యగా ఉంటోంది. దీనిని వైద్య పరిభాషలో ‘స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్’ అని పిలుస్తుంటారు. దీనికి వయోభారంతో వచ్చే కండరాల బలహీనత ప్రధాన కారణమని యూరాలజీ నిపుణులు చెబుతున్నారు.
50 ఏళ్ల వయస్సు పైబడిన ప్రతి 10 మందిలో ఒకప్పుడు ఇద్దరు, ముగ్గురు ఈ సమస్యతో బాధ పడేవారని, ఇప్పుడు ఆ సంఖ్య ఐదు నుంచి ఆరు ఉంటోందని యూరాలజీ వైద్యులు అంటున్నారు. కొంతమంది ఈ సమస్యను ఎవ్వరికీ చెప్పలేక.. ముందు జాగ్రత్తలు తీసుకోలేక కేన్సర్ బారిన పడుతూ ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారని అంటున్నారు.
మహిళల్లో అధికం
స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్ పురుషుల్లో కంటే నాలుగు పదులు దాటిన మహిళల్లో ఎక్కువని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. పెల్విక్ కండరాల బలహీనత, ఈస్ట్రోజన్ హార్మోన్ స్రావంలో లోపాలు లైంగిక సామర్థ్యాన్ని దెబ్బ తీసి కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. అసాధారణ పరిస్థితుల్లో మూడు పదుల వయసు దాటిన వారిని కూడా ఈ సమస్య వెంటాడుతోంది. రుతుస్రావం నిలిచిపోయే పరిస్థితిలో ఏర్పడే పోస్ట్ మెనోపాజల్ దశలో స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్, వెజైనల్ డ్రైనెస్ సమస్యలు మొదలవుతాయి.
అధిక కాన్పులు, శస్త్రచికిత్సలు, ప్రొస్టేట్ చికిత్స మహిళల్లో మూత్రం చుక్కలు చుక్కలుగా రావడానికి కారణమవుతున్నాయి. పురుషుల్లో మధుమేహం, శస్త్రచికిత్సలతోనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. తుమ్మినా, దగ్గినా తెలియకుండానే మూత్ర విసర్జన, వెజైనల్ సమస్యలు దీని లక్షణాలుగా చెబుతున్నారు.మూత్రం చుక్కచుక్కలుగా పడుతున్న వారికి కాకినాడ జీజీహెచ్‌లో యూరాలజీ, వెజైనల్ డ్రైనెస్ సమస్యకు గైనకాలజీ ఓపీల్లో సేవలందిస్తున్నారు.
గడచిన ఆరు నెలల వ్యవధిలో ఈ రెండు విభాగాల ఓపీకి ప్రతి నెలా వస్తున్న కేసులను పరిశీలిస్తే రోగుల సంఖ్య పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం వంటి ప్రాంతాల్లో కూడా యూరాలజీ వైద్యుల వద్ద అవుట్ పేషెంట్లు, ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్, వెజైనల్ డ్రైనెస్‌కు అధునాత వైద్య సదుపాయాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా కాకినాడలో అందుబాటులోకి తీసుకువచ్చామని స్థానిక సృజనా ఆస్పత్రి కాస్మెటిక్ గైనకాలజిస్టు డాక్టర్ ఏఎల్ సత్యవతి చెప్పారు. ముంబైకి చెందిన ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు సీజెల్ అజ్మీరా భాగస్వామ్యంతో ఈ సేవలు తీసుకువచ్చారు.
మానసిక సమస్యలు ఉత్పన్నం
స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్ సహా, పెల్విక్ కండరాల బలహీనత, ఈస్ట్రోజన్ అసమతుల్యతలు మానసిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మహిళలు సంసార, సాధారణ జీవితాల్లో ఇబ్బందులు పడుతున్నారు. చెప్పుకోలేని వేదనతో సతమతమవుతూంటారు. తొలి దశలో నిర్వహించే కౌన్సెలింగ్‌లోనే ఈ సమస్యలను ధైర్యంగా వైద్య నిపుణుల వద్ద ప్రస్తావిస్తే తక్షణ పరిష్కారం ఉంటుంది. – డాక్టర్ వానపల్లి వరప్రసాద్, మానసిక వైద్య నిపుణుడు, జీజీహెచ్, కాకినాడ
మందులు అవసరం లేని చికిత్స
అవాంఛిత మూత్రం కేసులు పెరుగుతున్నాయి. స్ట్రెస్ ఇన్‌కంటినెన్స్ సమస్యకు చెమట పట్టని వ్యాయామాలతో పెల్విక్ కండరాల పటిష్టత ద్వారా మందుల అవసరం లేని పరిష్కారం లభిస్తోంది. దీనికి అధునాతన బీటీఎస్ ఎంసెల్లా చైర్‌ను వినియోగిస్తాం.
28 నిమిషాల వ్యవధిలో 11 వేల పెల్విక్ వ్యాయామాలు చేయించడం ఈ యంత్రం ప్రత్యేకత. వీటిని కిగెల్స్ ఎక్సర్‌సైజ్‌లు అంటారు. వెజైనల్ డ్రైనెస్ నివారణకు వెజైనల్ రెజువనేషన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చాం. కుర్చీలో కూర్చోవడం ద్వారా నొప్పి లేని చికిత్స అందిస్తాం. – డాక్టర్ ఏఎల్ సత్యవతి, కాస్మెటిక్ గైనకాలజీ నిపుణురాలు, కాకినాడ
ఆగితే తగ్గదు
మూత్రం లీకేజీ, వెజైనల్ డ్రైనెస్‌లు నానాటికీ అధికమవుతున్న సమస్యలు. ముఖ్యంగా పోస్ట్ మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. తగ్గుతుందిలే అన్న ధీమా ఎంత మాత్రం సరికాదు. దీనివలన సమస్య తగ్గదు సరికదా, మానసిక సమస్యలు ఎక్కువై మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఇది శారీరక అనారోగ్యాలకూ దారి తీస్తుంది. తక్షణమే వైద్యులను సంప్రదించి వైద్యం పొందాలి.
ఈ ఇబ్బందిని చెప్పుకొనేందుకు చాలా మంది మహిళలు ముందుకు రాకపోవడమే అసలు సమస్య. మందులు అవసరం లేని అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. సత్ఫలితాలిస్తున్నాయి. – డాక్టర్ మణికంఠన్ జంధ్యం, అసిస్టెంట్ ప్రొఫెసర్, రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment