
వియత్నాం అంబాసిడర్ షాన్‌చౌ ఫామ్ ట్వీట్
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి కాన్వాస్ పై రమణీయ అందాలు..అడుగడుగునా మదిదోచే మనోహర దృశ్యాలు.. చక్కిలిగింతలు పెట్టే సహజ సిద్ధ సోయగాలు.. ఉవ్వెత్తున ఎగసిపడుతూ ఎన్నో ఊసులు చెప్పే సాగరతీర ప్రాంతాలు.. ఇలా..విశాఖ సోయగాల్ని వర్ణించాలంటే అక్షరాలు సరిపోవు.. అందుకే సామాన్యుడి నుంచి సెలబ్రిటీ వరకూ అందరూ విశాఖ అందాలకు ఫిదా అంటున్నారు. వచ్చిన ప్రతిసారీ సరికొత్తగా పరిచయమవుతున్న విశాఖ నగరాన్ని చూసి ‘ఐ లవ్ యూ వైజాగ్’ అంటూ మురిసిపోతున్నారు.
తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన వియత్నాం అంబాసిడర్ షాన్‌చౌ ఫామ్ విశాఖ సిటీ సోయగాలకు ముగ్ధుడయ్యారు. నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆయన వైజాగ్‌ను ఇండియన్ శాన్‌ఫ్రాన్సిస్కోగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. విశాఖను అమెరికాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన శాన్‌ఫ్రాన్సిస్కోతో పోల్చిన ఆయన ట్వీట్‌కు భారీగా రీట్వీట్లు, లైక్‌లు, కామెంట్లు వస్తున్నాయి.