అరెస్ట్‌కు కారణాలను రాతపూర్వకంగా చెప్పాల్సిందే | Vidyasagar petition on remand in Jatwani case dismissed | Sakshi
Sakshi News home page

అరెస్ట్‌కు కారణాలను రాతపూర్వకంగా చెప్పాల్సిందే

Published Tue, Oct 29 2024 5:42 AM | Last Updated on Tue, Oct 29 2024 5:42 AM

Vidyasagar petition on remand in Jatwani case dismissed

రాతపూర్వకంగా తెలిపేందుకు ఏకీకృత విధానాన్ని రూపొందించండి

కేసుకు సంబంధించిన మౌలిక వివరాలను అందులో పొందుపరచండి

రాష్ట్ర డీజీపీకి హైకోర్టు ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయాధికారులకూ ఆదేశాలు

జత్వానీ కేసులో రిమాండ్‌పై విద్యాసాగర్‌ పిటిషన్‌ కొట్టివేత

సాక్షి, అమరావతి: ఏ కేసులో అయినా అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు రాతపూర్వకంగా ఇవ్వాల్సిం­దేనని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో పోలీసులు ఏకీకృత, నిర్ధిష్ట విధానా­న్ని అనుసరించడం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన­ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆ దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్‌కు గల కారణాలను నిందితునికి రాతపూర్వకంగా తెలియ­చేసి తీరాలని పోలీసులను ఆదేశించింది. తద్వారా కస్టోడియల్‌ రిమాండ్‌ నుంచి తనను తాను కాపాడుకుని, బెయిల్‌ కోరేందుకు అవకాశం ఇవ్వాలని తేల్చిచెప్పింది. అలా చేయని పక్షంలో వివాదాస్పద అంశాల్లో వాస్తవాలేమిటన్న విషయం తేలకుండా పోతుందని పేర్కొంది.

అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు రాతపూ­ర్వకంగా తెలియచేసే విషయంలో ఏకీకృత విధా­నా­న్ని రూపొందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. అరెస్ట్‌కు దారి తీసిన కేసుకు సంబంధించిన మౌలిక వివరాలను కూడా అందులో పొందుపరచాలంది. అరెస్ట్‌కు సంబంధించి ఏ కారణాలనైతే నిందితునికి తెలియచేశారో వాటిని రిమాండ్‌ రిపోర్ట్‌తో జత చేయాలని కూడా ఆదేశించింది.

రిమాండ్‌ అధికారాన్ని ఉపయోగించే న్యాయాధి­కారులు, మేజిస్ట్రేట్‌లు, జడ్జీలందరూ అరెస్ట్‌కు గల కారణాలను నిందితులకు తెలియచేయాలన్న రాజ్యాంగంలోని అధికరణ 22(1)లోని ఆదేశాన్ని, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌)లోని సెక్షన్‌ 47(1)ను పోలీసులు అనుసరించారా లేదా అన్న దానిపై తమ సంతృప్తిని రికార్డ్‌ చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. అరెస్టయిన వ్యక్తికి కూడా హక్కులుంటాయని, మానవ హక్కులు కూడా వర్తిస్తాయని తెలిపింది.

విద్యాసాగర్‌ రిమాండ్‌ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోం
సినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో విజయవాడ కోర్టు తనకు రిమాండ్‌ విధించడాన్ని సవాల్‌ చేస్తూ వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. విద్యాసాగర్‌ రిమాండ్‌ విషయంలో విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. విజయవాడ కోర్టు రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టేసేందుకు ఎలాంటి కారణం కనిపించడం లేదంది. ఈ మేరకు న్యాయ­మూర్తి జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి సోమవారం తీర్పు వెలువరించారు. ఈ తీర్పు కాపీని రాష్ట్రంలోని న్యాయాధికారులందరికీ, డీజీపీకి పంపాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించారు.

ఇదే సమయంలో తన అరెస్ట్‌ గురించి, అరెస్ట్‌కు గల కారణాల గురించి తన కుటుంబ సభ్యులకు గానీ, స్నేహితులకు గానీ పోలీసులు తెలియచేయలేదన్న విద్యాసాగర్‌ వాదనను న్యాయ­మూర్తి తన తీర్పులో తోసిపుచ్చారు. అరెస్ట్‌ గురించి, అరెస్ట్‌కుగల కారణాలను పోలీసులు విద్యా­సాగర్‌కు 20.09.2024 ఉదయం 6.30 గంటల సమయంలోనే తెలియచేశారన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో జతచేసిన డాక్యుమెంట్లలో విద్యా­సాగర్‌ అరెస్ట్‌కు సంబంధించిన అరెస్ట్‌ మెమో కూడా ఉందని తెలిపారు. జత్వానీ ఫిర్యాదు మేరకు విద్యాసాగర్‌పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన్ను అరెస్ట్‌ చేశారు. విజయవాడ కోర్టు ఆయనకు రిమాండ్‌ విధించింది. దీనిని సవాల్‌ చేస్తూ విద్యాసాగర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్‌ చక్రవర్తి సోమవారం తీర్పు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement