తిరుమల: భూలోక వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రంలో పది రోజులపాటు జరగనున్న వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం భక్తులకు టీటీడీ సకల ఏర్పాట్లూ పూర్తిచేసింది. సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. \
వైకుంఠ ద్వార దర్శనం పురస్కరించుకుని తిరుమలలో 10 రోజుల ఉత్సవాల గురించి ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సర్వం సిద్ధమయ్యాయి. సోమవారం వేకువజామున ఒంటి గంట 45 నిమిషాల నుంచి ఉత్తర ద్వార దర్శనం ప్రారంభిస్తాం. అనంతరం ఉ.6 గంటల నుంచి సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయి. ఈనెల 11వరకు 10 రోజుల పాటు జరిగే ఈ దర్శనాలు కొనసాగుతాయి.
సామాన్య భక్తులకే ప్రాధాన్యత..
భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో దాదాపు 94 కౌంటర్లను ఏర్పాటుచేసి టికెట్లు జారీచేస్తున్నాం. భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించడం కోసమే ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాం. టికెట్ కలిగిన భక్తులు నిర్దేశిత సమయం ప్రకారం తిరుమలలోని కృష్ణతేజ విశ్రాంతి గృహం వద్ద రిపోర్ట్ చేసుకోవాలి. రెండు లక్షలకు పైగా రూ.300ల ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేశాం. మహాలఘు దర్శనం కోసం రోజూ 2,000 శ్రీవాణి టికెట్లను కూడా మంజూరు చేశాం.
ఏకాదశి, ద్వాదశి రోజుల్లో సిఫారసు లేఖలు రద్దుచేశాం. తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటాం. రెండు మూడు తేదీల్లో కూడా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రముఖులకు మాత్రమే దర్శనం కేటాయిస్తాం. ఇక తిరుమలలో వసతి గృహాలు పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు కూడా తిరుపతిలో ఉండి దర్శనానికి కేటాయించిన సమయం ప్రకారమే తిరుమలకి రావాలి. మూడు లక్షల 50 వేల లడ్డూల బఫర్ స్టాక్ ఉంచాం. అలాగే, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన పేదలు, గిరిజనులకు రోజూ వెయ్యి మందికి దర్శనం చేయిస్తాం.
నిరంతరం అన్నప్రసాదం
ఇక భక్తుల సౌకర్యార్థం అన్నదాన భవనంలో 10 రోజులు పాటు ఉ.6 నుంచి రాత్రి 12 గంటల వరకు భక్తులకు నిరంతరం అన్నప్రసాద వితరణ చేస్తాం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లలో ఇతర ప్రాంతాల్లో వేచి ఉన్న భక్తులకు కూడా టీ, కాఫీ, అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తాం. ఏకాదశి సందర్భంగా రేపటి నుంచి పీఎస్సీ–4లో అన్నప్రసాద వితరణ ప్రారంభిస్తాం. ఇక వైకుంఠ ఏకాదశి రోజున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా రెండువేల మందితో భద్రత కల్పిస్తున్నాం. శ్రీవారి సేవకులు 3,500 మంది కూడా
సేవలందిస్తారు.
మాస్క్ తప్పనిసరి
కోవిడ్ మళ్లీ వ్యాప్తిచెందుతుందన్న భయాందోళన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. తిరుమలలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్తగిరులను దాదా 12టన్నుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాం. ఆలయం వెలుపల వైకుంఠ ద్వారాలతో శ్రీవారి నమూనా ఆలయాన్ని కూడా ఏర్పాటుచేశాం.
Comments
Please login to add a commentAdd a comment