సీఎం జగన్‌ పాలనపై యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ ప్రశంసలు | US Consulate General Appreciates CM YS Jagan Mohan Reddy Ruling | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ పాలనపై యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ ప్రశంసలు

Published Tue, Jan 5 2021 9:23 PM | Last Updated on Wed, Jan 6 2021 4:41 AM

US Consulate General Appreciates CM YS Jagan Mohan Reddy Ruling - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మెన్‌

సాక్షి, అమరావతి: విశాఖలో హబ్‌ ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ (హైదరాబాద్‌) జోయల్‌ రీఫ్‌మెన్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన కాన్సులేట్‌ అధికారులు డేవిడ్‌ మోయర్, సీన్‌ రూథ్‌తో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. తాము విశాఖలో పర్యటించామని, అక్కడి వసతులు, సౌకర్యాలు తమకు ఎంతో సంతృప్తి నిచ్చాయని ఈ సందర్భంగా జోయల్‌ రీఫ్‌మెన్‌ ముఖ్యమంత్రికి తెలిపారు. కాన్సులేట్‌ లేని నగరాల్లో దేశంలో ఇప్పటి వరకు ఒక్క అహ్మదాబాద్‌లో మాత్రమే అలాంటి హబ్‌ ఉందని చెప్పారు.
 
ఇంక్యుబేటర్‌ సెంటర్‌ కోసం వినతి 
► విశాఖలో హబ్‌ ఏర్పాటు నిర్ణయాన్ని సీఎం జగన్‌ స్వాగతించారు. స్మార్ట్‌ సిటీగా విశాఖ ఎదగడంలో అమెరికా సహకరించాలని కోరారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో తెలుగు వారు రాణిస్తూ.. ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుండటం సంతోషదాయకం అన్నారు.
► ఢిల్లీలో ఉన్నట్లు విశాఖలోనూ అమెరికా ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి అమెరికా కాన్సుల్‌ జనరల్‌ సానుకూలంగా స్పందించారు. విశాఖలో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
► అమెరికా –ఆంధ్ర మధ్య పరస్పర సహకారం మరింత పెంపొందేలా కాన్సుల్‌ జనరల్‌ చొరవ చూపాలని, ఆ దిశలో తాము కూడా కలిసి నడుస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఆంగ్ల భాష ప్రాధాన్యం గుర్తించామని, అందువల్లే అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు.
► ఢిల్లీలోని ప్రాంతీయ ఆంగ్ల భాషా కార్యాలయం (రెలో) కార్యకలాపాలను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. రాష్ట్రంలో 98 శాతం స్కూళ్లు ఆంగ్లంలో బోధిస్తున్నాయని చెప్పారు. టీచర్లకు ఆంగ్ల భాషలో శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తమతో రెలో కలిసి రావాలని ఆకాంక్షించారు. 

పెట్టుబడులకు అనుకూలం 
► పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అత్యంత అనుకూలమైన రాష్ట్రం అని, విశాలమైన సముద్ర తీర ప్రాంతం అందుకు ఎంతో దోహదకారిగా నిలుస్తోందని సీఎం చెప్పారు. నౌకాశ్రయాల నిర్మాణంతో ఆర్థికాభివృద్ధి, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. 
► అందువల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు కాన్సుల్‌ జనరల్‌ చొరవ చూపాలని, ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని సీఎం వివరించారు. రాష్ట్ర ప్రగతికి అమెరికా సహకరించాలని  కోరారు.

హబ్‌ అంటే..
అమెరికన్‌ కాన్సులేట్లలో హబ్‌ ఉంటుంది. అమెరికాకు సంబంధించిన సకల సమాచారం ఇందులో లభ్యమవుతుంది. ఒకరకంగా ఇది లైబ్రరీ లాంటిది. పుస్తకాలతో పాటు వీడియో, ఆడియో డాక్యుమెంటరీలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా అమెరికాలో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఎవరైనా వెళ్లి సమాచారం తెలుసుకోవచ్చు. కాన్సులేట్లు లేని నగరాల్లో తొలి హబ్‌ అహ్మదాబాద్‌లో మాత్రమే ఉండగా, ఇప్పుడు తాజాగా విశాఖపట్నంలో ఏర్పాటుకు అమెరికా ఆసక్తి చూపిస్తోంది. (చదవండి: సీఎం జగన్‌ను కలిసిన  స్వాత్మానందేంద్ర సరస్వతి)

ప్రభుత్వ పనితీరు భేష్‌
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు, పథకాలు విప్లవాత్మకంగా ఉన్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామ స్థాయికి పరిపాలనను తీసుకెళ్లడం అభినందనీయం. వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల డోర్‌ డెలివరీ అత్యుత్తమ విధానం. దీని వల్ల ఎక్కడా అవినీతికి, దళారి వ్యవస్థకు తావుండదు. అన్ని పథకాల ప్రయోజనాలను ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. సామాజిక తనిఖీ వంటి వాటి ద్వారా పారదర్శక ప్రక్రియ కొనసాగుతోంది. కోవిడ్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పని తీరు, కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ చాలా బావుంది. 
– జోయల్‌ రీఫ్‌మెన్, అమెరికా కాన్సుల్‌ జనరల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement