Truth And Unknown Facts Behind Vdeshi Vidya Deevena Scheme In AP, Full Details Inside - Sakshi
Sakshi News home page

ఏది నిజం?: విదేశీ విద్యా దీవెన అందిందెవరికి?

Published Sat, Jun 25 2022 7:27 AM | Last Updated on Sat, Jun 25 2022 9:33 AM

Which Is Truth Behind Vdeshi Vidya Deevena In AP - Sakshi

(ఫైల్‌ఫోటో)

టీడీపీ నేతల సిఫారసులతో... కనీసం ఒక్కశాతం కూడా పారదర్శకత లేకుండా నడిచిన ‘విదేశీ విద్యా దీవెన’ ఆగిపోయిందంటూ ‘ఈనాడు’ గుండెలు బాదేసుకుంటోంది. దాన్ని చంద్రబాబే బకాయిలు పెట్టేసి నిలిపేశాడన్న వాస్తవాన్ని మాత్రం ఆ పత్రిక ప్రస్తావించడమే లేదు. పైపెచ్చు ఆ పథకం అమల్లో వెలుగుచూసిన అవకతవకలు... సోషల్‌ ఆడిట్లో బయటపడ్డ నకిలీ లబ్ధిదారులు... ఇవేవీ ‘ఈనాడు’ అధిపతి రామోజీరావుకు పట్టవు. ఇప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కాబట్టి... ఇచ్చిన మాట తప్పకుండా ముందుకెళుతున్నందుకు నానాటికీ ప్రజాదరణ పెరుగుతోంది కాబట్టి... ఏదో ఒకరకంగా బురద జల్లడమే ఆయన పని. దాన్లో భాగమే ఈ కథనాలు. ‘ఈనాడు’ రాతల్లో నిజమెంతో ఒకసారి చూద్దాం...

విదేశాల్లో చదువుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వ పరంగా సహకారమందించడానికి ఉద్దేశించిందే ‘విదేశీ విద్యాదీవెన’ పథకం. చంద్రబాబు దీన్ని ఎంత ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నా... వాస్తవంగా అమలు చేసింది మాత్రం తక్కువ మందికే. పైపెచ్చు పారదర్శకతకు తావే లేకుండా... తమ పార్టీ నాయకుల సిఫారసులుంటే చాలన్న రీతిలో వ్యవహరించారు. ఇన్ని చేసి కూడా... ఒకటి రెండేళ్లు అమలు చేశాక 2017–18 నుంచి పూర్తిస్థాయిలో చెల్లింపులు నిలిపేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, బ్రాహ్మణ, మైనారిటీలకు బాబు సర్కారు పూర్తి స్థాయిలో బకాయిలు పెట్టేసింది. ఫలితంగా విదేశీ విద్య కోసం 3,326 మందికి ఈ పథకాన్ని వర్తింపజేసి కూడా... వారికి చెల్లించాల్సిన రూ.318.80 కోట్లు బకాయిలు పెట్టేసింది. ఆ బకాయిలు చెల్లించకుండానే... రెండేళ్ల తరవాత 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది. 

2019లో అధికారం చేపట్టిన సీఎం జగన్‌.. విదేశీ విద్యా కానుక పథకం అమలు తీరును సమీక్షించారు. దీనిపై సోషల్‌ ఆడిట్‌కు ఆదేశించారు. ఈ ఆడిట్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రపంచంలో ఎక్కడో ఉన్నాయో లేవో తెలియని యూనివర్సిటీల నుంచి కూడా.. ఐ–20 ఫారం తెచ్చి సబ్మిట్‌ చేస్తే చాలు. వారు చదువుతున్నారా? లేదా? అసలు ఆ యూనివర్సిటీ ఎలాంటిది? ఇవేవీ చూడకుండానే టీడీపీ నేతల ఒత్తిళ్లతో చాలామందిని అర్హులుగా చేశారు. నిజమైన పేద విద్యార్థులు అర్హులైనా కూడా దీనికి నోచుకోలేదు. ఈ పథకం అమల్లో పారదర్శకత లేశమాత్రమైనా లేదని, అత్యంత లోపభూయిష్టంగా ఉందని ఆడిట్‌లో గుర్తించారు. దీంతో ఈ పథకం లబ్దిదారులు, దరఖాస్తు చేసుకున్న వారి వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్‌ అధికారులు ఈ పథకం అమలులో అక్రమాలు జరిగాయని గుర్తించారు.

పేద విద్యార్థులకు అందాల్సిన పథకం... టీడీపీ నేతల సిఫారసులతో సంపన్న వర్గాలకిచ్చి దుర్వినియోగం చేశారని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి... ఆ తరవాతే తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎం భావించారు. అయితే ఇప్పటికే ఈ పథకం ద్వారా విదేశీ విద్యకు వెళ్లిన విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే పెద్ద మనస్సుతో గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లిస్తున్నారు. ఇప్పటికే రూ.112.46 కోట్ల బకాయిలు చెల్లించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీల బకాయిలైతే పూర్తిగా చెల్లించేశారు. ‘ఈనాడు’ మాత్రం ఇవేవీ ఎరగనట్లు హద్దుల్లేని దుష్ప్రచారానికే ప్రాధాన్యమిచ్చింది. పథకంలో జరిగిన అక్రమాల ప్రస్తావన కూడా తేకుండా.. బాబు బకాయిల గురించి తెలియనట్లుగా... జగన్‌ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తోంది. 

ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో చదువుకునేలా...
గత ప్రభుత్వ హయాంలో ఊరూపేరూ లేని విశ్వవిద్యాలయంలో అడ్మిషన్‌ చూపించి అర్హులను ఎంపిక చేయడం... పేదలకు ఇవ్వకుండా నిధులు దుర్వినియోగం చేయటం వంటి పరిణామాలతో ప్రభుత్వం ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే సంకల్పంతో ఉంది. ప్రపంచంలోని టాప్‌–200 విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు సాధించిన విద్యార్థులకు ‘విదేశీ విద్యా కానుక’ అందించేలా పథకంలో మార్పులు చేస్తోంది. ఈ మేరకు కసరత్తు దాదాపుగా పూర్తిచేసిన అధికారులు... త్వరలో తగిన ఉత్తర్వులివ్వనున్నారు కూడా. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... విదేశీ విద్యలోనూ ‘నాణ్యత’కు పెద్దపీట వేసి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చేరిన వారికే దీన్ని వర్తింపజేయాలని చూస్తోంది. తేడా తెలుసుకోండి రామోజీరావు గారూ!!.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement