ధర్మవరం హైస్కూల్‌లో నిర్మించిన గ్రంథాలయం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ధర్మవరం జెడ్పీ హైస్కూల్... ఎస్.కోట మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాల. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన ఆ విద్యాలయం ఇప్పుడు ఆధునికీకరణకు అద్దం పడుతోంది. ధర్మవరం జెడ్పీ హైస్కూల్ స్టూడెంట్‌నని అక్కడి విద్యార్థులు ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నారు. దానికి రెండు కారణాలు... ఒకటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు. మరొకటి అక్కడి పూర్వ విద్యార్థి, పల్నాడు జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్ కృషి. విద్యాబుద్ధులు నేర్పడమే గాక తాను ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యానికి బీజం వేసిన పాఠశాలకు గురుదక్షిణ సమర్పించిన తీరు స్ఫూర్తిదాయకమైంది. సొంతంగా రూ.8.5 లక్షలు ఖర్చు చేసి డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చారు.
ఏదో చేశామంటే చేశామని గాకుండా ఆధునికీకరణ, సౌకర్యాల కల్పన, పుస్తకాల బహూకరణ... ఇలా ప్రతి విషయంలోనూ ఆయన ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. లోతేటి శివశంకర్ పదో తరగతి (1995–96 బ్యాచ్) వరకూ ధర్మవరం జెడ్పీ హైస్కూల్‌లో చదివారు. తర్వాత ఐఏఎస్ సాధించి వివిధ హోదాల్లో పనిచేస్తున్నా ఆ స్కూల్‌ను ఆయన మరచిపోలేకపోయారు. అత్యున్నత సర్వీసు సాధించడంలో తనను స్ఫూర్తి ప్రదాతగా భావిస్తున్న విద్యార్థులకు తన వంతు తోడ్పాటు అందించడానికి ఇతోధికంగా కృషి చేస్తున్నారు. అప్పటికే తన పదో తరగతి బ్యాచ్ స్నేహితులతో కలిసి బాహుదా సేవాసంఘాన్ని ఏర్పాటు చేశారు.
ధర్మవరం గ్రామంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. తిత్లీ తుఫాన్ సమయంలో దెబ్బతిన్న విద్యుత్తు వ్యవస్థను రెండ్రోజుల్లోనే పునరుద్ధరించగలిగారు. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా గ్రామంలో వైద్య సేవలు అందేలా ఆ సంఘం విశేష కృషి చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలతో ధర్మవరం జెడ్పీ హైస్కూల్‌కు రూపురేఖలు మారాయి. మన బడి నాడు–నేడు కార్యక్రమం ఎంతో దోహదం చేసింది. ఆర్నెల్ల క్రితం ఆ పాఠశాలను సందర్శించిన శివశంకర్... అక్కడి విద్యార్థుల విద్యా మనోవికాసానికి ఉపయోగపడేలా డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తండ్రి పేరుతో రూ.8.5 లక్షల విరాళం..
డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడానికి పాఠశాల ప్రాంగణంలోనే ఒక హాల్‌ను శివశంకర్ ఎంపిక చేశారు. తన తండ్రి లోతేటి సన్యాసప్పడు పేరుతో రూ.8.5 లక్షల విరాళంగా సమకూర్చారు. ఆ నిధులతో చక్కని మార్చుల్స్, సీలింగ్, గోడలకు పుట్టీ, పెయింటింగ్‌తో ఆహ్లాదంగా ఆ హాల్‌ను అభివృద్ధి చేశారు. ఏసీ సౌకర్యంతో పాటు స్టడీ టేబుళ్లు, కుషన్ కుర్చీలు సమకూర్చారు. రెండు కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇక పుస్తకాలను సమకూర్చడంలో శివశంకర్ తన వంతు కృషి చేశారు. తాను చదువుకున్న, సేకరించిన పుస్తకాలను లైబ్రరీకి ఇచ్చేశారు.
చలం మాస్టారి సహకారంతో వైజ్ఞానిక, సాహిత్య, పోటీ పరీక్షల పుస్తకాలన్నీ అందుబాటులోకి తెచ్చారు. అవన్నీ భద్రంగా ఉంచేందుకు ప్రత్యేక కప్‌బోర్డులను ఏర్పాటు చేశారు. అత్యధిక కాలం లైబ్రరీలో పుస్తక పఠనంలోనే గడిపిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను విద్యార్థులు స్పూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ డిజిటల్ లైబ్రరీకి ఆయన పేరుతోనే నామకరణం చేశారు. అంతేకాదు పుస్తక పఠనం వైపు విద్యార్థుల ఆసక్తిని పెంచడానికి పోటీ కూడా పెట్టారు. రానున్న దసరా సెలవుల్లో బాహుదా సేవాసంఘం సభ్యులు వారికి పోటీ పరీక్ష నిర్వహించనున్నారు. అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన తొలి 20 మంది విద్యార్థులను ఐదు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో విజ్ఞాన యాత్రకు తీసుకెళ్తానని శివశంకర్ హామీ ఇవ్వడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment