తిరుపతి అన్నమయ్య సర్కిల్: పారదర్శకంగా జరిగిన తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మే 2వ తేదీ ఈ ఓట్లను లెక్కించనున్నారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్దసంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను ఆరింటిలో మహిళల ఓట్లే ఎక్కువ పోలయ్యాయి.
మొత్తం ఓటర్లు 17,10,699 మంది ఉండగా 10,99,814 ఓట్లు (64.29 శాతం) పోలయ్యాయి. పురుషులు 5,43,450 మంది, మహిళలు 5,56,341 మంది, ఇతరులు 23 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పురుషుల ఓట్ల కంటే 12,891 మహిళల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. ఈ పార్లమెంట్ స్థానం పరిధిలో చిత్తూరు జిల్లాలో తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నెల్లూరు జిల్లాలో గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
ఈ అన్ని సెగ్మెంట్లలోను మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వీటిలో తిరుపతి, సూళ్లూరుపేట అసెంబ్లీ సెగ్మెంట్లు మినహా మిగిలిన 5 సెగ్మెంట్లలోను మహిళల ఓట్లే ఎక్కువ పోలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తమ గెలుపు నల్లేరుమీద నడకేనని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు.
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పథకంలోను మహిళలకు పెద్దపీట వేయడం, మహిళలు అన్ని రంగాల్లోను ఉన్నతస్థాయికి చేరుకునేందుకు ఆర్థికసాయం చేయడంతో పాటు, ప్రతి పేద మహిళ పేరుతో ఇంటి స్థలం కేటాయించడం వంటి చర్యలతో మహిళల ఓట్లు తమకే పడ్డాయని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. పోలింగ్ సరళిని చూసిన తరువాత టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి.. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ నిస్తేజంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment