కశింకోట: విశాఖ జిల్లా విసన్నపేట.. సైనికుల గ్రామంగా పేరొందింది. ఇక్కడ దాదాపు ఇంటికో సైనికుడు ఉండటం ప్రత్యేకత. ఒక్కో ఇంట్లో ఇద్దరు నుంచి నలుగురు వరకు ఉన్నారు.. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా భారత్ తరఫున పోరాడిన ఘనత ఇక్కడి సైనికులకు సొంతం. విసన్నపేట జనాభా దాదాపు 1600. సుమారు 400 వరకు కుటుంబాలు ఉండగా.. 200 మంది వరకు ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. సుమారు 70 మంది రిటైర్ అయి పింఛన్ తీసుకుంటున్నారు.
సుమారు వందేళ్ల కిందట నుంచి గ్రామస్తులు రక్షణ రంగంలో విధులు నిర్వర్తిస్తుండటం విశేషం. రెండో ప్రపంచ యుద్ధం, చైనా, పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాల్లో గ్రామ సైనికులు సేవలందించారు. ఆంగ్లేయుల హయాంలో గ్రామానికి చెందిన నడిశెట్టి అప్పన్న, చిదిరెడ్డి కన్నయ్య, నడిశెట్టి చెల్లయ్య, నడిశెట్టి సూర్యనారాయణ తదితరులు సిఫాయి, హవల్దార్, నాయబ్ సుబేదార్ తదితర హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం అధికారి హోదాలో మేజర్ నడిశెట్టి గణేష్ విధులు నిర్వర్తిస్తున్నారు. పదో తరగతి పూర్తి కాగానే ఇక్కడి గ్రామ యువత ఆర్మీలో ఆసక్తిగా చేరుతోంది. ఆర్మీలో పనిచేసే వారు తమ పిల్లలు, బంధువులను దేశ సేవకు అంకితం చేస్తున్నారు. సర్వీస్ పూర్తి చేసుకున్న వారు కొందరు ప్రైవేట్ పరిశ్రమల్లో.. మరికొందరు గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
కుటుంబమంతా దేశ సేవలోనే..
గ్రామానికి చెందిన ఓ కుటుంబం నుంచి నలుగురు అన్నదమ్ములు సైనికులయ్యారు. వీరిలో ఒకరు పదవీ విరమణ చేయగా.. మిగిలిన ముగ్గురు సేవలందిస్తున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఉప్పునూరి అచ్చిలినాయుడు, లక్ష్మి దంపతులకు నలుగురు కుమారులు. వీరంతా టెన్త్ పూర్తి కాగానే ఒకరి తర్వాత ఒకరు ఆర్మీలో చేరారు. పెద్దవాడైన శ్రీను, ఆ తర్వాత వరసగా నాగేశ్వరరావు, సత్తిబాబు, పరమేష్ ఆర్మీలో చేరారు. శ్రీను, నాగేశ్వరరావు కార్గిల్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సేవలందించారు. ముగ్గురు అన్నదమ్ములు దక్షిణాఫ్రికాలోని లిబనాన్, కాంగోలో కూడా దేశం తరఫున విధులు నిర్వర్తించారు. నాగేశ్వరరావు సుమారు 18 ఏళ్లపాటు పని చేసి 2020లో హవల్దార్ ఏసీపీగా పదవీ విరమణ చేశారు. అచ్యుతాపురంలోని ఐవోసీఎల్‌లో ప్రస్తుతం సెక్యూరిటీగా పని చేస్తున్నారు. మిగిలిన ముగ్గురు ఆర్మీలో కొనసాగుతున్నారు.
అదొక్కటే లోటు
మాది వ్యవసాయ కుటుంబం. జీవనోపాధి కోసం ఆర్మీలో చేరాం. నేను 18 ఏళ్ల పాటు పనిచేసి హవల్దార్‌గా గతేడాది పదవీ విరమణ చేశారు. ఆర్మీలో చేరడంతో మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. దాని కన్నా దేశానికి సేవలందించగలిగామన్న సంతృప్తి మిగిలింది. ఎత్తైన కార్గిల్ ప్రాంతంలో ఊపిరి ఆడక, సరైన తిండి లేక ఇబ్బందులు ఎదురైనా.. ఎంతో ఇష్టంగా సేవలందించాను. ఆరేళ్లపాటు అక్కడ విధులు నిర్వర్తించా. జమ్ము, కశ్మీర్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాలతోపాటు దక్షిణాఫ్రికాలో కూడా ఇండియన్ ఆర్మీ తరఫున సేవలందించా. విధి నిర్వహణ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా కలిసి గడిపే క్షణాలు చాలా తక్కువే. ఆర్మీలో చేరిన తర్వాత.. ఇప్పటివరకు అన్నదమ్ములమంతా ఒక్కసారి కూడా కలవలేదు. అదొక్కటే వెలితిగా ఉంది.
– ఉప్పునూరి నాగేశ్వరరావు, రిటైర్డు హవల్దార్, విసన్నపేట
సరిహద్దుల్లో విధులు నిర్వర్తించా..
ఆర్మీలో 28 ఏళ్లపాటు పని చేశారు. సుబేదార్‌గా పదవీ విరమణ చేశాను. నా తమ్ముడు సత్యారావు కూడా ఆర్మీలో చేరాడు. పాకిస్తాన్ యుద్ధ సమయంలో సరిహద్దుల్లో విధులు నిర్వర్తించాను.
– నడిశెట్టి పడమటయ్యనాయుడు, రిటైర్డు సుబేదార్, విసన్నపేట
సేవా దృక్పథంతోనే చేరుతున్నారు
దేశానికి సేవ చేయాలనే దృక్పథంతో ఆర్మీలో చేరుతున్నారు. ఆర్మీలో సురక్షితంగా విధులను నిర్వర్తించి రిటైర్ అవుతున్నారు. ఉద్యోగం అనంతరం ప్రైవేటు పరిశ్రమల్లో కొందరు పనిచేస్తున్నారు. మరికొందరు వ్యవసాయం సాగు చేస్తూ ప్రజాసేవకు అంకితమవుతున్నారు.
– కొఠారి నాగేశ్వరరావు, రిటైర్డ్ సుబేదార్, విసన్నపేట
Comments
Please login to add a commentAdd a comment